close
మనం ఒకటయ్యాం

హ్యూస్టన్‌ నుంచి హైదరాబాద్‌ వరకూ..
బోస్టన్‌ నుంచి బెంగళూరు దాకా..
షికాగో నుంచి శిమ్లా వరకూ..
మోదీ, ట్రంప్‌ ఉద్ఘాటన

భారత్‌-అమెరికా మధ్య పటిష్ఠమైన మైత్రికి హ్యూస్టన్‌ వేదికగా నిలిచింది. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం లిఖితమయింది. ‘హౌడీ మోదీ’ పేరుతో నిర్వహించిన సభను ఉద్దేశించి మోదీ, ట్రంప్‌ చేసిన ప్రసంగాలకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి నడిస్తే కలిగే ప్రయోజనాలను అగ్రనేతలు వివరించారు. భారత్‌-అమెరికాలు ఒక్కటయ్యాయంటూ నినదించారు.

ప్రపంచ ఇంధన రాజధాని హ్యూస్టన్‌ ‘హౌడీ.. మోదీ’ అంటూ ఉర్రూతలూగింది. ప్రపంచ యవనికలో భారత పలుకుబడి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ, ప్రవాస భారతీయుల సత్తాకు నిదర్శనంగా నిలిచిన మెగా కార్యక్రమం రెండు దేశాల మధ్య మైత్రిబంధంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు హాజరై ఉత్తేజభరితంగా మాట్లాడారు.

ట్రంప్‌, మోదీ కలిసి మెగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి. మొదట ఇంగ్లిష్‌లో మాట్లాడిన మోదీ, ట్రంప్‌ ప్రసంగం ముగిశాక హిందీలో ప్రసంగించారు. కార్యక్రమం చివర్లో నేతలిద్దరూ స్నేహపూర్వకంగా చేతిలో చేయి వేసుకుని వేదిక వద్ద కలియతిరుగుతూ అందరికీ అభివాదం చేయడం సభకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సమయంలో డ్రమ్‌ చప్పుళ్లతో ప్రాంగణం హోరెత్తింది.

ఉగ్రవాదుల అడ్డా పాక్‌ పాక్‌ది విద్వేష ఎజెండా. అది ఉగ్రవాదుల అడ్డా. అక్కడ నియంత్రణ లేనివారు భారత్‌పై విమర్శలు చేస్తున్నారు. భారత్‌, అమెరికా ప్రజల మధ్య హృదయపూర్వక సంబంధాలున్నాయి. హ్యూస్టన్‌ నుంచి హైదరాబాద్‌ వరకు, బోస్టన్‌ నుంచి బెంగళూరు దాకా, షికాగో నుంచి శిమ్లా వరకు, లాస్‌ ఏంజిలెస్‌ నుంచి లుధియానా దాకా మన ప్రజల మైత్రి పరిఢవిల్లుతోంది. - మోదీ

మోదీ ప్రపంచ సేవకుడు

భారత్‌తోపాటు ప్రపంచమంతటికీ మోదీ గొప్ప సేవ చేస్తున్నారు. భారత, అమెరికాల మధ్య బంధాలు మునుపెన్నడూ లేనంతగా బలోపేతమయ్యాయి. ప్రపంచానికి మనం మార్గనిర్దేశనం చేస్తున్నాం. - ట్రంప్‌

ఉగ్రవాదుల అడ్డా పాక్‌
వారిది విద్వేష ఎజెండా
దుయ్యబట్టిన ప్రధాని మోదీ
హ్యూస్టన్‌ సభలో ఉత్తేజభరిత ప్రసంగం
ట్రంప్‌ మళ్లీ గెలవాలని ఆకాంక్ష
హ్యూస్టన్‌

‘హౌడీ మోదీ’కి వేదికగా నిలిచిన ఎన్‌ఆర్‌జీ స్టేడియం వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ‘భారత్‌ మాతాకీ జై, వందేమాతరం, జై మోదీ, హౌడీ మోదీ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మోదీ, ట్రంప్‌లు చేతిలో చేయివేసుకుని నడుస్తూ సభికులందరికీ అభివాదం చేస్తూ వెళ్లారు.

గ్రవాదంపై నిర్ణయాత్మక పోరుకు సమయం ఆసన్నమయిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముష్కరులపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుగా నిలిచారని కొనియాడారు. అమెరికాను కుదిపేసిన 9/11 ఉగ్రవాద దాడులు, ముంబయిలో జరిగిన ముష్కర మారణకాండకు మధ్య సారూప్యతలను ప్రస్తావిస్తూ ఉగ్రవాదానికి అడ్డాగా మారిందని పాకిస్థాన్‌ను పరోక్షంగా దుయ్యబట్టారు. ఆ దేశ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత దేశాన్ని చక్కదిద్దుకోలేనివారికి భారత్‌లో 370 అధికరణం ఉపసంహరణ ఇబ్బందికరంగా మారిందన్నారు. వారి రాజకీయ వైఖరి భారత్‌ పట్ల విద్వేషాన్ని వెదజల్లేలా, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా ఉందని దుయ్యబట్టారు. ‘‘ప్రపంచం మొత్తానికీ ఇది తెలుసు. అమెరికాలో జరిగిన ‘సెప్టెంబరు 11’ దాడుల వెనక ఉన్నవారైనా, ముంబయి దాడులకు సూత్రధారులైనా వారి చిరునామా ఒక్కటేనంటూ పాక్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారిపై నిర్ణయాత్మక పోరాటం చేయాల్సిన సమయమిదేనని ట్రంప్‌ సమక్షంలో స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ట్రంప్‌ మద్దతుగా నిలిచారని చెప్పారు. దీంతో సభికులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ట్రంప్‌ను అభినందించారు. ‘‘370 అధికరణం వల్ల జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదానికి ఊతం లభించింది. దాన్ని ఉపసంహరించడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి, సుసంపన్నత సాధ్యమవుతుంది. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు వ్యతిరేకంగా సాగుతున్న వివక్ష అంతమవుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు. ఈ అధికరణాన్ని వెనక్కి తీసుకోవాలని భారత పార్లమెంటు మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకు భారత పార్లమెంటేరియన్లకు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు చెప్పాలని సభికులను కోరారు.

అవినీతిపై పోరు
భారత్‌లో అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను మోదీ ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం ఇదే చర్చనీయాంశమని తెలిపారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం దిశగా సాగించిన కృషిని ప్రస్తావించారు. అవినీతిపై పోరు సాగిస్తున్నట్లు వివరించారు. ‘‘నవ భారతాన్ని సాధించాలన్నది భారత ప్రజల ఆకాంక్ష. ఈ కల సాకారానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. వేరెవరితో కాకుండా మాతో మేమే పోటీ పడుతున్నాం. మాకు మేమే సవాళ్లు రువ్వుకుంటున్నాం. ఏదీ ఎప్పటికీ మారబోదన్న ఆలోచనతీరును భారత్‌ నేడు సవాల్‌ చేస్తోంది. మేం ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని, వాటిని మించిన ఫలితాలు రాబడుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను సరళీకరిస్తూ  ఇటీవల తాము తెచ్చిన సంస్కరణలను ప్రస్తావించారు. దాని వల్ల భారత కంపెనీల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ‘‘చర్చల్లో నేను గట్టిగా వ్యవహరిస్తుంటానని ట్రంప్‌ అంటుంటారు. ఒప్పందాలు ఖరారు చేయడంలో ఆయన నిపుణుడు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. కుటుంబంతో సహా భారత్‌ను సందర్శించాలని ఆయన ట్రంప్‌ను ఆహ్వానించారు.  భిన్నత్వమే భారత ప్రజాస్వామ్యానికి పునాది అని మోదీ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య సమాజానికి దేశంలోని అనేక భాషలే తార్కాణమని చెప్పారు. పదుల సంఖ్యలో భాషలు, వందలాది యాసలతో భారత్‌ శతాబ్దాలుగా ముందడుగు వేస్తోందన్నారు. దేశంలో భాషాపరమైన వైవిధ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ‘భారత్‌లో అంతా బాగుంది’ అన్న మాటను తెలుగు సహా పలు భారతీయ భాషల్లో చెప్పారు.

ట్రంప్‌ ఎంతో ప్రత్యేకం
అంతకుముందు డొనాల్డ్‌ ట్రంప్‌ను భారత అమెరికన్లకు పరిచయం చేస్తూ చాలా ‘ప్రత్యేకమైన వ్యక్తి’గా మోదీ అభివర్ణించారు. ‘‘ఈ అద్భుత స్టేడియానికి, సభకు, ట్రంప్‌నకు స్వాగతం చెప్పడం నాకు దక్కిన గౌరవం. భారత్‌లోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మన వద్ద ఒక విశిష్ఠ వ్యక్తి ఉన్నారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందే ఆయన పేరు ప్రతి ఇంట్లోనూ మారుమోగింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు సుపరిచితం. ప్రపంచ రాజకీయాల్లో దాదాపుగా అన్ని చర్చల్లోనూ ఆయన పేరు ప్రస్తావనకు వస్తుంది. సీఈవో నుంచి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ వరకూ, బోర్డ్‌ రూమ్‌ల నుంచి ఓవల్‌ ఆఫీస్‌ వరకూ, స్టూడియోల నుంచి అంతర్జాతీయ వేదిక వరకూ, రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ, భద్రత వరకూ అన్నింటి ఆయన తనదైన దీర్ఘకాల ముద్ర వేశారు’’ అని చెప్పారు. ‘‘ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య ఉన్న గొప్ప భాగస్వామ్యాల వేడుక తాలూకు హృదయ స్పందన నేడు హ్యూస్టన్‌లో మీరు వినవచ్చు. రెండు దేశాల నడుమ ఉన్న బంధం పటిష్ఠత, లోతును మీరు చవిచూడొచ్చు. ఏ బంధానికైనా ప్రజలే హృదయం. హ్యూస్టన్‌ నుంచి హైదరాబాద్‌ వరకూ, బోస్టన్‌ నుంచి బెంగళూరు వరకూ, షికాగో నుంచి శిమ్లా వరకూ, లాస్‌ ఏంజిలెస్‌ నుంచి లూధియానా వరకూ ఇదే అనుబంధం వెల్లివెరిసింది’’ అని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్‌ తిరిగి పరిపుష్ఠం చేశారన్నారు. ‘‘అమెరికాకు, ప్రపంచానికి ఆయన ఎంతో సాధించారు. భారత్‌లో ఉంటున్నం మేం కూడా ఆయనతో బాగా మమేకమయ్యాం’’ అని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మళ్లీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ‘అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అని వ్యాఖ్యానించారు.

‘టెక్సాస్‌ ఇండియా ఫోరం’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ఉమ్మడి స్వప్నాలు, దేదీప్యమాన భవిత’ అనే ట్యాగ్‌లైన్‌తో దీన్ని ఏర్పాటు చేశారు. ‘హౌడీ మోదీ’ అనేది ‘హౌ డు యు డు, మోదీ’ అనే పలకరింపునకు సంక్షిప్త రూపం. ఈ కార్యక్రమానికి 20 దేశాలు, అమెరికాలోని 48 రాష్ట్రాల నుంచి 50వేల మందికిపైగా హాజరయ్యారు. పోప్‌ కాకుండా అమెరికాను సందర్శిస్తున్న ఒక విదేశీ నేత కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కాంగ్రెస్‌ సభ్యులు హాజరయ్యారు.

ఇదే నా కుటుంబం
‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. 2017లో మీరు మీ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు.
నేడు నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నా’’ అంటూ సభకు హాజరైన జనాన్ని మోదీ ట్రంప్‌నకు చూపించారు.

 

వార్తలు / కథనాలు

మరిన్ని