close

తాజావార్తలు

పాకిస్థాన్‌పై ప్రత్యేక విజయం గుర్తుందా?

2007 ప్రపంచకప్‌ తొలి టీ20 మ్యాచ్‌కి 12 ఏళ్లు..

భారత్‌ X పాకిస్థాన్‌ క్రికెట్‌ అంటే ఇరుదేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా యావత్‌ క్రీడాభిమానులకూ ఎంతో ఆసక్తి. రెండు జట్లూ తలపడుతున్నాయంటే సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నంత ఉద్విగ్న పరిస్థితులు. క్రికెట్‌లో ఉండే క్రేజ్‌ ఒకెత్తయితే.. ఈ దాయాది జట్లూ తలపడే మ్యాచ్‌ మరో ఎత్తు. అందులోనూ టీ20.. పోటాపోటీగా సాగే మ్యాచ్‌లో నువ్వా, నేనా అనే రీతిలో ఇరు జట్లు తలపడుతుంటే సగటు అభిమాని ఉత్కంఠను కొలవడానికి ఏ పరికరం సరితూగదేమో! బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించినా, బౌలర్లు వికెట్ల పతనం శాసించినా అభిమానుల సంతోషానికి అంతే ఉండదు. 
అలాంటి ఉద్వేగ విజయాల్లో భారత జట్టుకు ఎప్పటికీ గుర్తుండిపోయేది 2007 టీ20 ప్రపంచకప్‌. దాయాది దేశాల మధ్య ఎన్ని ఆసక్తికర మ్యాచ్‌లు జరిగినా ఆ ప్రపంచకప్‌ మాత్రం టీమిండియా అభిమానులకు మధుర జ్ఞాపకమే. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆ సిరీస్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై తొలి టీ20లో ప్రత్యేక విజయం సాధించడమే కాకుండా ఫైనల్లో చిత్తుచేసి తొలి టీ20 ప్రపంచకప్‌ అందుకొని చరిత్ర సృష్టించింది. అయితే లీగ్‌ దశలో తొలి టీ20లో స్కోర్లు సమం కావడంతో పాక్‌పై బౌలౌట్‌ విధానంలో ధోనీసేన ప్రత్యేక విజయం సాధించి నిన్నటికి 12 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆనాటి మ్యాచ్‌ను ఓసారి గుర్తుచేసుకుంటే..

తొలుత టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అతడి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాక్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు తీసి ధోనీసేనను 141 పరుగులకు నిలువరించారు. రాబిన్‌ ఊతప్ప(50; 39 బంతుల్లో 4x4, 2x6), ధోనీ (33; 31 బంతుల్లో 3x4, 1x6) రాణించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. మహ్మద్‌ ఆసిఫ్‌ నాలుగు కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. 

ఆపై లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దాయాది దేశం ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా.. రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చింది. ఆఖర్లో మిస్బా ఉల్‌ హక్‌ (53; 35 బంతుల్లో 7X4, 1x6) ధాటిగా ఆడడంతో ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్‌లో పాక్‌ గెలవాలంటే 12 పరుగులు చేయాల్సిన ఉంది. శ్రీశాంత్‌ బౌలింగ్‌లో యాసిర్‌ అరాఫత్‌ తొలి బంతికి సింగిల్‌ తీసి మిస్బాకు స్ట్రైక్‌ ఇచ్చాడు. అతడు వరుసగా 4, 2, 4 పరుగులు చేయడంతో సమీకరణం ఆఖరి రెండు బంతుల్లో 1 పరుగు అవసరమైంది. ఇక పాక్‌ విజయం ఖాయమే అని అంతా భావించినా శ్రీశాంత్‌ మాయ చేశాడు. ఐదో బంతిని ఆఫ్‌సైడ్‌ వేయడంతో మిస్బాకు అందలేదు. చివరి బంతికి సింగిల్‌ తీయాలి. మిస్బా కవర్‌లో షాట్‌ ఆడి పరుగుకు యత్నించాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న యువీ ఒక్కసారిగా బంతి అందుకొని శ్రీశాంత్‌కు అందజేశాడు. అతడు బ్యాట్స్‌మెన్‌ని రనౌట్‌ చేయడంతో మ్యాచ్‌ టైగా మారింది.

బౌలౌట్‌లో.. భారత్‌ విజయం


ఇరు జట్ల స్కోర్లు సమమవ్వడంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. అంపైర్లు బౌలౌట్‌ విధానం ద్వారా ఫలితాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం టీమిండియా సెహ్వాగ్‌, ఊతప్ప, శ్రీశాంత్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, హర్భజన్‌సింగ్‌ పేర్లను ప్రకటించగా.. పాకిస్థాన్‌ జట్టు ఉమర్‌గుల్‌, సోహైల్‌ తన్వీర్‌, అరాఫత్‌, షాహిద్‌ అఫ్రిదీ, అసిఫ్‌లను ఎంచుకుంది. 

• తొలి బంతిని సెహ్వాగ్‌ బౌల్డ్‌ చేయగా పాక్‌ బౌలర్‌ అరాఫత్‌ మిసయ్యాడు.
• రెండో బంతిని హర్భజన్‌సింగ్‌ వేయగా అది కూడా వికెట్లను తాకింది. ఇక ఉమర్‌గుల్‌ వేసిన రెండో బంతి సైతం వికెట్లను తాకలేదు.
• రాబిన్‌ ఊతప్ప మూడో బంతిని బౌల్డ్‌ చేయగా షాహిద్‌ అఫ్రిదీ దాన్ని కూడా వృథా చేశాడు. 

దీంతో ఒక్కసారిగా ధోనీసేనతో పాటు యావత్‌ భారత దేశం గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.