ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చారు

ప్రధానాంశాలు

ప్రజాస్వామ్యాన్ని వ్యాపారంగా మార్చారు

తెరాస, భాజపాలపై దామోదర రాజనర్సింహా విమర్శ

కమలాపూర్‌, జమ్మికుంట, భువనగిరి పట్టణం. న్యూస్‌టుడే: ‘హుజూరాబాద్‌ ఎన్నికలు అతి ఖరీదైనవిగా మారాయి. తెరాస, భాజపాలకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యాపారంగా మార్చాయన్నారు. మంగళవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటల్లో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాల్లో, భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపఎన్నికలు వస్తే ప్రజాప్రతినిధులకు వెలకట్టి కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ అంశంపై సీఎంతో విభేదాలు వచ్చి రాజీనామా చేశారో భాజపా అభ్యర్థి ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ప్రజలు సహనం కోల్పోతే తిరుగుబాటు తప్పదు’ అని అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  దళితబంధు పేరుతో దళితులను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, ఉప ఎన్నిక తర్వాత ఆ పథకం ఉండదని దామోదర రాజనర్సింహా అన్నారు.  భువనగిరిలో గతంలో తమ ప్రభుత్వం దళితులకిచ్చిన 180 ఎకరాల భూమిని సర్కారు లాక్కొందన్నారు.  


దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: దళితుల సంక్షేమం కోసం చేపట్టే ఏ కార్యక్రమాన్ని అయినా కాంగ్రెస్‌ స్వాగతిస్తుందని... అయితే రాష్ట్రమంతటా అమలు చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి కోరారు. దళితబంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ ఎన్నికల హామీగా ఇచ్చినా అమలు కాలేదన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వాలంటే కేటాయించిన నిధులు సరిపోవని అన్నారు. ప్రగతిభవన్‌లో కార్యక్రమాల రూపకల్పన చేస్తే సరిపోదని, వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని కోదండరెడ్డి డిమాండ్‌ చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని