close

తాజావార్తలు

మయాంక్‌ ‘మాయ’: తొలిరోజు భారత్‌ 273/3

పుణెలో శతకంతో చెలరేగిన మయాంక్‌

కోహ్లీ, పుజారా అర్ధశతకాలు

తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో అదరగొట్టింది. పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పోరులో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తన సాధికారిక బ్యాటింగ్‌తో అద్వితీయ శతకం అందుకున్నాడు. సారథి విరాట్‌ కోహ్లీ, నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అర్ధశతకాలతో రాణించడం ప్రత్యేకం.


రప్ఫాడించిన రబాడ

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కోహ్లీసేన ఆధిపత్యం దిశగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ప్రత్యర్థి పేసర్‌ రబాడ (3/48) చురకత్తుల్లాంటి బంతులు సంధించాడు. చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో శతకాలు బాదిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (14; 35 బంతుల్లో 1×4) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. రబాడ వేసిన పదో ఓవర్‌ చివరి బంతికి అతడు పెవిలియన్‌ చేరాడు. అద్భుతమైన లెంగ్త్‌తో వేసిన ఆ బంతి రోహిత్‌ డిఫెన్స్‌ను ఛేదించుకొని అతడి బ్యాట్‌ అంచుకు తగిలి కీపర్‌ డికాక్‌ చేతుల్లో పడింది. ఆ తర్వాత మొదలైంది మయాంక్‌ అగర్వాల్‌ (108; 195 బంతుల్లో 16×4, 2×6) ఆట. యువ పేసర్‌ అన్రిచ్‌ నోర్జెను లక్ష్యంగా ఎంచుకొని అతడు బౌండరీలు బాదాడు. దాంతో భోజన విరామానికి భారత్‌ 77/1తో నిలిచింది.


వారెవ్వా మయాంక్‌

విరామం తర్వాత మయాంక్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో సఫారీ పేసర్ల బౌలింగ్‌లో పరుగులు సాధించాడు. డ్రింక్స్‌బ్రేక్‌ ముందు అర్ధశతకం (112 బంతుల్లో) సాధించిన అతడు ఛెతేశ్వర్‌ పుజారా (58; 112 బంతుల్లో 9×4, 1×6)తో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. తన అనుభవం, టెక్నిక్‌తో స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న పుజారాను ఓ అద్భుత బంతికి రబాడ ఔట్‌ చేయడంతో టీమిండియా 168/2తో తేనీటి విరామానికి వెళ్లింది.


ఆఖర్లో కోహ్లీ

విరాట్‌ కోహ్లీ (63 బ్యాటింగ్‌; 105 బంతుల్లో 10×4) సహకారంతో మయాంక్‌ 183 బంతుల్లో కెరీర్‌లో రెండో శతకం అందుకున్నాడు. సిరీస్‌లో అతడికిది వరుసగా రెండో శతకం కావడం గమనార్హం. మరోసారి భారీ స్కోరు చేయాలనుకున్న అతడి కలను రబాడ అడ్డుకున్నాడు. జట్టు స్కోరు 198 వద్ద చక్కని లెంగ్త్‌ బంతితో మయాంక్‌ను బోల్తాకొట్టించాడు. స్లిప్‌లో భుజాలపైకి వచ్చిన బంతిని డుప్లెసిస్‌ చక్కగా ఒడిసిపట్టాడు. ఆ తర్వాత అజింక్య రహానె (18 బ్యాటింగ్‌; 70 బంతుల్లో 3×4)తో కలిసి కోహ్లీ చెలరేగాడు. ఫిలాండర్‌ వేసిన 80.5వ బంతికి బౌండరీ బాది 23వ అర్ధశతకం అందుకున్నాడు. వేగంగా ఆడుతూ నాలుగో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ 273/3తో తొలిరోజు ఆటను ముగించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.