36 కేజీబీవీల్లో కొత్తగా ఇంటర్‌ విద్య

ప్రధానాంశాలు

36 కేజీబీవీల్లో కొత్తగా ఇంటర్‌ విద్య

ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు

రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబిత వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మరో 36 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల(కేజీబీవీ)ను ఇంటర్‌మీడియట్‌ స్థాయికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం(2021-22) నుంచే వీటిలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉండగా ఇప్పటికే 172 విద్యాలయాల్లో ఇంటర్‌ వరకు విద్య అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొత్తగా మరో 36 విద్యాలయాల్లోనూ ఇంటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రతి దాంట్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌)ల్లో ఏవైనా రెండు కోర్సులు ఉంటాయని తెలిపారు. ఒక్కో కేజీబీవీలో 80 సీట్లు ఉంటాయని, ఫలితంగా కొత్తగా 2880 మంది పేద అమ్మాయిలు ప్రయోజనం పొందుతారన్నారు. నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు, కరాటే, యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయిన తర్వాత ఇంత ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. జులైలోనే సమగ్రశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు ఆమోదిత మండలి 36 కేజీబీవీల ఉన్నతీకరణకు ఆమోదం తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని