బైంసా అల్లర్లపై సీబీఐ విచారణకు అమిత్‌షా హామీ

ప్రధానాంశాలు

బైంసా అల్లర్లపై సీబీఐ విచారణకు అమిత్‌షా హామీ

ఎంపీ సోయం బాపురావు వెల్లడి

ఈనాడు, దిల్లీ: బైంసా అల్లర్ల విచారణలో తెరాస ప్రభుత్వం ఓ వర్గంపై కక్ష సాధిస్తోందని, విచారణలోనూ వివక్ష చూపుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రిని బుధవారం ఎంపీ కలిశారు. బైంసాలో మార్చి ఏడున జరిగిన హింసాత్మక ఘటనలో ఒక వర్గానికి చెందిన 31 మందిపై కేసులు పెట్టారని, అందులో ఓ బాలుడు ఉన్నారని వివరించారు. బైంసా అల్లర్లు చోటుచేసుకున్న తీరు, అనంతరం విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఆయన అమిత్‌ షాకు తెలియజేశారు. ఎంపీ వెంట మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌ ఉన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఎంపీ సోయం బాపురావు విలేకరులతో మాట్లాడారు. బైంసా అల్లర్ల ఘటనపై దృష్టి పెట్టి సీబీఐ విచారణకు ఆదేశిస్తామని అమిత్‌ షా హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. గిరిజనులు, దళితులు, బీసీలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 30న భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద భారీ ధర్నా చేయనున్నట్లు ఎంపీ చెప్పారు. పోడు వ్యవసాయదారులకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని