close

తాజా వార్తలు

మీరైతే ఏం చేస్తారు?

ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌నే కోరుకుంటున్నారు. అలాంటివారికి పోషకాహారం అలవాటు చేయడం చాలా కష్టం. ఓ తల్లిగా మీరు మీ పిల్లలకు పోషకాహారం పెట్టేందుకు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు... పాఠకుల నుంచి విశేష స్పందన వచ్చింది.  అవేంటో చదివేయండి.
*మా పిల్లలు పానీపూరీ, నూడుల్స్‌ వంటి వాటికి అలవాటుపడ్డారు. అప్పుడప్పుడు కడుపునొప్పి అంటూ బాధపడేవారు. దీంతో వాళ్లు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక రాగిజావ, అంబలిలో బెల్లం వేసి తినిపించడం అలవాటుచేశా. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శక్తినీ ఇస్తాయని వారికి అర్థమయ్యేలా వివరించా. అప్పటి నుంచీ ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు.

- రూప, సాలూరు

* మేం ఇంట్లో పోషకాహారాన్నే తీసుకుంటాం. ఆరోగ్యకరమైన ఆహారంతో కలిగే లాభాలను, జంక్‌ఫుడ్‌తో వచ్చే అనారోగ్యాలను వారికి అర్థమయ్యేలా వివరిస్తాం. మార్కెట్లో దొరికే చిప్స్‌, బేకరీ ఫుడ్‌కు అలవాటు పడకుండా మావంతు ప్రయత్నం చేస్తున్నాం.

- తులసి, విజయవాడ

*  పిల్లలకు ఆహారం విషయంలో క్రమశిక్షణ అలవాటు చేయాలి. ఎప్పుడో ఓసారి జంక్‌ఫుడ్‌ తింటే ఫరవాలేదు కానీ వాటికి అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. మా పిల్లలు స్నాక్స్‌ అడిగితే ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను, కాలానుగుణంగా దొరికే పండ్లను ఇస్తున్నాం. బయటి ఆహారానికి సాధ్యమైనంత దూరంగా ఉంచుతున్నాం.

- శాంతాభాస్కర్‌, చిత్తూరు

*  మా పిల్లలకు సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసినవే పెడతా. పండ్లు, పండ్లరసాలు, చిక్కీలు, మిల్క్‌షేక్‌లు రుచికరంగా తయారు చేస్తా. స్కూల్‌కు పంపే స్నాక్స్‌లో జంక్‌ఫుడ్‌ లేకుండా చూస్తా. నెలకు రెండుసార్లే బయటి ఆహారం తినడానికి అనుమతిస్తా.

- ప్రమోదా గణేష్‌, అమీన్‌పూర్‌

* ఓ తల్లిగా పిల్లల ఇష్టాలు, రుచులు ప్రేమతో తెలుసుకోవాలి. మేమైతే హోటల్‌ భోజనానికి పూర్తిగా దూరంగా ఉంటాం. వంట చేసేటప్పుడు పిల్లలకు చూపిస్తూ, వేటిని ఎలా చేయాలి, వాటితో లాభాలేంటనేది వివరిస్తా. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూస్తా.

- కన్నేపల్లి ఉదయచంద్రిక, ఖుర్జా, ఉత్తరప్రదేశ్‌

* ఓ ఉపాధ్యాయురాలిగా ఎదుగుతున్న పిల్లలకు పోషకాహారంతో కలిగే లాభాలను వివరిస్తున్నా. విద్యార్థుల అభిమాన తారలు, క్రీడాకారులు, ఇతర రంగాల్లో ఆదర్శంగా భావించేవారి ఆహారపు అలవాట్లు వివరిస్తూ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండేలా చూస్తున్నా.

- సయ్యద్‌ జమిలబేగం, కమలానగర్‌, కర్నూలు

*  మా బాబు చిన్నప్పుడు కేకులు, బిస్కెట్లు, శీతల పానీయాలు వంటి వాటికి అలవాటుపడ్డాడు. వీటిని దూరం చేయడానికి ఇంట్లోనే గుడ్డు, మొలకలు, తృణధాన్యాలతో కొత్త వంటకాలు చేసిపెట్టేదాన్ని. ఐస్‌క్రీంలు, కేకులకు బదులు సలాడ్లు, ఫ్రూట్‌మిక్స్‌ వంటివి అలవాటు చేశా. క్రమంగా జంక్‌ఫుడ్‌కు దూరమయ్యాడు.

- జి.సరళాజగన్నాథ్‌, విజయనగరం

* నేనెంత రుచిగా వండిపెట్టినా మా బాబు తినేవాడు కాదు. ఎప్పుడూ బయటి ఆహారమే కావాలనేవాడు. ఈ అలవాటును మాన్పించాలని కౌన్సెలింగ్‌ ఇప్పించినా ప్రయోజనంలేదు. ఓసారి వాడు విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే... ఆయన జంక్‌ఫుడ్‌ వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూనే హెచ్చరించారు. అప్పటి నుంచీ మా బాబు జంక్‌ఫుడ్‌ తినట్లేదు. తనకు నచ్చినవి ఇంట్లోనే వండిపెడుతున్నా.

- అందలం లక్ష్మీదేవి, కడప

* పిల్లలు జంక్‌ఫుడ్‌ తినాలని ఉందని చెప్తే... ఇంట్లోనే వివిధ రకాల వంటకాలను వారికి నచ్చేలా చేసి పెట్టాలి. స్నాక్స్‌లో చిరుధాన్యాలతో చేసిన దోసెలు, ఓట్‌మిక్స్‌ వంటివి వినూత్నంగా చేసి ఇస్తే పిల్లలు జంక్‌ఫుడ్‌ జోలికి పోరు. నేను అదే చేస్తా.

- నీరజ, మహబూబ్‌నగర్‌

* పిల్లలకు రోజూ తినిపించే ఆహారంలో పోషకాలు ఉంటున్నాయా లేదా అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి. నేనైతే వివిధ రంగులు, ఆకృతుల్లో ఉండే ఆహర పదార్థాలను పిల్లలు ఇష్టపడేలా తయారుచేస్తున్నా. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలు ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.

- కావ్య, ఖమ్మం

*  పిల్లలు పోషకాహారం తీసుకోవాలంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. నేనైతే వండిన ఆహర పదార్థాలను ఆకర్ణణీయంగా చేసి వడ్డిస్తున్నా. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. పిల్లల అభిరుచి మేరకు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ అందిస్తున్నా.

-.వి.నాగమణి, మాచర్ల, గుంటూరు

* మా బాబు ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడ్డాడు. వీటిని దూరం చేసేందుకు అలాంటి పదార్థాలనే ఇంట్లో చేసి వినూత్నంగా వండిపెడుతున్నా. ఉల్లిపాయ, ఆకుకూరలు, మొక్కజొన్న, క్యారెట్‌ వంటివి తినడు. దీంతో కార్న్‌బిర్యాణీ, ఆకుకూరలతో ఫ్రైడ్‌రైస్‌, ఉల్లిదోసె, రైత వంటివి చేసి పెడుతున్నా. అన్ని రకాల పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.

- కల్యాణి

* మేం పెట్టినవి తింటేనే పార్కుకు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్తానని చెప్పి మా బాబుకు పోషకాహారం తినిపిస్తున్నా. ఫోన్‌, టీవీల్లో నచ్చిన ప్రోగ్రాంలు చూపిస్తూ, కథలు చెప్తూ, కొన్నిసార్లు వాడికి నచ్చేవాటినే తినిపిస్తున్నా. ఓపికతో వాడికి మంచి ఆహారపు అలవాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.

- మసర్రత్‌, సిద్దిపేట

* వేపుళ్లు, మసాలాలు ఉండే పదార్థాలను ఇంట్లో ఎక్కువగా వండను. పానీపూరీ, రోడ్ల పక్కన వేసే బజ్జీలు, బేకరీలో దొరికేవి తింటామని పిల్లలు అడిగితే... వాటితో వచ్చే అనారోగ్యాలను వివరిస్తూ యూట్యూబ్‌లో పెట్టిన వీడియోలు చూపిస్తా. వారికి కావాల్సినవి ఇంట్లోనే తయారు చేసి ఇస్తా.

-  జానపాటి సంధ్యారాణి, మిర్యాలగూడ

* ఈ రోజుల్లో పిల్లలు శీతలపానీయాలు, జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. దీంతో చిన్నారుల శరీరంలో కెలొరీలు, కొవ్వులు పేరుకుపోయి ఉబకాయం, మధుమేహం, గుండెజబ్బులు వంటి అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాంటి వాటిపై పిల్లలకు అవగాహన పెంచాలి. శీతల పానీయాలకు బదులుగా కొబ్బరినీళ్లను, చిప్స్‌, బేకరీఫుడ్‌కు బదులుగా ఇంట్లో చేసే వంటకాలను అలవాటు చేయాలి. వృథా ఖర్చులు తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నేను అలాంటివే పాటిస్తా.

- కొలిపాక రాణిశ్రీనివాస్‌, ఫిర్జాదిగూడ, బోడుప్పల్‌

* ఈ కాలం పిల్లలు జంక్‌ఫుడ్‌ తినడానికే ఇష్టపడుతున్నారు. నేనైతే మా పిల్లలకు ఇంటి భోజనంపై ఇష్టం పెరగడానికి ఆహారాన్ని రుచిగా, కూరగాయలతో అలంకరించి వడ్డిస్తా. వారు కోరుకునే రుచి వచ్చేలా ఇంట్లో ఉండే వాటితోనే వంటకాలు తయారుచేస్తా. దీంతో వారికి ఆసక్తి పెరిగి ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తారు.

- జె.కృప, విజయవాడ

* మా పాపను మొదటినుంచీ జంక్‌ఫుడ్‌కు దూరంగా పెంచుతున్నాం. గోధుమ పిండిలో క్యారట్‌, బీట్‌రూట్‌ రసం కలిపి చపాతీలు చేసి ఇస్తున్నా. పళ్ల రసాలు అలవాటు చేశా. బయటకు వెళ్తే పాప ముందు మేము ఎలాంటి జంక్‌ఫుడ్‌ తినం.

- నాగలక్ష్మి, విజయవాడ

*  ఈ రోజుల్లో పిల్లలు జంక్‌ఫుడ్‌నే ఇష్టపడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అందుకే మా పిల్లలకు నచ్చినట్లుగా కూరగాయలు, ఆకుకూరలతో కొత్తరకం వంటలు చేసి పెడుతున్నా. దీంతో వారు బయటి ఆహారానికి దూరంగా ఉంటున్నారు.

- ఆర్‌.శైలజ, విజయవాడ

*  నేనైతే ఏరోజు ఏంవండాలో పిల్లల్నే అడుగుతా. తాజా ఆకుకూరలు, కూరగాయలతో కలిగే లాభాలను వివరిస్తా. వంటలో వారినీ సాయం చేయమంటా. ఒకసారి వండినవి మళ్లీ పదిహేను రోజుల వరకు వండను. దీంతో వారికి ఆహార పదార్థాలపై అవగాహన పెరగడంతో పాటు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటారు.

- మహేశ్వరి, విశాఖపట్టణం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.