Tokyo Olympics: బాక్సింగ్‌ రింగ్‌ దగ్గర కూర్చొని బాక్సర్‌ నిరసన

తాజా వార్తలు

Published : 01/08/2021 14:51 IST

Tokyo Olympics: బాక్సింగ్‌ రింగ్‌ దగ్గర కూర్చొని బాక్సర్‌ నిరసన

టోక్యో: ఒలింపిక్స్‌లో ఆదివారం వినూత్న సంఘటన చోటుచేసుకుంది. హెవీవెయిట్‌ బాక్సింగ్‌ విభాగంలో ఫ్రాన్స్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌ బాక్సింగ్‌ రింగ్‌పై నిరసన తెలిపాడు. ఈ ఉదయం బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడిన సందర్భంగా మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో రెండో రౌండ్‌లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపర్చడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో న్యాయనిర్ణేతలు ఈ మ్యాచ్‌లో ఫ్రేజర్‌ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్‌ బాక్సర్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్ద కూర్చొని నిరసన తెలిపాడు. అనంతరం ఆ దేశ టీమ్‌ అధికారులొచ్చి అతడితో మాట్లాడాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, 15 నిమిషాల తర్వాత మళ్లీ తిరిగొచ్చి అక్కడే కూర్చొని తన అసహనం ప్రదర్శించాడు.

కాగా, అంతకుముందు తొలిరౌండ్‌లో క్లర్క్‌పై మౌరాదే ఆధిపత్యం చెలాయించాడు. ఐదుగురు న్యాయనిర్ణేతల స్కోర్లలో అతడికే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కానీ రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడిన ఇద్దరూ హోరాహోరీ తలపడ్డారు. ఈ క్రమంలోనే మౌరాద్‌ ప్రత్యర్థిపై పలుమార్లు తలతో దాడి చేశాడు. రిఫరీ అతడిని ఆపేందుకు ప్రయత్నించినా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో కొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనుకునే సమయంలో మౌరాద్‌ అనర్హతకు గురయ్యాడు. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రిటిష్‌ బాక్సర్‌.. ఆ సమయంలో తాను మౌరాద్‌ను స్థిమితంగా ఉండమని చెప్పినట్లు పేర్కొన్నాడు. అతడు తనపై దాడి చేశాడని, అది ఉద్దేశపూర్వకమో లేకా అలా జరిగిపోయిందో తెలియదని అన్నాడు. ఏదైనామైనా క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని అభిప్రాయపడ్డాడు.

కాగా, 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లోనూ అసక్తికరమైన నిరసన చోటుచేసుకుంది. అప్పుడు దక్షిణా కొరియా బాక్సర్‌ బైయున్‌ జంగ్‌ ఇల్‌పై రెండు పెనాల్టీ పాయింట్లు విధించడంతో అతడు నిరసన తెలిపాడు. అప్పుడతడు సుమారు గంటపైనే రింగ్‌లో అలాగే ఉండిపోయి అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఇప్పుడు అదే బాక్సింగ్‌ ఈవెంట్‌లో మరోసారి ఓ బాక్సర్‌ నిరసన తెలపడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని