OMG: అమ్మాయిల క్రికెట్లో అద్భుత క్యాచ్‌..

తాజా వార్తలు

Updated : 10/07/2021 12:12 IST

OMG: అమ్మాయిల క్రికెట్లో అద్భుత క్యాచ్‌..

మైదానంలో హర్లీన్‌ డియోల్‌ ఫైర్‌

నార్తాంప్టన్‌: మహిళల క్రికెట్లో కనీవినీ ఎరగని క్యాచ్‌! ఎవ్వరూ ఊహించని క్యాచ్‌! అమ్మాయిల ఫిట్‌నెస్‌.. మైదానంలో వారి చురుకుదనం చాటిచెప్పే క్యాచ్‌! వారెవ్వా.. అనిపించే క్యాచ్‌! అదేంటీ ఒక క్యాచ్‌ గురించి మరీ ఇంత ఉపోద్ఘాతం అవసరమా అనిపిస్తోందా! టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అందుకున్న ఆ అద్భుత  క్యాచ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే!

ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌ ముగియడంతో టీ20 సిరీస్‌ మొదలైంది. నార్తాంప్టన్‌ కౌంటీ మైదానంలో శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్‌ జరిగింది. మొదట ఇంగ్లిష్‌ అమ్మాయిలే బ్యాటింగ్‌ చేశారు. అప్పటికే అమీ జోన్స్‌ (43; 27 బంతుల్లో 4×4, 2×6) దూకుడు మీదుంది. వరుసగా బౌండరీలు బాదుతోంది. శిఖా పాండే వేసిన 18.5వ బంతిని భారీ షాట్‌ ఆడింది.

బౌండరీ వద్ద ఆ బంతిని అందుకొనేందుకు హర్లీన్‌ డియోల్‌ అద్భుతమే చేసింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. దాంతో విస్తుపోయిన అమీ జోన్స్‌ నిరాశతో పెవిలియన్‌ చేరింది. హర్లీన్‌ను జట్టు సభ్యులు అభినందించారు. ఈ క్యాచ్‌ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. లీసా స్తాలేకర్‌ వంటి క్రికెటర్లు, వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా, అభిమానులు ఆమెను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

వర్షం దోబూచులాడిన ఈ మ్యాచులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. మొదట నటాలీ సివర్‌ (55; 27 బంతుల్లో 8×4, 1×6), అమీ జోన్స్‌(43; 27 బంతుల్లో 4×4, 2×6) విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడటంతో ఇంగ్లాండ్‌ 177/7తో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ సేన 8.4 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. అప్పుడు మొదలైన వర్షం ఆగకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.







Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని