
న్యూయార్క్: పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు రావాలని పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ పిలపునిచ్చారు. దేశంలో అందుకు అనుగుణమైన వాతావరణం ఉందని చెప్పారు. ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం కల్పించిందన్నారు. దీన్ని బంగారం లాంటి అవకాశంగా మోదీ అభివర్ణించారు. న్యూయార్క్‌లో బ్లూమ్‌బెర్గ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ ఫోరం -2019లో మోదీ పెట్టుబడిదారులనుద్దేశించి ప్రసంగించారు.
‘‘పెట్టుబడులకు అనుకూలమైన మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారా? భారత్ రండి. అతిపెద్ద మార్కెట్ కలిగిన స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే, భారత్‌కు రండి. ప్రపంచంలోనే అతి ఎక్కువ మౌలిక వసతులు కలిగిన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్ రండి’’ అంటూ పెట్టుబడిదారులను మోదీ అహ్వానించారు. భారత్‌లోని నగరాలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రక్షణ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. సులభతర వాణిజ్యం కోసం 50 చట్టాలను రద్దు చేశామని వివరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాపారాన్ని గౌరవించే, సంపదను సృష్టిని ప్రోత్సహించే ప్రభుత్వం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే అయ్యిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. ఇంకా సుదూర ప్రయాణం ఉందన్నారు.
భారత్ 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్య్ంగా పెట్టుకుందని మోదీ వివరించారు. ప్రస్తుతం 1 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక వ్యవస్థను జోడించామన్నారు. గత ఐదేళ్లలో 286 బిలియయన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతకుముందున్న 20 ఏళ్లతో పోల్చినప్పుడు దాదాపు ఇది సగమని వివరించారు. ‘మీ కోరికలు, మా కలలు సరిగ్గా సరిపోలాయి. మీ సాంకేతికత, మా ప్రతిభ ప్రపంచాన్నే మార్చగలదు’ అని మోదీ పెట్టుబడిదారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ రండి ఎక్కడైనా గ్యాప్ ఉంటే తాను ఒక బ్రిడ్జిలా వ్యవహరిస్తానని వారికి భరోసా ఇచ్చారు.