close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జగన్మాతా... నమోస్తుతే!

అమ్మ... ప్రేమానురాగాలను పంచుతుంది. పొత్తిళ్లలో సంరక్షిస్తుంది. పొరపాట్లను సహిస్తుంది.. మార్గదర్శనం చేస్తుంది... మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే శక్తినిస్తుంది. జగదంబా అంతే... అమ్మా...అని పిలిస్తే చాలు వినిర్మల భక్తితో తలిస్తే చాలు నేనున్నానంటూ వెలుస్తుంది. సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. అలాంటి జగన్మాత పండగ నేడు. ‘‘యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః’’అంటూ జాతి అంతా ఆమెను పూజించే రోజు ఇది...

ఏదైనా సాధించాలంటే కావాల్సింది బలమైన కోరిక... దీన్ని ఇచ్ఛ అంటారు. అవసరమైంది జ్ఞానం, చేయాల్సింది క్రియ... వీటిని త్రిశక్తులు అంటారు. ఈ మూడూ సమకూరితే విజయం తథ్యం. వీటినిచ్చేది జగదంబ. నిజానికి సకల సృష్టీ ఈ త్రిశక్తుల వల్లే ఏర్పడింది. అంటే చరాచర సృష్టికి కారణం జగన్మాతే. ఆమెను ఆరాధించే రోజు దసరా. ఖగోళశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమినాటి సాయం సంధ్యలో నక్షత్రాలు దర్శనమిచ్చే సమయాన్ని ‘విజయం’ అని పిలుస్తారు. ఆ రోజును విజయదశమి అని అంటారు. ఆ రోజు చెప్పుకునే సంకల్పం, ప్రారంభించే పనీ తప్పక నెరవేరతాయని నమ్మకం. అందుకే పూర్వం రాజులు అమ్మవారిని పూజించి ఆ రోజే తమ జైత్రయాత్రలకు శ్రీకారం చుట్టేవారు. విజయదశమినాడు అమ్మవారిని అపరాజిత పేరుతో పూజిస్తారు... అంటే ఓడించరానిది అని అర్థం. ఇటు భౌతిక, అటు ఆదిభౌతిక విజయాలన్నీ సమకూర్చే ఆ తల్లి తత్త్వం అపురూపమైంది.
న తే నామగోత్రే న తే జన్మమృత్యు
న తే ధామచేష్టే న తే దుఃఖసౌఖ్యే
న తే మిత్రశత్రు న తే బంధమోక్షౌ
స్వమేకా పరబ్రహ్మ రూపేణ సిద్ధా!

అమ్మా... నీకు నామ గోత్రాలు లేవు. జనన మరణాలు లేవు. బంధమోక్షాలు లేవు. అద్వితీయ పరబ్రహ్మానివి నీవే!  మహంకాళ సంహితలోని ఈ స్తోత్రం చాలు జగన్మాత స్వరూప, స్వభావాలను అర్థం చేసుకోవడానికి. అన్నిటికీ అతీతమైన ఆ జగన్మాత తన బిడ్డలకూ అవే ఫలాలను పంచుతుంది. కష్టాలూ, నష్టాలూ నశింపజేస్తుంది. బంధమోక్షాల నుంచి విముక్తి కలిగించి జ్ఞానవైరాగ్యాలను సిద్ధింపజేస్తుంది. అమృతత్వాన్నిస్తుంది.

ఎవరీమె?
చరాచర విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఒక్కటే. సూర్యుడికి వెలుగునిచ్చేది, అగ్నికి ఉష్ణాన్నిచ్చేది, చంద్రుడికి వెన్నెలనిచ్చేది... అన్నీ ఒక్కటే. ఆ శక్తి లేని స్థలమే ఉండదు. అందులో నుంచే చరాచర జగత్తూ ఆవిర్భవిస్త్తోంది. స్థితి, లయలకు కారణమూ ఆ దివ్యత్వమే. అన్నీ, అంతా తానైన ఆ మూలశక్తిని జగన్మాతగా చూస్తాం. జగదంబగా కొలుస్తాం. ఏక రూపంలోని ఈ శక్తి వివిధ అవతారాలను ధరించిందని ‘శ్వేతాశ్వతారోపనిషత్తు’ చెబుతోంది. దేవీ భాగవతంలో జగన్మాత తన గురించి బ్రహ్మకు స్వయంగా చెబుతుంది... ఈ సృష్టిలో నేను కానిది ఏదీలేదు...బుద్ధి, సిరి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యవ్వనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, వాక్కు, మజ్జ, వృష్టి, చర్మం.... ఇలా సమస్తం నేనే అంటుంది. సర్వ దేవతా స్వరూపం నాదే. శక్తిని, పరాక్రమాన్ని నేనే అని చెబుతుంది. సృజన, పాలన, సంహారాలనే మూడు శక్తులు కలిగి ఉన్న జగజ్జనని విశ్వానికి అంకురార్పణ జరిగాక దాన్ని నిర్వహించడానికి అవసరమైన సామర్థ్యాన్ని త్రిమూర్తులకు సమకూర్చింది. బ్రహ్మకు సృజన శక్తిని, విష్ణువుకు పాలన, శివుడికి సంహార శక్తులను ప్రసాదించి బ్రాహ్మి, వైష్ణవి, శివాని రూపాల్లో వారి వెన్నంటి ఉండి లోకరక్షణ చేయిస్తోందని దేవీ భాగవతం వివరిస్తోంది. అలాగే రక్ష, మంత్ర, ప్రాణ, కళా, విశ్వ, విద్యా, వాగ్వైభవ, సంహార, ధార్మిక అనే తొమ్మిది శక్తులకూ జగన్మాతే అధిదేవత.

పాదాలు వదలొద్దు!
ప్రతి మనిషికీ ఆశలూ, కోరికలు, ఆశయాలూ చాలా ఉంటాయి. ఇవన్నీ నెరవేర్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది. కానీ ఎవరు ఎన్ని ఆశించినా, ఆశలు పెట్టుకున్నా... ఏమి జరగాలో, ఎలా జరగాలో అదే జరుగుతుంది. అదే కాల మహిమ. అది చాలా గొప్పది, చిత్రమైంది కూడా. ఇంతటి కాలం కూడా జగన్మాత ఆధీనంలో ఉంటుంది. మనిషి తీవ్రంగా ప్రయత్నిస్తూ.. ఓడిన ప్రతిసారీ నిరుత్సాహానికి గురవుతూ గెలిచిన ప్రతిసారీ దానికి కారణం తానేనని అతిశయానికి లోనవుతూ రోజులు దొర్లిస్తుంటాడు. కానీ అమ్మను శరణువేడితే చాలు - కాల, కర్మలకు అతీతమైన స్థితి మనిషికి ఆమె వరంగా ఇస్తుందని చెబుతుంది దేవీ భాగవతం.

మనకోసం యుద్ధం చేసింది!
మనం దసరా పండగ చేసుకోడానికి కారణంగా చెప్పే కథ దేవీ భాగవతంలోనిది. మహిషాసురుడనే రాక్షసుణ్ణి జగన్మాత సంహరించడంతో లోకానికి వెలుగులు వచ్చిన రోజుగా దీన్ని నిర్వహించుకుంటాం. నిజానికి అమ్మ సంహరించింది మనలోని అసురుణ్ణే. మనిషిలోని రాక్షసాంశే మహిషాసురుడు. అరిషడ్వర్గాలే అతని అంగాలు. ఇక్కడ మహిషం అంటే దున్నపోతు. మహిషుడికి ఉన్న రెండు కొమ్ములూ కామ, క్రోధాలకు చిహ్నాలు. రెండు కాళ్లు మద మాత్సర్యాలైతే... లోభ మోహాలు వెనక కాళ్లు. దుర్గ తన కుడి పాదంతో మహిషుడి అహంకారానికి ప్రతీక అయిన కొమ్మును... ఎడమ పాదంతో మాత్సర్యానికి గుర్తయిన మహిషుడి కుడి కాలును తొక్కిపట్టింది. భక్తి, జ్ఞాన, యోగ శక్తుల కలయిక అయిన శివ శూలాన్ని అతని మెడపై ఉంచింది. కోపం, మాత్సర్యం అణిగిపోతే మిగిలిన కామ, మద, లోభ, మోహాలనే అసురీ లక్షణాలు
వాటంతటవే నియంత్రణలోకి వస్తాయని ఇందులోని అంతరార్థం. మహిషాసురుడిపై యుద్ధం ద్వారా జగన్మాత మనుషులకు మరో బోధ చేసింది. అసురుణ్ణి వధించే క్రమంలో ఆమె ఒక్క రోజులో విజయం సాధించలేదు. తొమ్మిదిరోజుల పాటు ఎడతెగని యుద్ధం చేసింది. చివరకు మహిషాసురుడిని సంహరించి లోకానికి విజయదశమిని అందించింది. మనిషిలోని రాక్షసత్వాన్ని అంతం చేయడం అంత తేలిక కాదు. నిరంతరం మనోవృత్తులను శాసించే అరిషడ్వర్గాలను గెలిచేందుకు ఎంతో సాధన అవసరం. వినిర్మలమైన భక్తితో, పరివేదనతో, పట్టుదలతో ప్రయత్నిస్తే అజ్ఞానాంధకారాలను పటాపంచలు చేయగలం. అలా నిష్కల్మషమైన హృదయంతో, నవనవోన్మేషమైన ఆలోచనలతో జీవితాన్ని దేదీప్యమానం చేసుకున్నరోజే నిజమైన విజయదశమి.

అందుకే దసరా...
అమ్మవారిని ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు - తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. పాడ[్యమినాడు ఆవాహనతో మొదలుపెట్టి దశమినాటి వేడుకలతో అమ్మ ఆరాధనను ముగిస్తారు. శరదృతువులో జరుగుతాయి కాబట్టి శరన్నవరాత్రులని, దేవీ నవరాత్రులనీ వీటిని పిలుస్తారు. శరదిది భవా శారదా... అంటే... శరత్కాలంలో పుట్టింది కాబట్టి దేవికి శారద అనే పేరు వచ్చింది. కొన్ని ఐహిక, సామాజిక, పారమార్థిక అవసరాలను ఈ కాలంలో అమ్మ అవతరణకూ, ఆమె పూజకూ కారణాలుగా చెబుతారు. వసంత, శరదృతువులను యమ దంష్ట్రలు అంటారు.... అంటే యముడి కోరలు అని అర్థం. చలి మొదలయ్యే ఈ సమయంలో వ్యాధులు విజృంభిస్తుంటాయి. వాటి నుంచి రక్షణ కోసం మనకు శక్తి అవసరం. అమ్మ ఆరాధన ఈ సమయంలో సాధకుల పాలిట రక్షణ కవచంలా ఉంటుందనీ అందుకే రన్నవరాత్రులు నిర్వహించే సంప్రదాయం వచ్చిందనీ చెబుతారు. ఏటా మూడు రకాల నవరాత్రులు జరిపే సంప్రదాయం ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, గణేశ చతుర్థి పురస్కరించుకుని భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులూ నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో శారదను స్తుతించే తొమ్మిది రోజులను శరన్నవరాత్రులు అని పిలుస్తారు. ఇవి జగదాధారిణి అయిన జగన్మాతని కొలిచే నవరాత్రులు. ఈ కాలంలో తొమ్మిది రూపాల్లో దేవిని పూజిస్తే ఏడాదంతా పూజించిన ఫలితం వస్తుందని అంటారు.
అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ
దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురిరిపు వరాహస్య భవతి!
ఇది అమ్మపై ఆది శంకరులు చేసిన స్తుతి. అజ్ఞాన చీకట్లను పారదోలి, అన్ని రకాల చీకట్లను తొలగించే చింతామణివి నీవు. సంసారంలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించే దయామయివి నీవు... అంటూ కీర్తించారాయన. అమ్మవారిని శ్రద్ధగా ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. దరిద్రం ధ్వంసమైపోతుంది. కష్టాల నుంచి అమ్మ వాత్సల్యంతో రక్షిస్తుంది. మన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.

నవదుర్గలెవరు...
‘‘ప్రథమా శైలపుత్రీ చ
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి
కూష్మాండేతి
చతుర్థకమ్‌!!
పంచమం స్కందమాతేతి
షష్టం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి
మహాగౌరీతి చాష్టమమ్‌!!
నవమ్‌ సిద్ధిధాత్రీ చŸ నవదుర్గా ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామాని బ్రాహ్మణైవ
మహాత్మనా!!
అంటూ అమ్మవారిని కొలుస్తారు. అసలు ఈ నవదుర్గ స్వరూపాలేంటో చూస్తే...


శైలపుత్రి: హిమవంతుని కుమార్తె. పర్వత పుత్రి కాబట్టి పార్వతి అని పిలుస్తారు. వృషభవాహిని, శూలధారిణి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు నమ్ముతారు. ఈమె భూతత్త్వానికి ప్రతీక అయిన ధూసర వర్ణంలో కనిపిస్తుంది.


బ్రహ్మచారిణి: పరమశివుడిని భర్తగా పొందేందుకు తపస్సు చేస్తున్న పార్వతి రూపమే బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం, తెల్లటి వస్త్రాలను ధరించి దర్శనమిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం కోసం ఈ తల్లిని కొలుస్తారు.


చంద్రఘంట: గౌరవర్ణంలో పున్నమినాటి చంద్రుడిలా కనిపిస్తుందీమె. తలపైన అర్ధచంద్రుడు ఉంటాడు. పది భుజాలు, ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది. ధైర్యం, శత్రువుల్ని జయించే శక్తి కోసం జగన్మాతను ఈ రూపంలో పూజిస్తారు.


కూష్మాండ: కర్తవ్య దీక్షకు ప్రతిరూపమైన ఈ అమ్మవారు ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలు ధరించి ఉంటుంది. కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈ రూపంలో జగదంబను పూజించడం వల్ల ఆయురారోగ్యాలు సొంత మవుతాయని నమ్ముతారు.


స్కందమాత: నీలం రంగులో వినిర్మలమైన ఆకాశంలా జగన్మాత దర్శనమిస్తుంది. నాలుగు చేతులతో, అభయ ముద్రతో ఉండే ఈ తల్లి విశాలతత్త్వానికి ప్రతీక. ఆమె సింహవాహిని. ఈ అమ్మను పూజిస్తే... శాంతి, సకల సుఖాలు కలుగుతాయని అంటారు.


కాత్యాయని: త్రిమూర్తుల తేజంతో అలరారుతుôది ఈ దేవీ రూపం. మహిషాసురుణ్నిసంహరించడానికి ఎత్తిన ఈ అవతారాన్ని ముందుగా కాత్యాయనుడు అనే ముని పూజించడం వల్ల ఆమెకి ఈ పేరు వచ్చింది. ప్రకృతికి ప్రతీకగా ఆకుపచ్చ రంగులో కనిపించే కాత్యాయనిని కొలిస్తే.. కష్టాలూ, బాధలూ ఉండవంటారు.


కాళరాత్రి: నల్లటి రూపం, విరబోసుకున్న జుట్టు, నాలుగు భుజాలతో దుష్టులపాలిట సింహస్వప్నంలా జగన్మాత ఈ రూపంలో గార్దభ వాహనంపై దర్శనమిస్తుంది. శత్రువులకు ఎంత భయంకరమో... సజ్జనులకు అంత శుభంకరిగా ఈమెను చెబుతారు. ఈ రూపంలో దేవిని పూజిస్తే సకల పాపాలూ, గ్రహబాధలూ తొలగి పోతాయని నమ్ముతారు. నల్లని ఆమె మేనిరంగు అజ్ఞానాన్ని తొలగించుకుని, కొత్త వెలుగులవైపు పయనించాలని సూచిస్తుంది.


మహాగౌరి: చతుర్భుజాలు కలిగిన మహాగౌరి వృషభ వాహిని. తెల్లని వర్ణంలో కనిపించే అమ్మ శ్వేత వస్త్రధారిణి. ఈమెను పూజిస్తే... పాపాలన్నీ తొలగిపోతాయనీ, శుభాలు కలుగు తాయనీ చెబుతారు.


సిద్ధిధాత్రి: చతుర్భుజాలతో కమలాసనిగా దర్శనమిస్తుందీమె. ఈ రూపంలో దేవిని పూజించడం వల్ల సర్వసిద్ధులూ కలుగుతాయని నమ్మకం.


త్రిగుణాకారిణి...

ఆశ్వయుజమాసంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తుంటాడు. ఈ రాశి స్త్రీత్వం కలిగిన భూరాశి కాబట్టి ఈ కాలాన్ని జగన్మాత పూజకు ఉత్తమమైందిగా చెబుతారు. కన్యారాశిలో సత్త్వ గుణ ప్రధానమైన హస్త్త, తామస గుణ ప్రధానమైన చిత్త, రాజస గుణం కలిగిన ఉత్తర ఫల్గుణి అనే మూడు తారలు ఉంటాయి. జగన్మాత ఆరాధనతో ఈ మూడు నక్షత్రాల అనుకూలత సిద్ధిస్తుంది. దీనివల్ల విద్య, సంపద, శుద్ధ జ్ఞానం సొంతమవుతాయి. దసరాలోని తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు కాళికాదేవి, తరువాత నాలుగు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజుల్లో సరస్వతి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల బ్రహ్మ, రుద్ర, వైష్ణవీ శక్తి రూపాలను పూజించిన ఫలం దక్కుతుంది. ఇక్కడ మూడు అనే సంఖ్య త్రిగుణాలను సూచిస్తుంది, కాబట్టి దసరా పూజను త్రిగుణాత్మిక పూజ అని కూడా అంటారు.


దుర్గ అంటే...

మంచికి పెట్టని కోటలాంటి జగన్మాత తత్త్వమే దుర్గ. దుం దుర్గే దురితం హరా’ అంటూ జపిస్తే సమస్త అశుభాలనూ తొలగిస్తుందీమె. దుర్గ అనే నామంలో అయిదు అక్షరాలున్నాయి. అవి.. ద, ఉ, ర, అ, గ. ఇందులో ద అనే అక్షరం దైత్యనాశనానికీ, ఉ విఘ్ననాశనానికీ, ర రోగనాశనానికీ, అ శత్రునాశనానికీ, గ పాపనాశనానికీ చిహ్నాలని చెబుతారు. ఇవన్నీ అమ్మశక్తిని చాటుతాయి.

బీజాక్షరి...

జగన్మాత హ్రీం అనే బీజాక్షర స్వరూపంలో ఉంటుంది. దీన్నే వశ్య బీజం అంటారు. దేన్నైనా సాధ్యం చేసే శక్తి దీనికి ఉంది. ఈ బీజంలో హ, ర, ఈ అనే మూడు ఉప బీజాలున్నాయి. అవి మన స్థూల, సూక్ష్మ, కారణ దేహాలకు ప్రతీకలు. ఈ మూడింటి సాక్షిగా   మనసావాచాకర్మణా కొలిచినప్పుడు అమ్మ మనలోని అంతఃశత్రువులను జయించే శక్తినిస్తుంది. సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.


ఆయుధాల్లో ఆంతర్యం

రాక్షస సంహారం కోసం జగన్మాత ధరించిన ఆయుధాలన్నీ పారమార్థిక విశేషాలను చాటేవే. మహిషాసుర మర్దన సమయంలో శూలం, చక్రం, శంఖం, కత్తి, డాలు, కాలదండం, అగ్ని, ధనుర్బాణాలు ధరించి అమ్మ దర్శనమిస్తుంది. దేవీ భాగవతం ప్రకారం.. రాక్షస సంహారం చేయమంటూ దేవతలంతా అమ్మకు మొరపెట్టుకుని, మహాద్భుతమైన యజ్ఞం చేసి తమతమ ఆయుధాలను యజ్ఞకుండంలో సమర్పించడంతో జగదంబ శక్తిస్వరూపిణిగా ఆవిర్భవించింది. ఆ ఆయుధాల్లో శివుడి త్రిశూలం ఒకటి. భక్తి, జ్ఞాన, యోగమనే మూడు శక్తుల కలయిక అది. ఇక, కత్తి, డాలులను సముద్రుడు అమ్మకు సమర్పించాడు. వాయుదేవుడు అమ్మకు ధనుర్బాణాలను అందజేశాడు. మహిషుడు పశురూపుడు. పశువులు అగ్నిని చూస్తే వెనుకంజ వేస్తాయి కాబట్టి అమ్మ అగ్నిధారణ చేసింది. విష్ణుమూర్తి చక్రం, వరుణుడి పాశం, యుముడు సమర్పించిన కాలదండం కూడా అమ్మ చేతిలో అమరి  ఉన్నాయి. తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తించడానికి ఉపయోగించే పరికరాలన్నీ ఆయుధాలుగానే గుర్తించాలి. అమ్మవారి ఆజ్ఞతో వాటిని లోక కల్యాణానికీ, విశ్వ శ్రేయస్సుకూ, సామాజిక అభ్యుదయానికీ వినియోగించాలని అర్థంచేసుకోవాలి.


ఎరుపు ఎందుకంటే...

మహిషాసుర సంహారంలో జగన్మాత రౌద్రంగా, ఎర్రటి అలంకారాలతో కనిపిస్తుంది. ఎర్రటి వస్త్రాలు, పూలు, చందనం, ధరిస్తుంది. నవగ్రహాలలో ఒకటైన అంగారక గ్రహం అగ్నిశక్తికి ప్రతీక. ఆ గ్రహం ఎర్రటి వర్ణంలో కనిపిస్తుంది. ఎరుపు రంగు పశువులకు చికాకును కలిగిస్తుంది. అందుకే అమ్మ ఎర్రటి అలంకరణలతో వెళ్లి పశురూపుడైన మహిషాసురుణ్ణి సంహరించిందని చెబుతారు. యుద్ధం చేసేటప్పుడు బలమే కాదు ఓర్పూ, నేర్పూ కూడా అవసరమే. అసుర సంహారానికి బయల్దేరిన జగన్మాతను సర్వాలంకారభూషితగా వర్ణిస్తారు. మహిషాసురుణ్ణి సమ్మోహితుణ్ణి చేసి మట్టుబెట్టేందుకే అమ్మ ఈ యుద్ధతంత్రాన్ని అమలు చేసిందంటారు. అవన్నీ జగన్మాత బుద్ధి కుశలతకి తార్కాణాలు. బుద్ధినీ బలాన్నీ జోడించి మహత్కార్యాలు చేయొచ్చనడానికి మహిషాసుర సంహార ఘట్టం ఓ తార్కాణం.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.