close
మధ్యకాలిక వరి వంగడాల సాగే ఉత్తమం 

సాగుపై రుతుపవనాల ఆలస్య ప్రభావం 
వ్యవసాయ శాస్త్రవేత్త జి.శ్రీనివాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాగుకు అక్కరకు వచ్చేలా లేవు. నిర్ణీత కాలానికి 16 రోజులు ఆలస్యంగా వచ్చాయి. వర్షాలు ఆలస్యం కావడం పంటలసాగుపై ప్రభావం పడుతోంది. కాలానికి తగినట్లు మేలైన రకాల వంగడాలను ఎంపిక చేసుకుని సాగుచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు తొలకరిలో వర్షాలు తగిన మోతాదులో కురవకపోవడం కూడా సాగులో రైతులు వెనక్కు తగ్గినట్లు అయింది. సోమవారం హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రుతుపవనాలు, సాగు తీరును విశ్లేషించారు. 
ఇప్పటి వరకు 37 శాతం లోటు వర్షం 
రుతుపవన కాలం ప్రారంభమయ్యే జూన్‌లో రాష్ట్రంలో ఇప్పటి వరకు 37 శాతం లోటు వర్షపాతం నమోదయింది. 97.9 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 61.6 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది. ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మేడ్చల్‌ మల్కాజిగిరి, మహబూబాబాద్‌, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ జిల్లాల్లో యాభై శాతానికి పైన లోటు వర్షపాతం ఉంది. జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణం ఏర్పడింది. మరోవైపు జూన్‌ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు 52 శాతమే వర్షం కురవడంతో నేలలో తగినంత తేమ లేదు. 
దుక్కులు సిద్ధం 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు ఆలస్యమైన వర్షాల కారణంగా విత్తులు వేసేందుకు కొంత ఆలోచిస్తున్నారు. మధ్యకాలిక రకాల వరి నారు ఇప్పుడు పోస్తే 20-25 రోజుల తర్వాత నాటు వేసుకోవచ్చని వ్యవసాయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త జి.శ్రీనివాస్‌ తెలిపారు. దీనివల్ల పంటలు సకాలంలో చేతికి వస్తాయన్నారు. దీర్ఘకాలిక రకాల వరి వంగడాలు వేస్తే పంటలో త్వరగా గొలుసు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తద్వారా నష్టాల పాలవుతారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైనా వచ్చే నెలలో స్వల్పకాలిక రకాలను సాగుచేసుకునే వెసులుబాటు ఉందన్నారు. మెట్ట పంటల్లో జొన్న, పెసర మాత్రం ఈ నెలాఖరులోపే సాగుచేయాలని సూచించారు. మిగిలిన సోయ, పత్తి, మొక్కజొన్న, కంది, ఆముదం రకాలను వచ్చే నెల 15 వరకు సాగుచేసుకోవచ్చని తెలిపారు.వాతావరణ కేంద్రం అధికారి రాజారావ్‌ మాట్లాడుతూ.. భారత వాతావరణ శాఖ వెబ్‌సైట్‌ ప్రకారం జూన్‌ 5న తెలంగాణకు నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉందని, దీనికి భిన్నంగా 16 రోజులు ఆలస్యంగా వచ్చాయన్నారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.