
తాజా వార్తలు
టీమ్ఇండియా బోణీ కొట్టింది..
తొలి టీ20లో ఆస్ట్రేలియాపై విజయం
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో తలపడిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. కోహ్లీసేన నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 150/7కే పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించి.. పొట్టి సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. చాహల్ 3/25, నటరాజన్ 3/30 విజృంభించడంతో కంగారూలు చేతులెత్తేశారు.
భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆర్కీ షార్ట్ (34; 38 బంతుల్లో 3x4), ఆరోన్ ఫించ్ (35; 26 బంతుల్లో 5x4, 1x6) శుభారంభం చేసి తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతున్న ఫించ్‌ను, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ (12)ను చాహల్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపాడు. 8వ ఓవర్లో ఫించ్ హార్దిక్ చేతికి, 10వ ఓవర్లో స్మిత్.. సంజూ చేతికి చిక్కారు. ఇక తర్వాతి ఓవర్లోనే మాక్స్వెల్ (2) నటరాజన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో షార్ట్, హెన్రిక్స్ (30; 20 బంతుల్లో 1x4, 1x6) మరో విలువైన భాగస్వామ్యం నిర్మించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 38 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నటరాజన్ విడగొట్టాడు. 15వ ఓవర్లో షార్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు ఊపిరిపోశాడు. ఆపై మాథ్యూవేడ్ (7), హెన్రిక్స్, మిచెల్ స్టార్క్(1) వరుసగా ఔటయ్యారు. చివరికి అబాట్ (12), స్వెప్సన్ (12) ధాటిగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
జడేజా మెరుపు బ్యాటింగ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) అర్ధశతకానికి తోడు రవీంద్ర జడేజా (44*; 23 బంతుల్లో, 5×4, 1×6) మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా ముందు పోరాడే స్కోర్ నిర్దేశించింది. ఆదిలోనే శిఖర్ ధావన్ (1) ఔటైనా వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (9)తో కలిసి రాహుల్ వేగంగా పరుగులు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో భారత్ ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. అనంతరం టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సంజూ శాంసన్ (23), మనీష్ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆపై బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్య (16; 15 బంతుల్లో, 1×6), జడేజా ఆదుకునే ప్రయత్నం చేసినా ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. పాండ్య ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. జడేజా మెరుపు బ్యాటింగ్ చేయడంతో చివరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు సాధించింది. వాషింగ్టన్ సుందర్ 7 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు తీయగా స్పెప్సన్, జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు.