కరోనా వ్యాప్తి నివారణలో సర్కారు విఫలం: భట్టి

తాజా వార్తలు

Published : 29/08/2020 17:21 IST

కరోనా వ్యాప్తి నివారణలో సర్కారు విఫలం: భట్టి

కామారెడ్డి: కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఫార్మ్ హౌస్‌కు వెళ్లడంపై ఉన్న దృష్టి కరోనాపై రివ్యూ చేయడంలో లేదని ఎద్దేవా చేశారు. కరోనా ప్రభావిత జిల్లాల్లో వైరస్‌ తీవ్రత,  ప్రభుత్వ వైఫల్యాలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని భట్టి శనివారం సందర్శించారు. జిల్లాలో ఉన్న కొవిడ్ కేసుల వివరాలు, ఆసుపత్రిలో ఉన్న పడకలు, వైద్యుల వివరాలను సూపరింటెండెంట్ డా.అజయ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడి కొవిడ్ కేసులపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యుల కొరతను సూపరిండెంట్ అజయ్ కుమార్, ఆర్ఎంఓ శ్రీనివాస్ భట్టి దృష్టికి తీసుకెళ్లారు. 

అనంతరం మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ...  రాష్ట్రంలో కరోనా తీవ్రతను పసిగట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కరోనాపై ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టలేదని విమర్శించారు. పేరుకే కామారెడ్డి జిల్లా ఆసుపత్రి ఉందని ఇందులో వసతులు ఏమీ లేవని, వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు. జిల్లాలో కరోనా కేసులపై అధికారులు తలో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 4,270 కేసులని ఒకరు అంటే.. 3,400 కేసులు ఉన్నాయని మరొకరు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 జిల్లా ఆసుపత్రిలో 131 మంది వైద్యులకు 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలా అయితే ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో 4,270 కరోనా కేసులు ఉంటే ఇందులో 4 వేల మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారన్నారు. వీరందరికీ  ప్రభుత్వ ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా భట్టి డిమాండ్ చేశారు. కరోనా వైద్యం కోసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పిన కేసీఆర్.. రూ.వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని