రుషికొండ భూములు జగన్‌ హస్తగతం: యనమల

తాజా వార్తలు

Updated : 07/10/2020 13:00 IST

రుషికొండ భూములు జగన్‌ హస్తగతం: యనమల

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బినామీ లావాదేవీలపై కేంద్రం తక్షణమే స్పందించి అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ‘క్విడ్‌ ప్రోకో-2’కు తెరలేపారని ఆరోపించారు. 2004-09 మధ్య ‘క్విడ్‌ ప్రోకో-1’ జరిగితే.. ఇప్పుడు ‘క్విడ్‌ ప్రోకో-2’ను యధేశ్చగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. హెటిరో ముసుగులో విశాఖ బేపార్క్‌, బినామీల పేర్లతో రూ.300కోట్ల విలువైన రుషికొండ భూములు జగన్‌ హస్తగతమయ్యాయని ఆరోపించారు. జగన్‌పై సీబీఐ తొలి ఛార్జిషీట్‌లో ఏ3గా అరబిందో, ఏ4గా హెటిరో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అరబిందోకు కాకినాడ సెజ్‌ కట్టబెట్టిన జగన్‌.. ఇప్పుడు హెటిరోకు విశాఖ బేపార్క్‌ కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇది జగన్ మరో బినామీ లావాదేవీల్లో భాగమేనని యనమల దుయ్యబట్టారు.  

‘‘తెదేపా హయాంలో విశాఖ రుషికొండ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజంలో భాగంగా కొండ మీద, కొండ కింద 36ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. రూ.120కోట్లతో కొండపై వైద్య పర్యాటకం తరహాలో బేపార్క్ అభివృద్ధి చేశాం. ఈ ప్రాజెక్టు చేతులు మారటం వెనుక ఎవరి పాత్ర ఉంది? అధిక శాతం వాటాలు ఎవరి ఒత్తిళ్ల మేరకు హెటిరో దక్కించుకుంది? కొండ మీద వాటాల కొనుగోళ్లకు ప్రతిఫలంగా కొండ కింద రూ.225కోట్లు విలువ చేసే 9ఎకరాలు హెటిరోపరం చేయటం మరో బినామీ లావాదేవీ. గతంలో జడ్చర్ల సెజ్‌లో 75ఎకరాలు హెటిరోకు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థలో రూ.19.50కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ నిర్ధారించింది. హెటిరో అనుబంధ సంస్థలన్నింటిపైనా ఈడీ కేసులున్నాయి. కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేసి సీఎం జగన్‌ ‘‘క్విడ్ ప్రో కో-2’’ను గుట్టు రట్టు చేస్తా’’ అని యనమల స్పష్టం చేశారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని