2007 T20 World Cup: అక్కడ నిలబెట్టినందుకు ధోనీకి రుణపడి ఉంటా: శ్రీశాంత్‌

తాజా వార్తలు

Published : 26/09/2021 01:42 IST

2007 T20 World Cup: అక్కడ నిలబెట్టినందుకు ధోనీకి రుణపడి ఉంటా: శ్రీశాంత్‌

నేను అసలు మిస్బా క్యాచ్‌ గురించే ఆలోచించలేదు

ఇంటర్నెట్‌డెస్క్‌: 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో మిస్బాల్ ఉల్‌ హక్‌ క్యాచ్ గురించి అసలు అలోచించలేదని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌ తాజాగా వెల్లడించాడు. అప్పుడు ఫైనల్స్‌లో భారత్‌.. మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నాయకత్వంలో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అది జరిగి శుక్రవారం నాటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి చిరస్మరణీయ క్యాచ్‌ అందుకున్న శ్రీశాంత్‌ తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పాడు. అప్పుడు తాను క్యాచ్‌ గురించి ఆలోచించలేదన్నాడు.

‘జోగిందర్‌ చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. రెండో బంతిని మిస్బా సిక్స్‌గా మలిచాడు. దీంతో మాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో నా వద్దకు బంతి వస్తే పాకిస్థాన్‌కు సింగిల్‌ మాత్రమే ఇవ్వాలని రెండో పరుగు ఇవ్వకూడదని అనుకున్నా. అప్పుడసలు క్యాచ్‌ గురించే ఆలోచించలేదు. చివరికి మిస్బా ఆడిన మూడో బంతి గాల్లోకి పైకి వెళ్లగా నేను రెండు మూడు అడుగులు వెనక్కి వెళ్లా.. దీంతో బంతి నేరుగా వచ్చి నా చేతుల్లో పడింది. అయితే, అప్పుడా బంతి చేజారినట్లు అనిపించినా రెండోసారి గట్టిగా ఒడిసిపట్టా’ అని శ్రీశాంత్‌ వివరించాడు.

కాగా, అలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో ఎవరూ బంతి తమ వద్దకు రావాలని కోరుకోరని, ముఖ్యంగా భారత్‌-పాకిస్థాన్‌ లాంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అసలు ఊహించరని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. కానీ, అప్పుడు తనని షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌కు ఉంచిన కెప్టెన్‌ ధోనీకి రుణపడి ఉంటానని చెప్పాడు. బంతి చాలా అరుదుగా వచ్చే ఫీల్డింగ్‌ పొజిషన్‌ అది అని, అలాంటి షాట్‌ ఆడిన మిస్బా ఉల్‌ హక్‌కు కూడా థాంక్స్‌ చెప్పాలని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ అభిప్రాయపడ్డాడు. ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 157/5 స్కోర్‌ సాధించగా పాకిస్థాన్‌ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. మిస్బా చివర్లో స్కూప్‌ షాట్‌ ఆడటంతో బంతి గాల్లోకి వెళ్లి శ్రీశాంత్‌కు దొరికింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని