ఈ రోజు నిలిస్తే..
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 19/12/2020 07:42 IST

ఈ రోజు నిలిస్తే..

 తొలి టెస్టుపై పట్టు చిక్కినట్లే
 ఇక బ్యాట్స్‌మెన్‌దే భారం
విజృంభించిన అశ్విన్‌.. ఆసీస్‌ 191 ఆలౌట్‌
భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం
 రెండో ఇన్నింగ్స్‌లో 9/1
అడిలైడ్‌

ఆస్ట్రేలియా 191కే ఆలౌట్‌..53 పరుగుల ఆధిక్యం.. ఈ లెక్కన భారత బౌలర్లు గొప్ప ప్రదర్శన చేసినట్లే లెక్క. కానీ బౌలర్ల స్థాయిలో ఫీల్డర్లు కూడా శ్రమించి ఉంటే.. ఆధిక్యం వందకు తగ్గేది కాదు. ఈపాటికి మ్యాచ్‌ను శాసించే స్థాయిలో టీమ్‌ఇండియా ఉండేది. బ్యాటింగ్‌లో లాగే మంచి అవకాశాల్నివృథా చేసిన టీమ్‌ఇండియా.. ఓ మోస్తరు ఆధిక్యంతోసరిపెట్టుకుంది. ప్రస్తుతానికి పైచేయి భారత్‌దే అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంది. అత్యంత కీలకమైన మూడో రోజు ఆటలో పూర్తిగా భారతే బ్యాటింగ్‌ చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించినట్లే!

ఊహించని హీరో

ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌.. పైగా డేనైట్‌లో గులాబి బంతితో. అందరి కళ్లూ పేసర్ల మీదే. స్పిన్నర్‌ అశ్విన్‌ మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ అతను అద్భుత ప్రదర్శనతో రెండో రోజు ఆటలో హీరోగా నిలిచాడు. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై షమి ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోగా.. అశ్విన్‌ నాలుగు వికెట్లు తీయడం అనూహ్యం! బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటే.. పిచ్‌తో, పరిస్థితులతో సంబంధం లేదని అతను రుజువు చేశాడు. బంతిని చక్కగా స్పిన్‌ చేయడంతో పాటు, బౌన్స్‌ రాబట్టడం ద్వారా బ్యాట్స్‌మెన్‌ను అశ్విన్‌ పరీక్షించాడు. మేటి బ్యాట్స్‌మన్‌ అయిన స్మిత్‌.. అశ్విన్‌ను ఆడటానికి ఇబ్బంది పడ్డాడు. చివరికి ఓ చక్కటి బంతికి వికెట్‌ ఇచ్చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో అత్యంత కీలకమైన వికెట్‌ సాధించాక అశ్విన్‌ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. మరింత ఉత్సాహంతో బంతులేశాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బౌన్స్‌ అయిన ఓ బంతి హెడ్‌ను బోల్తా కొట్టించింది. అశ్విన్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి అతను వెనుదిరిగాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గ్రీన్‌ సైతం వికెట్‌ సమర్పించుకోక తప్పలేదు. చివర్లో లైయన్‌ వికెట్‌ సైతం అశ్విన్‌కే దక్కింది. మ్యాచ్‌లో భారత్‌ పైచేయి సాధించిందంటే అశ్విన్‌ వల్లే.

‘‘గత అనుభవం ప్రకారం ఇక్కడి పిచ్‌ మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. అయిదో రోజు బ్యాటింగ్‌కు మరింత సహకరిస్తుంది. మేం పోటీలో ఉన్నాం. కిందటిసారి కన్నా మెరుగ్గా బౌలింగ్‌ చేశాం. స్మిత్‌ది చాలా పెద్ద వికెట్‌’

- అశ్విన్‌

కోహ్లి మెరుపులా..


గ్రీన్‌ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ చేసి అందుకుంటున్న కోహ్లి

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ఆరంభ పోరులో తొలి రోజు కొంచెం వెనుకబడ్డప్పటికీ.. రెండో రోజు టీమ్‌ఇండియా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరే చేసినా.. బౌలర్ల ప్రతిభతో ప్రత్యర్థిని ఇంకా తక్కువ స్కోరుకే కట్టడి చేసి కీలకమైన 53 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ సంచలన బౌలింగ్‌ (4/55)కు.. బుమ్రా (2/52), ఉమేశ్‌ (3/40)ల ప్రతిభ కూడా తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. టిమ్‌ పైన్‌ (73 నాటౌట్‌; 99 బంతుల్లో 10×4), లబుషేన్‌ (47; 119 బంతుల్లో 7×4) పోరాడకుంటే ఆసీస్‌ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారమే రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. ఆట ఆఖరుకు పృథ్వీ షా (4) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు చేసింది. మయాంక్‌ (5)కు తోడుగా నైట్‌వాచ్‌మన్‌ బుమ్రా (0) క్రీజులో ఉన్నాడు. భారత్‌ ప్రస్తుత ఆధిక్యం 62. డేనైట్‌ టెస్టుల్లో చివరి రెండు రోజులు బ్యాటింగ్‌ తేలికవ్వొచ్చు కాబట్టి.. లక్ష్యం 300 దాటేలా చూడటం కీలకం. మరి బ్యాట్స్‌మెన్‌ ఏం చేస్తారో?

ఛేదించిన బుమ్రా..: ఉదయం 233/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌..  స్టార్క్‌ (4/53), కమిన్స్‌ (3/48) 4.1 ఓవర్లు మాత్రమే ఆడి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. అశ్విన్‌ (15), సాహా (9) ఓవర్‌ నైట్‌ స్కోరుకు ఒక్క పరుగూ జోడించలేదు. భారత ఇన్నింగ్స్‌ కుప్పకూలిన తీరు చూసి పరిస్థితులు పేసర్లకు ఎంత అనుకూలంగా ఉన్నాయో అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు బర్న్స్‌, వేడ్‌.. తర్వాత బ్యాటింగ్‌లో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితం అయ్యారు. 4 ఓవర్లకు స్కోరు 0. 14 ఓవర్లకు కూడా వాళ్లిద్దరూ కలిపి చేసిన పరుగులు 16 మాత్రమే. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో ఆ ఇద్దరూ వికెట్ల ముందు గోడ కట్టేశారు. ఆ గోడను ఛేదించడానికి ఆరంభ బౌలర్లు ఉమేశ్‌, బుమ్రా గట్టిగానే ప్రయత్నించారు. కానీ గంట తర్వాత కానీ ఫలితం దక్కలేదు. 15వ ఓవర్లో బుమ్రా చక్కటి డెలివరీతో వేడ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బుమ్రా తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ బర్న్స్‌ను సైతం ఎల్బీగానే పెవిలియన్‌ చేర్చాడు. 29/2తో ఆసీస్‌ ఇబ్బందుల్లో పడింది.
అశ్విన్‌ పంచ్‌: ఓపెనర్ల వికెట్లయితే పడ్డాయి కానీ.. భారత్‌కు ప్రధాన ముప్పుగా పరిగణించిన స్మిత్‌, లబుషేన్‌ క్రీజులోకి రావడంతో మన బౌలర్లు ఏం చేస్తారా అనిపించింది. అయితే బుమ్రా, ఉమేశ్‌లతో పాటు షమి సైతం వీరిని బాగానే ఇబ్బంది పెట్టాడు. కానీ మూడు క్యాచ్‌లు నేలపాలవడం లబుషేన్‌కు కలిసొచ్చింది. మరో ఎండ్‌లో మాత్రం వికెట్ల పతనం సాగింది. పేసర్లు ఒత్తిడి కొనసాగిస్తుంటే.. మరో ఎండ్‌లో అశ్విన్‌ సొమ్ము చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ వెన్నెముక అయిన స్మిత్‌  (29 బంతుల్లో 1)తో పాటు హెడ్‌ (7)ను ఔట్‌ చేసి ప్రత్యర్థిని గట్టి దెబ్బ తీశాడు.  తన వేగంతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టిన ఉమేశ్‌.. తొలి వికెట్‌ తీశాక రెట్టించిన ఉత్సాహంతో బంతులేశాడు. అతను తక్కువ వ్యవధిలో గ్రీన్‌ (11), లబుషేన్‌, కమిన్స్‌ (0)ల వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో ఆసీస్‌ స్కోరు 111/7. ఆ జట్టు 150 అయినా చేస్తుందా అనుకుంటే.. తోకను తెంచడంలో మరోసారి భారత బౌలర్లు తమ బలహీనతను బయటపెట్టుకున్నారు. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న పైన్‌.. టెయిలెండర్లు స్టార్క్‌ (15), లైయన్‌ (10), హేజిల్‌వుడ్‌ (8)లతో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసి భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించాడు. స్టార్క్‌ రనౌట్‌ కాగా.. చివరి రెండు వికెట్లను అశ్విన్‌ తన ఖాతాలో వేసుకుని ఆసీస్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. తెలివిగా బౌలింగ్‌ మార్పులు చేయడం ద్వారా కెప్టెన్‌ కోహ్లి ఆసీస్‌ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా క్యాచ్‌లు చేజారుతున్న తరుణంలో గ్రీన్‌ క్యాచ్‌ను అతను డైవ్‌ చేస్తూ అందుకుని సహచరుల్లో స్ఫూర్తి నింపాడు.

స్కోరువివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) స్టార్క్‌ 0; మయాంక్‌ (బి) కమిన్స్‌ 17; పుజారా (సి) లబుషేన్‌ (బి) లైయన్‌ 43; కోహ్లి రనౌట్‌ 74; రహానె ఎల్బీ (బి) స్టార్క్‌ 42; విహారి ఎల్బీ (బి) హేజిల్‌వుడ్‌ 16; సాహా (సి) పైన్‌ (బి) స్టార్క్‌ 9; అశ్విన్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 15; ఉమేశ్‌ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 6; బుమ్రా నాటౌట్‌ 4; షమి (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 0; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (93.1 ఓవర్లలో ఆలౌట్‌) 244
వికెట్ల పతనం: 1-0, 2-32, 3-100, 4-188, 5-196, 6-206, 7-233, 8-235, 9-240
బౌలింగ్‌: స్టార్క్‌ 21-5-53-4; హేజిల్‌వుడ్‌ 20-6-47-1; కమిన్స్‌ 21.1-7-48-3; గ్రీన్‌ 9-2-15-0; లైయన్‌ 21-2-68-1; లబుషేన్‌ 1-0-3-0

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వేడ్‌ ఎల్బీ (బి) బుమ్రా 8; బర్న్స్‌ ఎల్బీ (బి) బుమ్రా 8; లబుషేన్‌ ఎల్బీ (బి) ఉమేశ్‌ 47; స్మిత్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 1; హెడ్‌ (సి) అండ్‌ (బి) అశ్విన్‌ 7; గ్రీన్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 11; పైన్‌ నాటౌట్‌ 73; కమిన్స్‌ (సి) రహానె (బి) ఉమేశ్‌ 0; స్టార్క్‌ రనౌట్‌ 15; లైయన్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 10; హేజిల్‌వుడ్‌ (సి) పుజారా (బి) ఉమేశ్‌ 8; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (72.1 ఓవర్లలో ఆలౌట్‌) 191
వికెట్ల పతనం: 1-16, 2-29, 3-45, 4-65, 5-79, 6-111, 7-111, 8-139, 9-167
బౌలింగ్‌: ఉమేశ్‌ 16.1-5-40-3; బుమ్రా 21-7-52-2; షమి 17-4-41-0; అశ్విన్‌ 18-3-55-4

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) కమిన్స్‌ 4; మయాంక్‌ బ్యాటింగ్‌ 5; బుమ్రా బ్యాటింగ్‌ 0; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 9
వికెట్ల పతనం: 1-7
బౌలింగ్‌: స్టార్క్‌ 3-1-3-0; కమిన్స్‌ 3-2-6-1

 

ఇవీ చదవండి..

విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!

ఇలా వదిలేస్తే కష్టమే..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన