ధోనీతో ఫొటో దిగితే చాలనుకున్నా..!

తాజా వార్తలు

Published : 20/02/2021 14:49 IST

ధోనీతో ఫొటో దిగితే చాలనుకున్నా..!

చెన్నై జట్టుకు ఎంపికైన కడప యువకుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్టే ధ్యాసగా ఎదిగిన యువకుడికి ఐపీఎల్‌ ఆహ్వానం పలికింది. నిన్నటిదాకా ఊరిలో బంతులు విసిరిన తెలుగు తేజం ఇకపై అంతర్జాతీయ మైదానంలో బౌన్సర్లు వేయనున్నాడు. ఆంధ్రా కుర్రాడు దిగ్గజాల సరసన చెన్నై జట్టులో ఆడనున్నాడు. కడప జిల్లాలోని చిన్నమండెం మండలంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన హరిశంకర్‌రెడ్డిని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు రూ.20 లక్షలకు వేలంలో దక్కించుకుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఊళ్లోని పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన హరిశంకర్‌రెడ్డి 2016లో అండర్‌-19, 2018లో రంజీ స్థాయిలో ఆడాడు. పదునైన బౌలింగ్‌తో చెన్నై జట్టు యాజమాన్యాన్ని మెప్పించిన అతడు దిగ్గజ క్రికెటర్‌ ధోనీ సారథ్యంలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు.

హరిశంకర్‌రెడ్డి తల్లిదండ్రులకు వ్యవసాయమే ఆధారం. వారికి ఇద్దరు సంతానం కాగా పెద్దకుమారుడు ఉపాధి నిమిత్తం కువైట్‌లో స్థిరపడ్డాడు. హరిశంకర్‌రెడ్డి డిగ్రీ వరకు చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి ఎప్పుడూ క్రికెట్‌ మైదానాల చుట్టూ తిరిగే తమ కుమారుడు ఈ స్థాయికి ఎదుగుతాడనుకోలేదంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

‘చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉంది. ధోనీతో ఒక ఫొటో దిగితే చాలనుకున్న నేను.. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడబోతున్నా. ధోనీ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు’ అని ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి తమతోపాటు అటలాడిన స్నేహితుడు జాతీయ స్థాయికి ఎదగడంపై అతడి మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే జాతీయ జట్టులోనూ స్థానం దక్కించుకునే స్థాయికి హరిశంకర్‌రెడ్డి ఎదుగుతాడని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని