TS News: వాసాలమర్రిలో 18 మందికి అస్వస్థత
close

ప్రధానాంశాలు

TS News: వాసాలమర్రిలో 18 మందికి అస్వస్థత

సీఎం పక్కన కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలికీ అనారోగ్యం

ఆసుపత్రిలో చేరి కోలుకున్న ఆగమ్మ

తుర్కపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. సీఎం పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తయ్యాక బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలయ్యాయి. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు అదే రాత్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం డిశ్ఛార్జి చేసినట్లు సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకొన్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల వాసాలమర్రి గ్రామంలో మంగళవారం సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటుచేసిన విషయం విదితమే. బుధవారం ఒక బాలిక అస్వస్థతకు గురి కావటంతో ఆసుపత్రికి తరలించారు. అదే రోజు ఆ బాలికను ఇంటికి పంపారు. గ్రామంలో మరో 16 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. బుధవారం ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి సీహెచ్‌.చంద్రారెడ్డి తెలిపారు. వారి అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని, సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొనగా.. 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురైనట్లు పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం పడక వాంతులు, విరేచనాలై ఉంటాయని చెప్పారు.



Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని