close

కథనాలు

జబ్బలు చరచొద్దు.. బంతిని ఉమ్మితో రుద్దొద్దు

ఆరడుగుల దూరం నుంచే అభినందించాలి

 క్రికెట్‌ పునఃప్రారంభానికి ఐసీసీ మార్గదర్శాలు

అంతర్జాతీయ క్రికెట్‌ స్తంభించి దాదాపు రెండు నెలలు గడిచింది. ఆటగాళ్లు ఇళ్లకు పరిమితం అయ్యారు. ఆయా బోర్డుల కార్యాలయాలను తాత్కాలికంగా మూసేశారు. అధికారులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొవిడ్‌-19 ప్రభావం నుంచి మానవాళి తేరుకుంటోంది. ప్రభుత్వాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. వైరస్‌ ప్రమాదం తగ్గనప్పటికీ క్రికెట్‌ను తిరిగి మైదానానికి తీసుకొచ్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. అందరి భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆటను ఆస్వాదించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.


పొంచివున్న ప్రమాదం

కొవిడ్‌-19 పరంగా క్రికెట్‌కు సంబంధించి కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇది బృంద క్రీడ. అందరూ కలిసే ఆడతారు. ఒకరినొకరు స్పర్శించుకోవడం, దగ్గరికొచ్చి అభినందించుకోవడం చేస్తారు. శీతల పానీయాలు, టోపీలు, తువాళ్లు, మరికొన్ని వసతులను ఆటగాళ్లు కలిసే ఉపయోగించుకుంటారు. మాటిమాటికీ అంపైర్ల వద్దకు వెళ్తారు. టోపీలు, రుమాళ్లు ఇస్తారు. బంతికి మెరుపు తీసుకొచ్చేందుకు పదేపదే ఉమ్మి రాస్తారు. ఇవన్నీ వైరస్‌ వ్యాప్తికి ప్రమాద హేతువులే మరి. ఇక అధికారుల్లో 60 ఏళ్లు పైబడ్డ వారూ ఉంటారు.


అభిమానులను అనుమతిస్తే

ప్రభుత్వ ఆదేశాల మేరకే స్టేడియాల్లోకి అభిమానుల ప్రవేశం ఉంటుందని ఐసీసీ తెలిపింది. స్టేడియం ద్వారాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. సీటింగ్‌ను మార్చాలి. కారిడార్‌లో మనుషుల కదలికలను నియంత్రించాలి. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటింపజేయాలి. అనారోగ్యంగా కనిపించిన వారిని, బలహీనంగా ఉన్నవారిని అనుమతించొద్దు. భౌతిక దూరం ఉల్లంఘించకుండా చూసేందుకు ఆహారం, పానీయాలు విక్రయించకూడదు.


క్రికెటర్లకు అవగాహన

కొవిడ్‌-19పై ఆటగాళ్లు, అధికారులు, సహాయ సిబ్బందికి ఆయా బోర్డులు అవగాహన కల్పించాలి. ఆట కొనసాగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి. బంతిపై ఉమ్మి (లాలాజలం)తో రుద్దడాన్ని ఐసీసీ నిషేధించిందని స్పష్టంగా చెప్పాలి. సబ్బునీరుతో చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం, కళ్లు, నోరు, ముక్కును చేతుల్తో తాకకుండా అవగాహన కల్పించాలి. దగ్గు, తుమ్ము వస్తే మోచేతి అడ్డం పెట్టుకోవాలి. పానీయాలు, తువాళ్లు ఒకరివి మరొకరు వాడొద్దు. బంతిని జాగ్రత్తగా వాడాలి. వీలైనంత మేరకు క్రికెట్‌ వస్తువుల్ని కలిసి ఉపయోగించొద్దు. ఎవరి వస్తువులను వారే చూసుకోవాలి. ఛేంజింగ్‌ రూమ్స్‌, స్నానపు గదులు, ఇతర ప్రాంతాలనూ తక్కువగా వినియోగించాలి.


నాలుగు దశల్లో సాధారణ స్థితికి

క్రికెట్‌ను నాలుగు దశల్లో సాధారణ స్థితికి తీసుకురావాలని ఐసీసీ తెలిపింది. తొలి దశలో ఆటగాళ్లు వ్యక్తిగతంగా శిక్షణ పొందాలి. కసరత్తులు చేయాలి. రెండో దశలో ముగ్గురు కన్నా తక్కువ మంది కలిసి సాధన చేయొచ్చు. ఐతే ఒకరినొకరు అస్సలు తాకొద్దు. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. మూడో దశలో పది కన్నా తక్కువ మంది కలిసి శిక్షణ, కసరత్తులు, సాధన చేయొచ్చు. చిన్న చిన్న బృందాలుగా విడిపోయి చేస్తే మంచిది. నాలుగో దశలో పది కన్నా ఎక్కువ మంది కలిసి నిబంధనలు పాటిస్తూనే శిక్షణ పొందాలి. సాధన చేయాలి. శిక్షణ, ఆడేటప్పుడు, ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఐసీసీ వివరించింది.


శిక్షణలో ఇలా

1)  ప్రతి జట్టుకు ప్రధాన వైద్యాధికారి లేదా బయోసేఫ్టీ అధికారిని నియమించాలి. వీరు ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చూసుకోవాలి.

2) మ్యాచుకు ముందు 14 రోజులు ఐసోలేషన్‌ శిక్షణ శిబిరం నిర్వహణను పరిగణనలోకి తీసుకోవాలి.

3) అందరికీ కొవిడ్‌-19 పరీక్షలు చేయించాలి.

4) ఆటగాళ్లకు కొవిడ్‌-19 లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని వైద్యులకు తెలియజేసే ప్రక్రియ, పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలి.

5) చికిత్స గదిలో పడకలు క్రమ పద్ధతిలో ఉండాలి. వాటిని పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి ఒక్కరు ఉపయోగించే ముందు, తర్వాత శానిటైజ్‌ చేయించాలి.


ఆడేటప్పుడు ఇలా

1) ఆట లేదా శిక్షణకు ముందు ఆటగాళ్లకు వైరస్‌ సోకకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆటగాళ్లు, సహాయ బృందాలు ప్రమాదం బారిన పడకుండా చూసుకోవాలి. శిక్షణ, ఆట కొనసాగుతున్నప్పుడు అత్యవసర వైద్య సహాయం ఉండాలి.

2) ఆట, శిక్షణ సాగుతున్నప్పుడు చికిత్స చేసేందుకు వైద్యుడు సిద్ధంగా ఉండాలి.

3) ఆటగాడు లేదా సహాయ సిబ్బందికి కొవిడ్‌-19 సోకితే ప్రత్యేక నిపుణుడితో ఆస్పత్రిలో చికిత్స అందించాలి.

4) సబ్బు నీరుతో చేతులు పదేపదే శుభ్రం చేసుకోవాలి. మైదానంలోకి వచ్చినా, డ్రస్సింగ్‌రూమ్‌కు వెళ్లినా కొవిడ్‌-19 జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి.

5) బంతిని, క్రికెట్‌ వస్తువులను ఉపయోగించడంపై ముందుగానే అవగాహన కల్పించాలి. లాలాజలం వాడొద్దని స్పష్టంగా చెప్పాలి.

6) మైదానంలో, ఆవల ఆటగాళ్లు, అంపైర్లు భౌతిక దూరం పాటించాలి. అనవసర స్పర్శకు గురికావొద్దు.


ప్రయాణిస్తే ఇలా

1) అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ఆరంభించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. ఒక దేశం నుంచి మరో దేశంలోకి అడుగుపెడితే క్వారంటైన్‌, సెల్ఫ్‌ ఐసోలేషన్‌, ఐసోలేషన్‌ నిబంధనలు తప్పక పాటించాలి.

2) ప్రయాణించే ముందు రవాణా సాధనాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. భౌతిక దూరం తప్పనిసరి.

3) భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఛార్టెడ్‌ విమానాలను ఏర్పాటు చేస్తే మంచిది.

4) ఆటగాళ్లు బస చేసే హోటల్‌ గదులు పరిశుభ్రంగా ఉండాలి. ఒకొక్కరికి ఒక్కో గది కేటాయించాలి. వీలైనంత వరకు ఒక ఫ్లోర్‌ మొత్తం జట్టుకే ఉండేలా చూసుకోవాలి. ఆహారం విషయంలో రాజీపడొద్దు.

5) అంతర్జాతీయ జట్లు ప్రయాణించేటప్పుడు నిరంతరం వైద్యుడిని వెంటపెట్టుకొనే ఉండాలి.


ఒకవేళ కరోనా వస్తే..?

ఆటగాడు/అధికారి/సహాయకుడికి కొవిడ్‌-19 సోకిందని అనుమానం ఉన్నా ధ్రువీకరించినా సంబంధిత నిబంధనలు పాటించాలి. ఆ వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు అవసరమైన గది ఉండాలి (శిక్షణ లేదా మ్యాచ్‌ జరిగేటప్పుడు). అతడికి, అతడితో సన్నిహితంగా మెలిగిన వారికి పీపీఈ కిట్లు వెంటనే అందించాలి. అనారోగ్యం తీవ్రతను బట్టి ఐసోలేషన్‌ కాలం నిర్ణయించాలి. వైరస్‌ నిర్ధారణకు 48 గంటల ముందు ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడో తెలుసుకోవాలి. అతడున్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. వైద్యం ఇప్పించాలి. ఎవరికైనా వైరస్‌ సోకితే మ్యాచ్‌, సిరీసుపై ప్రభావాన్ని ఎ) ఎంత మందికి సోకింది బి) ఏ వ్యక్తి (ఆటగాడు, సహాయకుడు, అంపైర్‌, రిఫరీ, టోర్నీ సిబ్బంది)కి సోకింది సి) ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడో అన్న దానిని బట్టి నిర్ధారించాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.