రంగంలో దిగనున్న అగ్రనేతలు

ప్రధానాంశాలు

రంగంలో దిగనున్న అగ్రనేతలు

పండగ తర్వాత పెరగనున్న ప్రచార జోరు
హుజూరాబాద్‌లో రసవత్తర పోటీ

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: రాష్ట్రస్థాయిలో రాజకీయాసక్తికి కేంద్ర బిందువుగా మారిన హుజూరాబాద్‌ పోరు రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈనెల 30నే  ఎన్నిక జరగనుండటంతో తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు ఉండటంతో రోడ్‌షోలు.. ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దసరా పండగ తరువాత అగ్రనాయకుల్ని ఇక్కడికి రప్పించేలా కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల తరపున బరిలో ఉన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ (తెరాస), ఈటల రాజేందర్‌ (భాజపా), బల్మూరి వెంకట్‌ (కాంగ్రెస్‌)లు రోజూ సగటున అయిదారు గ్రామాల్లో తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ అన్నివర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

కొత్త వ్యూహాలకు పదును..

ఇప్పటివరకు కుల సంఘాలు, మహిళలు, యువతను ఆకర్షించే పనిలో ఉన్న ప్రధాన పార్టీలు కొత్త ఓటరుజాబితా ఆధారంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటు కీలకమనేలా వ్యవహరించనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న 305 పోలింగ్‌ బూత్‌లలో ప్రతి 100 మందికి ఒకరు చొప్పున బాధ్యులను భాజపా, తెరాసలు నియమించుకున్నాయి. సూక్ష్మస్థాయిలో ఓటరు నాడిని పట్టుకునే పనిలో పోటాపోటీగా పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇన్నాళ్లుగా జరిగిన నష్టాన్ని పూరించే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల పరిధిలోని నాయకుల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు కదనోత్సాహాన్ని రగిలిస్తున్నారు. తెరాస తరఫున ఇటీవల నియోజకవర్గ సరిహద్దు మండలాల్లో పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించారు. కోడ్‌ అమలులో లేని ప్రాంతమైనందున జనాలను అధిక సంఖ్యలోనే పోగు చేయగలిగారు. ఇదే తరహాలో భాజపా, కాంగ్రెస్‌లు కూడా నియోజకవర్గం ఆవల పెద్ద సభల్ని ఈ వారంలో నిర్వహించాలని చూస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని