close
‘గాంధేయవాద విస్తరణకు ప్రవాసుల కృషి అమోఘం’

టెక్సాస్‌: మహాత్ముడి విధానాలను అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ ఆధ్వర్యంలో సోమవారం అమెరికాలోని ఇర్వింగ్‌లో మహాత్మా గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీజీ 150వ జయంత్యుత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ష్రింగ్లా గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించినప్పుడు గాంధీజీ చరిత్రను దగ్గరగా చూశానన్నారు. గాంధీయిజం ద్వారా మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు అహింసాయుత పోరాటాలకు ఆకర్షితులయ్యారని చెప్పారు. 150వ జయంతి ఉత్సవాలను అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో సైతం నిర్వహించామని, యూఎస్‌ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తన జీవితంపై గాంధీజీ ప్రభావాన్ని నెమరువేసుకున్నారని తెలిపారు.

రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రత్యేక అతిథిగా పాల్గొని బాపూజీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గాంధీ స్మారకస్థలిని సందర్శించిన మొదటి భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్‌ అనుపమ్ రే, కాన్సులేట్ అధికారులు సురేంద్ర అదానా, అశోక్, గాంధీ మెమోరియల్ డైరెక్టర్స్ రావు కల్వల, జాన్ హామేండ్, కమల్ కౌశల్, అక్రం సయాద్, షబ్నం మాడ్గిల్, జాక్ గద్వాని, స్వాతి షా, శాంటే చారి, శ్రీకాంత్ పోలవరపు, మురళీ వెన్నం తదితరులు పాల్గొన్నారు. గాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, అక్రం సయాద్‌ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాను శాలువాతో సత్కరించి, స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గాంధీజీ విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని