2-1 కాదు 2-0!
close

ప్రధానాంశాలు

Updated : 21/01/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2-1 కాదు 2-0!

3 టెస్టులే అనుకుని ఆడాం
కోహ్లి వెళ్తూ అదే చెప్పాడు
బౌలర్ల సత్తాతోనే రేసులోకొచ్చాం
‘ఈనాడుతో హనుమ విహారి
ఈనాడు - హైదరాబాద్‌

అడిలైడ్‌ ఓటమి తర్వాత టెస్టు సిరీస్‌లో ఉన్నది మూడు మ్యాచ్‌లే అనుకుని ఆడామని భారత టెస్టు జట్టు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ గాదె హనుమ విహారి అన్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి వెళ్తూ అదే మాట చెప్పాడని అతను తెలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ విజయం జీవితాంతం మరిచిపోలేనని పేర్కొన్నాడు. తొడ కండరాల గాయం బాధిస్తున్నా అశ్విన్‌తో కలిసి సిడ్నీ టెస్టును కాపాడిన ఈ తెలుగు కుర్రాడితో ముఖాముఖి ‘ఈనాడు’కు ప్రత్యేకం.

చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయంలో భాగం కావడం ఎలాంటి అనుభూతినిస్తోంది?
జీవితాంతం మరిచిపోలేని టెస్టు సిరీస్‌ ఇది. అడిలైడ్‌ ఓటమి తర్వాత మెల్‌బోర్న్‌ టెస్టులో అద్భుతంగా పుంజుకున్నాం. సిడ్నీ మూడో టెస్టులో మరింత పట్టుదలగా ఆడాం. పుజారా క్రీజులో ఉన్నంత వరకు గెలుపుపై నమ్మకంతోనే ఉన్నాం. అతను ఔటవడంతో కాస్త  ఆలోచనలో పడ్డాం. అప్పటికే నేను గాయంతో ఇబ్బంది పడుతున్నా. పరుగెత్తడం సంగతి అటుంచితే కనీసం నడవలేకపోయా. అశ్విన్‌ 100 శాతం ఫిట్‌నెస్‌తో లేడు. గాయం కారణంగా జడేజా కూడా అందుబాటులో లేడు. డ్రా చేసి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచాలని భావించాం. ఏకాగ్రత కోల్పోకుండా.. చివరి వరకు బ్యాటింగ్‌ చేశాం. బంతి బంతికీ అశ్విన్‌, నేను మాట్లాడుకున్నాం. అశ్విన్‌కు తెలుగు వచ్చు. అతడు తమిళం, తెలుగులో నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. చరిత్రాత్మక డ్రాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.

సిడ్నీ టెస్టులో హీరోగా నిలిచి.. తర్వాతి మ్యాచ్‌కు దూరమవడం బాధించిందా?
మ్యాచ్‌లో గెలిచినప్పుడు ఉండే భావోద్వేగం సిడ్నీ టెస్టు డ్రా తర్వాత కనిపించింది. డ్రెస్సింగ్‌ రూమ్‌లో అందరూ చాలా సంతోషించారు. నొప్పి గురించి అందరూ నన్ను అడిగారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మ్యాచ్‌ తర్వాత అమ్మకు ఫోన్‌ చేశా. నా ఆటతీరు పట్ల చాలా సంతోషించింది. అందరూ మెచ్చుకుంటున్నారని.. చాలా గర్వంగా ఉందని చెప్పింది. ఇక క్రీడాకారుల కెరీర్‌లో గాయాలు సహజం. గాయపడినప్పుడు కోలుకోవడంపైనే దృష్టి ఉండాలి. అంతకుమించి ఏమీ చేయలేం.

అడిలైడ్‌ వైఫల్యం నుంచి జట్టు ఎలా బయటపడింది?
36 పరుగులకే ఆలౌటైనా మేమేమి కుంగిపోలేదు. ఆటలో గెలుపోటములు భాగమని అందరికీ తెలుసు. అయితే మరీ పేలవంగా ఆడాం కాబట్టి డ్రెస్సింగ్‌ రూంలో చర్చ జరిగింది. అక్కడితో అంతా ముగిసింది. హోటల్‌కు వెళ్లి ఎవరి గదిలో వాళ్లు కూర్చొని బాధపడటాలు లేవు. డ్రెస్సింగ్‌ రూమ్‌ దాటిన తర్వాత అంతా మామూలుగా అయిపోయాం. కెప్టెన్‌ కోహ్లి స్వదేశం పయనమవ్వాల్సి ఉండటంతో ఆ రోజు రాత్రి అందరం కలిసి భోజనం చేశాం. ‘ఓటమి గురించి ఎక్కువ ఆలోచించొద్దు.. మాపై మేము నమ్మకాన్ని కోల్పోవద్దు’ అని కోహ్లి సూచించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ అనుకుని ఆడమని చెప్పాడు. అలాగే ఆడాం. 2-0తో సిరీస్‌ను గెలిచాం. సిరీస్‌ ఆసాంతం పాజిటివ్‌గానే ఉన్నాం. ఒకరినొకరు నిందించుకోలేదు.

టెస్టు సిరీస్‌ విజయంలో పుజారా పాత్రపై మీ విశ్లేషణ ఏంటి?
టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు పుజారానే వెన్నెముక. అతడి ఖాతాలో ఎక్కువ పరుగులు లేకపోవచ్చు. కానీ పుజారా క్రీజులో ఉండటమే అతిపెద్ద సానుకూలాంశం. అంకెలు ప్రధానం కాదు. అతడు ఎంతసేపు క్రీజులో ఉన్నాడన్నది ముఖ్యం. ఒక ఎండ్‌లో వికెట్లు పడకుండా ఆపేవాళ్లు ఉంటే అవతలి ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయొచ్చు. అతడిచ్చిన ఆత్మవిశ్వాసంతోనే మిగతా బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టారు. క్రికెట్‌ను బాగా అర్థం చేసుకునేవాళ్లకు ఈ సిరీస్‌లో పుజారా ప్రాధాన్యం తెలుస్తుంది.

బ్రిస్బేన్‌ టెస్టులో పంత్‌ ఇన్నింగ్స్‌ను ఎలా విశ్లేషిస్తారు?
బ్యాటింగ్‌లో పంత్‌ దూకుడు గురించి అందరికీ తెలుసు. ఈ సిరీస్‌లో అతను సహజ సిద్ధమైన ఆటే ఆడాడు. పంత్‌ ఎక్కువసేపు క్రీజులో ఉంటే మ్యాచ్‌ విన్నర్‌ అవుతాడు. బ్రిస్బేన్‌లో అదే జరిగింది. ఏ సందర్భంలోనూ పంత్‌ డ్రా కోసం ప్రయత్నించలేదు. చివరి బంతి వరకు క్రీజులో ఉండాలన్న తపన అతనిలో కనిపించింది. పంత్‌ అనుకున్నది సాధించాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల భాగస్వామ్యం లేకపోతే మ్యాచ్‌.. సిరీస్‌ ఫలితం మరోలా ఉండేదేమో.

మీకు, పంత్‌కు విదేశాల్లోనే అవకాశాలొస్తున్నాయే?
తుదిజట్టులో ఉండటం మన చేతుల్లో లేదు. జట్టు గెలవడానికి ఎలాంటి కూర్పు కావాలన్నది యాజమాన్యం నిర్ణయిస్తుంది. సొంతగడ్డపై ఒకలా.. విదేశాల్లో మరోలా పరిస్థితులు ఉంటాయి. అందుకు తగ్గట్లు తుది జట్టును ఎంపిక చేస్తారు. ఎవరికి ఎప్పుడు అవకాశం లభించినా సంతోషమే. తుది 11 మందిలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేకపోయినా ఆటగాళ్లు అంతే సానుకూలంగా స్పందిస్తారు. నిరాశ చెందరు. కెరీర్‌ కొనసాగినంత కాలం టీమ్‌ఇండియా ప్రణాళికల్లో ఉండాలన్నదే అందరి లక్ష్యం. 11లో ఉంటామా.. 15లో ఉంటామా అన్నది అప్రస్తుతం.

కోహ్లి, రహానె సారథ్యంలో ఏమైనా వైవిధ్యం గమనించారా?
దేహదారుఢ్యంలో కోహ్లి,  రహానె భిన్నంగా ఉంటారేమో. కానీ ఆలోచనల్లో ఇద్దరూ ఒక్కటే. కాకపోతే కోహ్లి పైకి కనిపిస్తాడు. రహానె అస్సలు అగుపించడు. బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ మోహరింపుల్లో ఇద్దరూ దూకుడుగానే వ్యవహరిస్తారు. ఆచరణ శైలి మాత్రమే భిన్నం.

కోహ్లి నిష్క్రమించాక ఆటగాళ్లలో ప్రేరణ ఎలా వచ్చింది?
టీమ్‌ఇండియాకు ఆడటమే అతి పెద్ద ప్రేరణ. ప్రతి మ్యాచ్‌లో ఆడాలి.. మనల్ని మనం నిరూపించుకోవాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మెల్‌బోర్న్‌లో అత్యంత సానుకూలాంశం బౌలర్లు. ఆసీస్‌ను 195 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో జట్టు ఆత్మవిశ్వాసాన్ని ఒక్కసారిగా పెంచింది. అక్కడ్నుంచి లయ దొరికింది. బౌలర్లు అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్నాం. కెప్టెన్‌ రహానె తన కెరీర్‌లోనే అత్యుత్తమ శతకంతో సత్తాచాటాడు. మ్యాచ్‌పై పట్టు దొరికింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌ను 200 పరుగులకు కట్టడి చేయడం పూర్తిగా బౌలర్ల గొప్పతనం. సొంతగడ్డపై పూర్తిస్థాయి కంగారు జట్టుతో భారత బౌలర్లు ఈస్థాయిలో ఆధిపత్యం కనబరచడం చాలా అరుదు. బౌలర్ల శ్రమకు ఫలితం దక్కింది.

తోటి హైదరాబాదీ సిరాజ్‌ టీమ్‌ఇండియా బౌలింగ్‌ విభాగానికి సారథ్యం వహించడం ఎలా అనిపించింది?
సిరాజ్‌ రెండు మ్యాచ్‌లే ఆడినా అతడి దృక్పథం ఎప్పుడూ సీనియర్‌ బౌలర్‌ లాగే ఉంటుంది. నాలుగో టెస్టులో ఆ విషయం అందరూ గమనించే ఉంటారు. తన బౌలింగ్‌పై చాలా నమ్మకంతో ఉంటాడు. బ్రిస్బేన్‌లో బౌలింగ్‌ విభాగాన్ని ముందుండి నడిపించాడు. మ్యాచ్‌ విజయంలో సిరాజ్‌దీ కీలకపాత్రే. టెస్టు మ్యాచ్‌లో 20 వికెట్లు తీయకపోతే గెలవలేం. ఇందుకోసం బౌలర్లు చాలా కష్టపడ్డారు. అంతర్జాతీయ అనుభవం లేకపోయినా ఆసీస్‌ను కట్టడి చేశారు. సిరాజ్‌, శార్దూల్‌లకు ఇండియా-ఎ తరఫున ఎరుపు బంతితో ఆడిన అనుభవం బాగా కలిసొచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 52
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 53
      [script_flag] => DEF
      [script_page] => 7
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

)
మరిన్ని

దేవతార్చన