Bengal: దీదీపై గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు 

తాజా వార్తలు

Published : 02/06/2021 01:07 IST

Bengal: దీదీపై గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు 

కోల్‌కతా: బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యస్‌ తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మమత ఆలస్యంగా రావడాన్ని ఉద్దేశిస్తూ ‘‘ప్రజాసేవలపై అహం ప్రభావం చూపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ వ్యాఖ్యలను అధికార తృణమూల్‌ పార్టీ ఖండించింది.  సీఎం మమతా బెనర్జీ నిరంతరం ప్రజల కోసమే  పని చేస్తున్నారని, గవర్నర్‌ ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తెలిపింది.

యస్‌ తుపాను ప్రభావంపై పశ్చిమ్‌ మిడ్నాపూర్‌లోని  కలైకుండలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముందు మమతా బెనర్జీ తనకు ఫోన్‌ చేశారని, ‘ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆ సమావేశానికి హాజరైతే, తాను ఎట్టిపరిస్థితుల్లోనూ హాజరుకాబోను’ అని తేల్చి చెప్పారని ధన్‌కడ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘మే 27 రాత్రి 23.16 గంటల సమయంలో.. నేను మాట్లాడొచ్చా? అత్యవసరం.. అని మమతా బెనర్జీ ఆఫీసు నుంచి సందేశం వచ్చింది’’ అని ధన్‌కడ్‌ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఫోన్లో సమీక్షా సమావేశానికి హాజరుకాలేనని మమత  చెప్పినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో  ప్రధానితోపాటు గవర్నర్‌ ధన్‌కడ్‌, సువేందు అధికారి, భాజపా ఎంపీ చౌదురి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే,  సీఎం-పీఎం స్థాయి సమావేశానికి ఓ ఎమ్మెల్యే వచ్చినందుకే  తాను ఈ సమావేశానికి హాజరుకాలేదని మమత గతంలోనే వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు చేతిలో మమతాబెనర్జీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మరోవైపు తాజా ట్వీట్‌పై  తృణమూల్‌ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్‌ స్పందించారు. ఇలాంటి విషయాలు మాట్లాడే హక్కు గవర్నర్‌కు లేదని అన్నారు. మమతా బెనర్జీ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మంత్రి చంద్రిమా భట్టాచార్య స్పందిస్తూ సమీక్షా సమావేశం రోజున ప్రధానిని కలిసేందుకు మమతా బెనర్జీ 30 నిమిషాల పాటు నిరీక్షించారని అన్నారు.  ఆయన్ను కలిసిన తర్వాత యస్‌ తుపాను నష్టంపై నివేదికను అందించి, ఆయన అనుమతితోనే వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడి నుంచి వచ్చేశారని గుర్తు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని