తళుకుమనని తారలు

ప్రధానాంశాలు

తళుకుమనని తారలు

కమల్‌హాసన్‌, ఖుష్బూ ఓటమి

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో ఈ దఫా పలువురు తారలు పరాజయం పాలయ్యారు. నటుడు కమల్‌హాసన్‌ మక్కల్‌నీది మయ్యం స్థాపించి.. సమత్తువ మక్కల్‌ కట్చి, ఇండియా జననాయక కట్చి పార్టీలతో కూటమిగా బరిలోకి దిగారు. ఈ కూటమికి ఒక్క స్థానమూ దక్కలేదు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌హాసన్‌పై.. భాజపా అభ్యర్థి, ఆ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ 1300 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన సినీ ప్రముఖుల్లో నటి శ్రీప్రియ, రచయిత స్నేహన్‌ ఓడిపోయారు. మాజీ ఐఏఎస్‌ అధికారి సంతోష్‌బాబు, పొన్‌రాజ్‌, పద్మప్రియ శ్రీనివాసన్‌, స్నేహామోహన్‌దాస్‌ వంటి విద్యావంతులదీ ఇదే పరిస్థితి. ఎంఎన్‌ఎం కూటమిలో నటుడు శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి(ఎస్‌ఎమ్‌సీ) 37 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. ఎస్‌ఎంసీ నుంచి నటుడు శరత్‌కుమార్‌ ఆయన సతీమణి నటి రాధిక తొలుత పోటీ చేస్తారని భావించినా.. ఇరువురూ బరిలో దిగలేదు. మరో నటుడు విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. విజయ్‌కాంత్‌ సతీమణి ప్రేమలత విజయ్‌కాంత్‌ విరుదాచలం నుంచి ఓటమిపాలయ్యారు. యువ కథానాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌ ట్రిప్లికేన్‌ నుంచి గెలుపొందారు. భాజపా తరపున థౌజండ్‌లైట్్స నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నటి ఖుష్బూ ఓడిపోయారు. స్వతంత్ర  అభ్యర్థిగా పోటీ చేసిన మరో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ కూడా ఓటమి చెందారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని