పృథ్వీ షా వద్దు..రాహుల్‌ రావాల్సిందే

తాజా వార్తలు

Published : 21/12/2020 01:36 IST

పృథ్వీ షా వద్దు..రాహుల్‌ రావాల్సిందే

మరికొన్ని మార్పులు అవసరం: గావస్కర్‌

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్‌ టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు (36) నమోదు చేసింది. అయితే ఈ ఘోర ఓటమి ఆలోచనల నుంచి టీమిండియా తొందరగా బయటపడాలని, రెండో టెస్టులో గొప్పగా పుంజుకోవాలని దిగ్గజ క్రికెటర్‌ సునిల్ గావస్కర్‌ అన్నాడు. పొరపాట్లను సరిదిద్దుకోకపోతే కంగారూల గడ్డపై టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌కు గురికావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని సూచించాడు.

‘‘మెల్‌బోర్న్‌ టెస్టును భారత్‌ గొప్పగా ఆరంభించాలి. సానుకూల ఆలోచన ధోరణితో మైదానంలో అడుగుపెట్టాలి. అలా చేయకపోతే టెస్టు సిరీస్‌ను 0-4తో కోల్పోయే ప్రమాదం ఉంది. సానుకూల మనస్తత్వంతో బరిలోకి దిగితే టీమిండియా‌ ఎందుకు సత్తాచాటదు? తప్పక రాణిస్తుంది. తొలి టెస్టు ప్రదర్శన తర్వాత కోపం రావొచ్చు. అయితే క్రికెట్‌లో ఏమైనా జరగవచ్చు. శుక్రవారం, శనివారం రోజు జరిగిన ఆటను గమనించండి. పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి’’ అని గావస్కర్‌ తెలిపాడు.

‘‘ఆస్ట్రేలియా బలహీనత వాళ్ల బ్యాటింగ్‌. దానిపై దృష్టిసారించాలి. ఫీల్డింగ్‌లో చురుకుగా ఉండి, క్యాచ్‌లను అందుకోవాలి. తొలి టెస్టులో లబుషేన్‌, టిమ్‌ పైన్ ఆదిలోనే వెనుదిరిగేవారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు దాదాపు 120 పరుగుల ఆధిక్యం లభించేది. కానీ క్యాచ్‌లను జారవిడవడంతో ఆధిక్యం 50 పరుగులకే పరిమితమైంది. అయితే భారత తుదిజట్టులో రెండు మార్పులు అవసరం. పృథ్వీ షా స్థానంలో కేఎల్ రాహుల్ రావాలి. అలాగే శుభ్‌మన్‌ గిల్‌కు కూడా చోటు దక్కాలి. అతడు అయిదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి. గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆరంభం గొప్పగా ఉంటే పైచేయి సాధించగలం’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ షా (0,4) విఫలమైన సంగతి తెలిసిందే.

తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన షమి గురించి గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘షమి గాయం భారత్‌కు ప్రధాన సమస్య. అతడు బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించగలడు. అతడు లేకపోవడం టీమిండియాకు సమస్యే. అయితే ఇషాంత్‌ శర్మ ఫిట్‌గా ఉంటే వెంటనే అతడిని ఆస్ట్రేలియాకు పంపించాలి. రోజుకు 20 ఓవర్లు బౌలింగ్‌ చేసే ఫిట్‌నెస్‌తో ఉంటే అతడిని తొందరగా టీమిండియాతో కలిసేలా ప్రయత్నించాలి. కాగా, టీమిండియా బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి. నవదీప్‌ సైని మంచి బౌలరే. కానీ వార్మప్‌ మ్యాచ్‌లో అతడు బౌలింగ్‌ తీరుని చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేడనిపిస్తోంది’’ అని అన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న భారత్ రెండో టెస్టు ఆడనుంది.

ఇదీ చదవండి

ధోనీ లాగే సాహా చేశాడు..

టీమ్‌ఇండియా @ 2020 అంతంతే..! 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని