close
గబ్బర్‌.. గాడిన పడేనా?

వన్డేసిరీస్‌పై కన్నేసిన కోహ్లీసేన

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌

యువ ఆటగాళ్లు అదరగొట్టడంతో వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను టీమిండియా సునాయాసంగా కైవసం చేసుకుంది. తాజాగా వన్డే సిరీస్‌పై కన్నేసింది. తొలి పోరు వర్షార్పణం అవ్వగా విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో రెండో వన్డేలో భారత్‌ విజయం అందుకుంది. బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లో గెలిచి 2-0తో సిరీస్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. ఐతే గాయం తర్వాత పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఇంకా గాడిన పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

చివరి అవకాశం

టీ20 సిరీస్‌లో గబ్బర్‌ 1, 23, 3తో నిరాశ పరిచాడు. రెండో వన్డేలోనూ 2 పరుగులకే పరిమితం అయ్యాడు. టెస్టుల్లో చోటుదక్కని ధావన్‌కు కరీబియన్‌ గడ్డపై నిరూపించుకొనేందుకు ఇంకా ఒకే అవకాశముంది. అందుకే ఇప్పుడు ఒత్తిడంతా అతడిపైనే నెలకొంది. కాట్రెల్‌ విసిరిన ఇన్‌కమింగ్‌ డెలివరీలకే శిఖర్‌ రెండు సార్లు ఔట్‌ అవ్వడం గమనార్హం. రెండో వన్డేలో క్లిష్ట సమయంలో అదరగొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌తో రిషభ్‌పంత్‌కు పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం జట్టు యాజమాన్యం పంత్‌ను కీలకమైన నాలుగో స్థానంలో ఆడిస్తోంది. విధ్వంసకరంగా ఆడే అతడు జట్టుకు అవసరమైన సమయాల్లోనే చెత్త షాట్లతో వికెట్‌ పారేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐదో స్థానంలో వచ్చి సహనంతో ఆడిన అయ్యర్‌  నాలుగో స్థానానికి గట్టి  పోటీదారునని చెప్పకనే చెప్పాడు. క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఊపుమీదున్న కోహ్లీ, భువి

దాదాపు 11 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం బాదిన విరాట్‌ కోహ్లీ ఊపుమీదున్నాడు. మైదానంలో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. రెండో వన్డేలో ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ విఫలం కావడంతో చివరి వరకు నిలిచి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) కరీబియన్‌ దీవుల్లో బంతిని రెండువైపులా స్వింగ్‌ చేస్తూ అదరగొడుతున్నాడు. పైగా అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. మహ్మద్‌ షమి (2/39) ఫర్వాలేదనిపించాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ (2/59) వికెట్లు తీస్తున్నా ఎక్కువ పరుగులివ్వడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి గెలుపు జట్టు కూర్పును మార్చకపోవచ్చని సమాచారం. షమికి విశ్రాంతినిచ్చి యువ ఆటగాడు నవదీప్‌ సైనిని కోహ్లీ వన్డేల్లో అరంగేట్రం చేయించేందుకు అవకాశం లేకపోలేదు.

పరువు నిలుపుకోవాలని..

టీ20 సిరీస్‌ చేజార్చుకున్న వెస్టిండీస్‌ రెండో వన్డే గెలిచి ఈ సిరీస్‌నైనా కాపాడుకోవాలని భావిస్తోంది. 1-1తో సమం చేసి పరువు నిలుపుకోవాలని తాపత్రయ పడుతోంది. ఆ జట్టు కోచ్‌ సైతం కోహ్లీసేనపై కాస్త పౌరుషం, పట్టుదల చూపించాలని ఆటగాళ్లను కోరిన సంగతి తెలిసిందే. నిర్ణయాత్మక పోరులో గెలవాలంటే విండీస్‌లో షైహోప్‌, నికోలస్‌ పూరన్‌, షిమ్రన్ హెట్‌మైయిర్‌ వంటి యువకులు రాణించాల్సి ఉంది. భారీ భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది. బౌలింగ్‌ పరంగా కరీబియన్‌ జట్టుకు ఇబ్బందేమీ లేదు.

భారత్‌: విరాట్‌ కోహ్లీ (సారథి), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌పంత్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌  జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైని

వెస్టిండీస్‌: జేసన్ హోల్డర్‌ (సారథి), క్రిస్‌గేల్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, ఎవిన్‌ లూయిస్‌, షైహోప్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, కీమో పాల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషాన్‌ థామస్‌, కీమర్‌ రోచ్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.