close

ప్రధానాంశాలు

Updated : 29/09/2020 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏడుసార్లు జరిగిందిలా..

ప్చ్‌.. ఓపెనర్లిద్దరూ డకౌట్

క్రికెట్‌ అంటేనే గణాంకాల ఆట. కొన్ని అంకెలు ఆసక్తికరంగా ఉంటాయి. అరెరెరె.. అనిపిస్తాయి. ఓపెనర్లిద్దరూ డకౌట్‌ అవ్వడం ఇలాంటిదే. లీగూ‌ ఇందుకేమీ అతీతం కాదు. ఏకంగా ఏడుసార్లు ఓపెనింగ్‌ ద్వయం పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి. అవి ఎప్పుడు? ఎలా? జరిగాయో తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే!


మొదటి జోడి: పార్థివ్‌-ఫ్లెమింగ్‌

లీగ్‌ తొలి సీజన్‌లోనే ఓపెనింగ్ ‌జోడీ డకౌటైన రికార్డు నమోదైంది. సవాయ్‌ మాన్‌సింగ్‌ వేదికగా చెన్నై, రాజస్థాన్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన చెన్నై బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ పోరులో రాజస్థాన్‌ మీడియం పేసర్‌ సొహైల్‌ తన్వీర్‌ నిప్పులు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అతడి దాడికి మొదట బలైంది ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌ (0; 1 బంతి), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (0; 2 బంతుల్లో). వీరిద్దరూ వికెట్ల ముందే దొరికిపోవడం గమనార్హం. ఈ సీజన్‌లో రాజస్థాన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.


రెండో జోడీ: స్మిత్‌-అస్నోద్కర్‌

దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన రెండో సీజన్‌లో ఏకంగా నాలుగు ఓపెనింగ్‌ జోడీలు డకౌటయ్యాయి. పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా హైదరాబాద్‌, రాజస్థాన్‌ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లకు 141 పరుగులు చేసింది. కాగా ఛేదనలో డకౌట్‌ రికార్డు నమోదైంది. ఓపెనర్‌ స్మిత్‌ను ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌ ఔట్‌ చేశాడు. షోయబ్‌ అహ్మద్‌ క్యాచ్‌ అందుకున్నాడు. మరో ఓపెనర్‌ అస్నోద్కర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. మోస్తారు లక్ష్యాన్ని రాజస్థాన్‌ సులువగానే ఛేదించేసింది.


మూడో జోడీ: గిల్‌క్రిస్ట్‌- హర్షల్‌ గిబ్స్‌

ఈస్ట్‌ లండన్‌ వేదికగా చెన్నై, హైదరాబాద్‌ తలపడ్డ పోరులో మూడో డకౌట్‌ జోడీ నమోదైంది. టాస్‌ గెలిచిన ధోనీసేన తొలుత 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మహీ (58; 37 బంతుల్లో 6×4, 1×6) అజేయ అర్ధశతకం బాదేశాడు. ఛేదనలో తొలి పరుగు వద్దే హైదరాబాద్‌ మొదటి మూడు వికెట్లూ చేజార్చుకుంది. పేసర్‌ ఆల్బీ మోర్కెల్‌ వేసిన తొలి ఓవర్లో గిల్‌క్రిస్ట్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 2 వద్ద గిబ్స్‌ను సుదీప్‌ త్యాగీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మూడు పరుగుల వద్ద మోర్కెల్‌‌ బౌలింగ్‌లో జకాతికి లక్ష్మణ్‌ (0; 7 బంతుల్లో) క్యాచ్‌ ఇచ్చాడు. ఛేదనలో హైదరాబాద్‌ 100కే కుప్పకూలింది.


నాలుగో జోడీ: రోంచి-డుమిని

డకౌట్‌ రికార్డుల్లో ముంబయి ఓపెనర్లకూ చోటు దక్కింది. ఈస్ట్‌ లండన్‌ వేదికగా దిల్లీతో ముంబయి తలపడింది. సచిన్‌ సేన తొలుత బ్యాటింగ్‌ చేసింది. దిల్లీ బౌలర్‌ నన్నెస్‌ వేసిన తొలి ఓవర్లో ల్యూక్‌ రోంచి రనౌట్ రూపంలో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రజత్‌ భాటియా వేసిన రెండో ఓవర్లో మరో ఓపెనర్‌ జేపీ డుమిని (0) అమిత్‌ మిశ్రాకు క్యాచ్‌ ఇచ్చాడు. కాగా, ముంబయి నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ 7 వికెట్ల తేడాతో అనాయాసంగా ఛేదించింది.


ఐదో జోడీ: గంభీర్‌-వార్నర్‌

దూకుడుగా ఆడే గౌతమ్‌ గంభీర్‌, డేవిడ్‌ వార్నర్ ఓపెనింగ్‌ జోడీ డకౌట్‌ బాధ‌ను తప్పించుకోలేక పోయింది. సెంచూరియన్‌ వేదికగా దిల్లీ, హైదరాబాద్‌‌ పోటీపడ్డాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి శుభారంభం దక్కలేదు. ఎందుకంటే హైదరాబాద్‌ బౌలర్‌ రియాన్‌ హ్యారిస్‌ చురకత్తుల్లాంటి బంతులు విసిరాడు. ఐదు బంతులాడిన గంభీర్‌.. హర్మీత్‌ సింగ్‌కు, ఒక బంతి ఆడిన వార్నర్‌.. గిబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. దిల్లీ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ ‌6 వికెట్ల తేడాతో ఛేదించడం గమనార్హం.


ఆరో జోడీ: వీవీఎస్‌- మెక్‌కలమ్‌

2010లో ఇద్దరు ఓపెనర్లు డకౌట్‌ అవ్వలేదు. 2011లో మాత్రం ఈ రికార్డు మళ్లీ నమోదైంది. ముంబయిలోని డీవై పాటిల్‌ వేదికగా కేరళతో పుణె తలపడింది. వీవీఎస్‌ లక్ష్మణ్‌, మెక్‌ కలమ్‌ కోచి తరఫున ఓపెనింగ్‌కు దిగారు. అల్ఫాన్సో థామస్‌ తొలి బంతిని ఎదుర్కొన్న మెక్‌కలమ్‌ కీపర్ రాబిన్‌ ఉతప్పకు క్యాచ్‌ ఇచ్చాడు. పర్నెల్‌ బౌలింగ్‌లో మూడు బంతులు ఆడిన మరో ఓపెనర్‌ లక్ష్మణ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అయితే కేరళ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి పుణె ఛేదించింది.


ఏడో జోడీ: గౌతీ-కలిస్‌

ఓపెనర్ల డకౌట్ జోడీకి మూడేళ్ల విరామం వచ్చింది. చివరిసారిగా 2014లో రికార్డు నమోదైంది. దుబాయ్‌ వేదికగా కోల్‌కతా, దిల్లీ తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ‌ఎంచుకున్న కోల్‌కతాకు దిల్లీ శుభారంభం దక్కనివ్వలేదు. తొలి బంతికే జాక్వెస్‌ కలిస్‌ను మహ్మద్‌ షమి ఔట్‌ చేశాడు. రాస్‌ టేలర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత కౌల్టర్‌నైల్ ‌బౌలింగ్‌లో డుమినికి గంభీర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే, మనీశ్‌ పాండే (48), రాబిన్‌ ఉతప్ప (55) పోరాడటంతో కేకేఆర్‌ 166 పరుగులు చేసింది. ఏదేమైనప్పటికీ 4 వికెట్ల తేడాతో దిల్లీ గెలిచింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.