ఫలించని నిజాం వేట!

ప్రధానాంశాలు

ఫలించని నిజాం వేట!

పోలోకు ముందే తెరవెనక యుద్ధం!

సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ విమోచనం, విలీనాల వాదన తెరపైకి వస్తుంది.  హైదరాబాద్‌ను 13 నెలల పాటు స్వతంత్ర భారత్‌లో కలపకుండా ఉంచిన నిజాం రాజు- ఆ ఏడాదంతా ఏం చేశాడు? 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబరు 17 మధ్య ఏం జరిగింది?

‘ఆపరేషన్‌ పోలో’, ఆపరేషన్‌ క్యాటర్‌ పిల్లర్‌... హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు పెట్టిన పేర్లివి! సరిగ్గా 109 గంటల్లో భారత సేన విజయం సాధించింది. అయితే మైదానంలో పోరు కంటే కూడా తెరవెనక తీవ్రమైన దౌత్య యుద్ధమే జరిగింది. భారత్‌ చకచకా పావులు కదపకపోయుంటే ఆపరేషన్‌ పోలో కాస్త సుదీర్ఘంగా సాగేదే!

యథాతథస్థితి ఒప్పందం...

వీలైతే హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచటం; లేదంటే పాకిస్థాన్‌లో కలపాలనే ఉద్దేశంతో నిజాం రాజు ఉస్మాన్‌ మీర్‌ అలీ ఖాన్‌-7 ఎత్తులు వేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఉన్నట్లే భారత ప్రభుత్వంతో కూడా యథాతథ స్థితి కొనసాగించేలా ఒప్పందానికి సిద్ధమయ్యాడు. బ్రిటిష్‌ సైన్యాలు హైదరాబాద్‌లో ఉన్నట్లే భారత సైన్యం హైదరాబాద్‌లో ఉండేందుకు దీనివల్ల వీలవుతుంది. కానీ దీన్ని మజ్లిస్‌ ఎ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఇత్తెహాద్‌), రజాకార్ల అధినేత ఖాసిం రజ్వీ వ్యతిరేకించారు. నిజాం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఒకరకంగా నిజాంపై రజ్వీ తిరుగుబాటు చేసినంత పని చేశాడు. దాంతో ఒత్తిడికి తలొగ్గిన నిజాం- హైదరాబాద్‌లో భారత సైన్యం ఉండకుండా షరతు విధించి 1947 నవంబరు 29న భారత గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌తో స్టాండ్‌స్టిల్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిప్రకారం ఏడాది పాటు విదేశాంగ, రక్షణ, కమ్యూనికేషన్‌ వ్యవహారాల్లో తప్పిస్తే హైదరాబాద్‌పై నిజాంకే పూర్తి అధికారాలుంటాయి.  

విదేశాలతో ఆయుధ బేరాలు..

ఒప్పందాన్ని నిజాం వెంటనే ఉల్లంఘించటం మొదలెట్టాడు. భారత్‌తో సుదీర్ఘ యుద్ధానికి వ్యూహాలు రచించాడు. భారీస్థాయిలో ఆయుధాలు సమకూర్చుకోవటానికి సిద్ధమయ్యాడు. విదేశాంగ వ్యవహారాలు భారత్‌కు కట్టబెట్టినా ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ... ఇలా అన్ని దేశాలనూ సంప్రదించటం మొదలెట్టాడు. ఇందుకోసం పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా వాడుకున్నాడు. పాక్‌కు రహస్యంగా కోటీ 50లక్షల పౌండ్ల రుణం ఇచ్చాడు. దీంతో నిజాం తరఫున ఆయుధాల కొనుగోలుకు పాకిస్థాన్‌ రంగంలోకి దిగింది. 6లక్షల రైఫిళ్లు, అంతేసంఖ్యలో రివాల్వర్లు, 3లక్షల లైట్‌ అండ్‌ హెవీ మెషీన్‌గన్లు ఫ్రాన్స్‌ నుంచి ఆర్డర్‌ చేసింది. ఇవన్నీ హైదరాబాద్‌ కోసమనే విషయం కామన్వెల్త్‌ రిలేషన్స్‌ ఆఫీసు (సీఆర్‌ఓ), యూకే విదేశాంగశాఖ ద్వారా లండన్‌లో భారత హైకమిషనర్‌ కృష్ణ మేనన్‌కు తెలిసింది. దీంతో భారత్‌ దౌత్యపరంగా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి అడ్డుకుంది.

రంగంలోకి ఆస్ట్రేలియా ఏజెంట్‌

చేసేదేమీ లేని నిజాం ఆయుధవేటలో మరోమార్గం వెతుక్కున్నాడు. అదే ఆస్ట్రేలియా ఏజెంట్‌ సిడ్నీకాటన్‌ సాయం! ఇతనికి పలు దేశాల ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలుండేవి. కాటన్‌ను హైదరాబాద్‌కు పిలిపించి తనకు కావాల్సిన ఆయుధాల జాబితా ఇచ్చాడు నిజాం. భారత్‌ ఎంత అడ్డుకున్నా 1948 ఆగస్టు కల్లా పూర్తిగా కాకున్నా కొన్ని ఆధునిక ఆయుధాలు హైదరాబాద్‌కు వచ్చాయి. కొత్త ఆయుధాలైతే వచ్చాయిగానీ...వాటిని ఎలా వాడాలో నిజాం సైన్యానికి తెలియలేదు. శిక్షణ ఇచ్చే సమయం కూడా లేకపోయింది. అప్పటికే భారత సైన్యం ముప్పేట దూసుకురావటంతో నిజాం సైన్యం స్వల్ప ప్రతిఘటనతో లొంగిపోయింది.

విమానం వెనక రజ్వీ పరుగు

పరిస్థితి గమనించిన సిడ్నీ కాటన్‌ సెప్టెంబరు 16 తెల్లవారుజామునే హకీంపేట నుంచి, సుమారు 40 కోట్ల రూపాయల నగదుతో విమానం ఎక్కేశాడు. ఖాసిం రజ్వీ కూడా ఇదే విమానంలో వెళ్లాల్సింది. ఆయన ఎక్కాడో లేదో చూసుకోకుండానే కాటన్‌ విమానం బయల్దేరింది. రజ్వీ వెనకాల పరుగెత్తుకుంటూ వెళ్లాడు. కానీ అప్పటికే విమానం గాల్లోకి ఎగిరింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని