సూర్యకుమార్‌ కోసం వికెట్‌ వదులు కోవాల్సింది
close

తాజా వార్తలు

Updated : 11/11/2020 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్యకుమార్‌ కోసం వికెట్‌ వదులు కోవాల్సింది

మ్యాచ్‌ అనంతరం ముంబయి కెప్టెన్‌ రోహిత్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈ వేదికగా జరిగిన టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌ 13వ సీజన్‌ ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి రికార్డు స్థాయిలో ఐదోసారి విజేతగా నిలిచింది. గతరాత్రి దిల్లీతో తలపడి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రోహిత్‌సేన వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 156/7 స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(65), రిషభ్‌ పంత్‌(56) అర్ధశతకాలతో ఆదుకోవడంతో ఆ జట్టు పోరాడే స్కోర్‌ సాధించింది. అనంతరం ముంబయి ఐదు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్‌శర్మ(68) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా, సూర్యకుమార్‌(19), ఇషాన్‌ కిషన్‌(33), డికాక్‌(20) రాణించారు. అయితే, ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో రోహిత్‌ తప్పిదానికి సూర్యకుమార్‌ ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించడంతో సూర్య రనౌట్‌గా వెనుతిరిగాడు. కెప్టెన్‌ బంతిని చూసుకోకుండా పరిగెత్తడంతో సూర్య నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లోనే ఉండిపోయాడు. ఆలోపు ఫీల్డర్‌ బంతిని కీపర్‌కు అందించగా అప్పటికే రోహిత్‌ అవతలివైపు క్రీజులోకి చేరాడు. దాంతో సూర్య వికెట్‌ వదులుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై స్పందించిన హిట్‌మ్యాన్‌.. సూర్యకుమార్‌ కోసం తన వికెట్‌ వదులు కోవాల్సిందని చెప్పాడు.

‘ఈ సీజన్‌ మొత్తం సాగిన తీరును చూస్తే చాలా సంతోషంగా ఉంది. మా విజయంలో కీలక పాత్ర పోషించిన తెరవెనుక సహాయక సిబ్బందికి ఈ క్రెడిట్‌ దక్కుతుంది. సీజన్‌ ఆరంభానికి ముందే మా ప్రణాళికలు రూపొందించాం. ఆటగాళ్ల నైపుణ్యం బయటకు తీసుకురావడానికి సరైన జట్టును రూపొందించాలి. అందుకోసం కర్ర పట్టుకొని వారి వెంట పరుగెత్తలేను. వాళ్ల మీద వాళ్లకు నమ్మకం కలిగించాలి. చాలా కాలంగా పోలార్ట్‌, హార్దిక్‌, కృనాల్‌ తమ పని తాము చేసుకుపోతున్నారు. వారి పాత్రలేంటో వారికి బాగా తెలుసు. ఈరోజు రాహుల్‌ ఆడలేకపోయాడు. అయితే, అతడేం తప్పుచేయలేదని, జట్టు ప్రణాళికలో భాగంగా పక్కనపెట్టామనే విషయాన్ని తెలియజేయాలి. ఇక ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సూర్య మంచి అవగాహన ఉన్న ఆటగాడు. ఈరోజు మ్యాచ్‌లో అతడున్న ఫామ్‌కు నా వికెట్‌ వదులు కోవాల్సింది. అయినా, టోర్నీ మొత్తంలో అతడు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు స్టేడియంలో అభిమానులు లేరు. వాంఖడేలో ఆడకపోవడం బాధగా ఉంది. వచ్చే ఏడాది అక్కడే ఆడుతామని ఆశిస్తున్నా’ అని రోహిత్ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

అది ముంబయి డీఎన్‌ఏలోనే ఉంది

ముంబయి జట్టుకు గూగుల్‌ సర్‌ప్రైజ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని