TMC: వాళ్లని చేర్చుకోవడంపై తొందర లేదు

తాజా వార్తలు

Published : 10/06/2021 01:34 IST

TMC: వాళ్లని చేర్చుకోవడంపై తొందర లేదు

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌లో భాజపా నుంచి తిరిగి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్న నేతలకు నిరీక్షణ తప్పేలా లేదు. వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు టీఎంసీ నేతలు పార్టీని వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీనే ఘన విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష భాజపాలో ఉండలేక తిరిగి సొంతగూటికి రావాలని కొందరు నేతలు ఆతృతగా ఉన్నారు. టీఎంసీలో చేర్చుకోవాలంటూ దీదీకి లేఖలు కూడా రాశారు.

ఈ విషయంపై మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ స్పందిస్తూ పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునే అంశంపై పార్టీ అధినేత్రి మమతా బెనర్జీనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు వారిని పార్టీలో చేర్చుకోవడంపై దీదీకి తొందరేమీ లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘‘టీఎంసీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు పార్టీ మారి నష్టం చేకూర్చారు. అలాగే కొంత మంది సీనియర్‌ నాయకుల్ని బ్లాక్‌మెయిల్‌ చేసి ఇబ్బంది పెట్టారు. అయినా, మా పార్టీ ఎన్నికల్లో గెలుపొంది అధికారం దక్కించుకుంది. ఇప్పుడు వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే టీఎంసీ ఇమేజ్‌ దెబ్బతింటుంది’’అని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ అంశంపై టీఎంసీ చీఫ్‌ మమతా బెనర్జీ వేచి చూసే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె నిర్ణయం తీసుకునే వరకు భాజపాలో చేరిన నాయకులకు ఎదురుచూపులు తప్పవు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని