ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై టెన్షన్‌.. టెన్షన్‌!

తాజా వార్తలు

Updated : 20/03/2021 16:55 IST

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై టెన్షన్‌.. టెన్షన్‌!

నల్గొండలో కీలకంగా మారిన కోదండరాం ఓట్లు

హైదరాబాద్‌/నల్గొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగో రోజూ ఉత్కంఠగా సాగుతోంది. ‘హైదరాబాద్’లో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ‘నల్గొండ’లో తుది అంకానికి చేరింది. మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. అయితే, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తవ్వగా.. నల్గొండలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు తొలి ప్రాధాన్య ఓట్లు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. 

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో ఇప్పటివరకు మొత్తం 93మంది అభ్యర్థుల్లో 91 మంది ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే.. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా.. రామచంద్రరావుకు 1,37,566 ఓట్లు వచ్చాయి. కె.నాగేశ్వర్‌కు 67,383 మొత్తంగా ఓట్లు వచ్చాయి. వాణీదేవి ప్రస్తుతం తన ప్రత్యర్థి రామచంద్రరావుపై 11,703 ఓట్ల ఆధిక్యంతో నిలిచారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి 1,68,520 ఓట్లు రావాల్సి ఉంటుంది.

మరోవైపు, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటిదాకా 67మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ పూర్తయింది. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 11,799 ఓట్లు రాగా.. తీన్మార్‌ మల్లన్నకు 15,817, కోదండరామ్‌కు 19,335 ఎలిమినేషన్‌ ఓట్లను బదిలీ చేశారు. దీంతో ఇప్పటిదాకా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తన సమీప ప్రత్యర్థి మల్లన్నపై 23,432 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 1,22,639 ఓట్లు రాగా.. తీన్మార్‌ మల్లన్నకు 99,207 ఓట్లు, కోదండరామ్‌కు 89,407, భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 44,010 ఓట్లు చొప్పున వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌ ఎలిమినేషన్‌ పూర్తికాగా.. ప్రస్తుతం భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డి ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు రావాల్సి ఉంటుంది. రెండు చోట్లా తెరాస అభ్యర్థులే తొలి నుంచీ ఆధిక్యం కనబరుస్తున్నప్పటికీ రెండో ప్రాధాన్య ఓట్లలో ఎవరు పైచేయి సాధిస్తారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని