ఎడతెగని నిరీక్షణ..!

ప్రధానాంశాలు

ఎడతెగని నిరీక్షణ..!

పోలీస్‌శాఖలో పోస్టింగ్‌ల కోసం కొనసాగుతున్న ఎదురుచూపులు

ఖాళీ స్థానాలూ పూర్తి అదనపు బాధ్యతలతోనే సరి

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పోస్టింగ్‌ల కోసం ఐపీఎస్‌ అధికారుల ఎడతెగని నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2018 తర్వాత ఎక్కువ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు జరగకపోవడంతో పోలీస్‌శాఖలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. ఒకటీఆరా పోస్టింగ్‌లు మాత్రమే ఇస్తున్నారు. పలు స్థానాలు ఖాళీ అవుతున్నా పూర్తి అదనపు బాధ్యతలతోనే సరిపెడుతున్నారు. మరోవైపు పలువురు సీనియర్లు డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉంటూ పోస్టింగ్‌ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత పోస్టింగ్‌లు ఉంటాయనే ప్రచారం నెలకొంది. మహబూబ్‌నగర్‌ ఎస్పీగా పనిచేసిన రెమారాజేశ్వరిని అయిదు నెలల క్రితం, కరీంనగర్‌ కమిషనర్‌గా పనిచేసిన వి.బి.కమలాసన్‌రెడ్డిని మూడు నెలల క్రితం బదిలీ చేశారు. అలాగే కేంద్ర సర్వీసుల నుంచి అదనపు డీజీపీ సీవీ ఆనంద్‌, విజయ్‌కుమార్‌ గత నెలలో.. ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్‌పై 2018లో పంజాబ్‌కు వెళ్లిన విక్రమ్‌జీత్‌ దుగ్గల్‌ ఇటీవల తెలంగాణ కేడర్‌కు తిరిగి వచ్చారు. వీరికి ఇంకా పోస్టింగ్‌లు దక్కలేదు.

* పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన మల్లారెడ్డి గతేడాది పదవీ విరమణ పొందడంతో పీఅండ్‌ఎల్‌ ఐజీపీ సంజయ్‌కుమార్‌ జైన్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన అప్పటికే ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

* అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ డీజీగా పనిచేసిన పూర్ణచందర్‌రావు రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో సీఐడీ అదనపు డీజీగా పనిచేసి డీజీగా పదోన్నతి పొందిన గోవింద్‌సింగ్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని