
తాజా వార్తలు
చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా యువ పేసర్ నటరాజన్ చరిత్ర సృష్టించాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఈ ఘనత సాధించాడు. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు నట్టూ తొలుత నెట్ బౌలర్ వెళ్లాడు. అయితే ఆటగాళ్ల గాయాలతో అతడికి జట్టులో చోటు దక్కింది. అనంతరం తుదిజట్టులో చోటు సంపాదించి పదునైన యార్కర్లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేతో నటరాజన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. పది ఓవర్లు వేసిన అతడు 70 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం పొట్టిఫార్మాట్‌లోనూ చోటు సంపాదించి భారత్ టీ20 సిరీస్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే టెస్టు సిరీస్‌కు నట్టూ ఎంపిక కాకపోయినా టీమిండియా యాజమాన్యం అతడిని జట్టుతో పాటు ఉంచింది. షమి, ఉమేశ్ యాదవ్ గైర్హాజరీతో ఆఖరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు.
మూడో టెస్టులోనే నటరాజన్ సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేస్తాడని భావించారంతా. కానీ బుమ్రా, సిరాజ్‌తో మూడో పేసర్‌గా సైని తుదిజట్టులోకి వచ్చాడు. అయితే బుమ్రాకు కూడా గాయమై ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో నట్టూ నాలుగో టెస్టులో బరిలోకి దిగాడు. తొలి రోజు ఆటలో ఆకట్టుకున్నాడు. వరుస ఓవర్లలో లబుషేన్, వేడ్ వికెట్లు పడగొట్టి భారత్‌ను పోటీలోకి తీసుకువచ్చాడు. కాగా, నెట్ బౌలర్ నుంచి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన నట్టూను అభినందిస్తూ బీసీసీఐ, ఐసీసీ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి