close

తాజా వార్తలు

Updated : 02/10/2020 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నైని బాధించే 5 ఓటముల కథ

మూడుసార్లు చుక్కలు చూపించిన ముంబయి

ఆటలో గెలుపోటములు అత్యంత సహజం. కొన్ని విజయాలు ఆటగాళ్లలో గర్వం పెంచితే కొన్ని ఓటములు అంతులేని బాధను మిగిలిస్తాయి. మర్చిపోదామన్నా పదేపదే గుర్తొస్తుంటాయి. మూడుసార్లు విజేత చెన్నైకీ ఈ నిర్వేదం తప్పలేదు. 13వ సీజన్‌లో దిల్లీ చేతుల్లో పరాజయమూ ఇలాంటిదే. ధోనీ సేనను అత్యంత బాధించే అపజయాలు ఐదున్నాయి. అవేంటంటే..!


తొలిసారి ముంబయి చేతిలో..

చెన్నైకి అత్యంత ఘోర పరాజయాన్ని రెండుసార్లు పరిచయం చేసిన జట్టు ముంబయి. 2013లో వాంఖడే వేదికగా తలపడ్డాయీ జట్లు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ బృందాన్ని 139/5కే పరిమితం చేసింది ధోనీ సేన. తక్కువ స్కోరును సునాయసంగా ఛేదిద్దామనుకున్న ఆ జట్టుకు చుక్కలు చూపించింది ముంబయి. మిచెల్ జాన్సన్‌ (3/27), ప్రజ్ఞాన్‌ ఓజా (3/11), లసిత్‌ మలింగ (2/6) చెన్నైని 79కే కుప్పకూల్చారు. మైక్‌ హస్సీ (22), ధోనీ (10), జడేజా (20) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. దాంతో 60 పరుగుల తేడాతో మహీసేన చిత్తుగా ఓడింది.


రెండోసారీ అదే కథ..

2019లోనూ ముంబయి చేతిలో చెన్నైకి ఇదే మర్యాద లభించింది. 46 పరుగుల తేడాతో ఓడించింది. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి 155/4 పరుగులు చేసింది. రోహిత్‌ అర్ధశతకంతో రాణించాడు. ఛేదనలో తేమ ప్రభావాన్ని సద్వినియోగం చేసుకుందామనుకున్న చెన్నైకి భారీ షాకిచ్చింది హిట్‌మ్యాన్‌ జట్టు. యార్కర్ల రారాజు లసిత్‌ మలింగ తన అనుభవాన్ని ఉపయోగించి 4 వికెట్లతో చెలరేగాడు. కృనాల్‌ పాండ్య, జస్ప్రీత్‌ బుమ్రా తలో రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టారు. ఫలితంగా చెన్నై 109 పరుగులకే చాపచుట్టేసింది. మురళీ విజయ్‌ (38), డ్వేన్‌ బ్రావో (20), మిచెల్‌ శాంట్నర్‌ (22) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. ఈ పోరులో యెల్లో బృందానికి బ్రావో సారథ్యం వహించాడు.


మూడోసారి పంజాబ్‌ స్ట్రోక్‌

పంజాబ్‌ ఫైనల్‌కు చేరిన ఒకేఒక్క సీజన్‌ 2014. ఆ ఏడాది ఈ జట్టు ప్రత్యర్థులను హడలెత్తించింది. చెన్నైనీ 44 పరుగులతో బోల్తాకొట్టించి మూడో ఘోర పరాజయాన్ని రుచిచూపించింది. కటక్‌ ఆతిథ్యమిచ్చిన ఈ పోరులో పంజాబ్‌ 231/4 స్కోర్‌ చేసింది. మాక్స్‌వెల్‌ (90; 38 బంతుల్లో 6×4, 8×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్లర్‌ (47), బెయిలీ (40*), సెహ్వాగ్‌ (30) అతడికి తోడుగా నిలిచారు. ఛేదనలో చెన్నై 187/6కే పరిమితమైంది. మిచెల్‌ జాన్సన్‌ (2), సందీప్‌ శర్మ, మాక్సీ, రిషి ధావన్‌ సమయోచితంగా తలో వికెట్‌ తీశారు. చెన్నైలో డుప్లెసిస్‌ (52; 25 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. ధోనీ (23; 20 బంతుల్లో) ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వలేదు.


నాలుగోసారి నయా దిల్లీ..

2020లో దుబాయ్‌ వేదికగా దిల్లీ చేతిలో 44 పరుగుల ఓటమి నాలుగోది. టాస్‌ గెలిచిన చెన్నై ప్రత్యర్థినే తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పృథ్వీషా (64), ధావన్‌ (35), పంత్‌ (37*), శ్రేయస్‌ (26) సమష్టిగా రాణించడంతో దిల్లీ 175/3 పరుగులు చేసింది. ఛేదనలో ధోనీసేనకు అస్సలు శుభారంభం దక్కలేదు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. పైగా కాగిసో రబాడ (3/26), అన్రిచ్‌ నార్జె (2/21) చురకత్తుల్లాంటి బంతులు సంధించారు. దాంతో చెన్నై 131/7కే పరిమితమైంది. డుప్లెసిస్‌ (43) ఒక్కడే కాస్త దూకుడుగా ఆడాడు.


ఐదోసారీ రోహిత్‌ సేన దెబ్బ

2015లో చెన్నై, ముంబయి మధ్య అద్భుతమైన సమరం జరిగింది. అదే ఈడెన్‌ ఆతిథ్యమిచ్చిన ఫైనల్‌ మ్యాచ్‌. లెండిల్‌ సిమ్మన్స్‌ (68; 45 బంతుల్లో 8×4, 3×6), రోహిత్‌శర్మ (50; 26 బంతుల్లో 6×4, 2×6), కీరన్‌ పొలార్డ్‌ (36; 18 బంతుల్లో 2×4, 3×6), అంబటి రాయుడు (36*; 24 బంతుల్లో 3×6) చెలరేగడంతో ముంబయి 202 పరుగులు చేసింది. ధోనీసేనలో ఏడుగురు బౌలింగ్‌ చేసినా పెద్ద ప్రభావమేమీ చూపించలేదు. ఛేదనలోనూ ఆ జట్టు సమష్టిగా ఆడలేదు. భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. డ్వేన్‌ స్మిత్‌ (57; 48 బంతుల్లో 9×4, 1×6) ఒక్కడే అర్ధశతకం బాదాడు. రైనా (28), ధోనీ (18) విఫలమయ్యారు. మెక్లెనగన్‌ (3/25), లసిత్‌ మలింగ (2/25), హర్భజన్‌ సింగ్‌ (2/34) బౌలింగ్‌లో సత్తాచాటారు. దాంతో ధోనీసేన 41 పరుగుల తేడాతో ఐదో ఘోర పరాజయం మూటగట్టుకుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.