close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోధుమ గడ్డితో రోగాలు దూరం!

కొన్ని పదార్థాలు నోటికి రుచించవు. కానీ వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఒనగూరే లాభాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో గోధుమ గడ్డి ఒకటి. ఇందులో ఉన్న అధిక పీచు కారణంగా మలబద్ధకం, బౌల్స్‌ సిండ్రోమ్‌, పైల్స్‌ వంటివన్నీ తగ్గుతాయి. జీర్ణశక్తి బాగుంటుంది. ఎ, సి, ఇ, కె, బి6 విటమిన్లతోపాటు ఖనిజాలూ ఫైటోకెమికల్సూ వంటివన్నీ సమృద్ధికరంగా ఉండటంతో అవన్నీ కలిసి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్‌ సంఖ్య తగ్గేలా చేస్తాయి.
* గోధుమగడ్డిలోని 17 అమైనో అమ్లాలూ రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి.
* క్యాలరీలు తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే వీట్‌ గ్రాస్‌ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుందని అనేక పరిశీలనలూ చెబుతున్నాయి. అంతేకాదు, వరసగా నెలరోజులపాటు ఈ జ్యూస్‌ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందట. ఇది మంటనీ బరువునీ కూడా తగ్గిస్తుందట.
* ఇందులోని క్లోరోఫిల్‌ ఎర్ర రక్తకణాల సంఖ్య పెరిగేలా చేయడం ద్వారా రక్తహీనతను తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమస్యలతో బాధపడేవాళ్లకీ ఇది మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి దీన్ని జ్యూస్‌ లేదా ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోమని
చెబుతున్నారు పోషకనిపుణులు.


మాస్కుతో ఇబ్బంది ఉన్నప్పటికీ...

కొవిడ్‌-19 రీత్యా ముఖానికి మాస్కు పెట్టుకోవడం తప్పని సరిగా మారింది. అదేసమయంలో దానివల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా పరిణమిస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి బదులుగా వదిలిన కార్బన్‌డైఆక్సైడ్‌నే ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. దాంతో ఊపిరి సరిగ్గా అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడూ నడిచే టప్పుడూ ఇది మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే- ఆక్సిజన్‌కి బదులు కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోవడం వల్ల ముఖానికి చెమట పట్టడంతోపాటు వేడిగానూ అనిపిస్తుంది. ఇవేవీ కూడా ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో గుండె, ఊపిరితిత్తుల పనితీరుమీద అంతగా ప్రభావం చూపడం లేదని వాళ్ల పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఊపిరితీసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ కొవిడ్‌ వల్ల జరిగే నష్టంతో పోలిస్తే అదేమంత కష్టం కాదు అంటున్నారు సదరు పరిశోధకులు.


పెళ్లికి ముందు..!

ప్రాంతాలూ పద్ధతులూ వేరయినా పెళ్లి అనేది ఏ జంటకైనా అందమైన వేడుకే. అయితే కాబోయే జంట, కొన్నాళ్లపాటు కలిసి తిరగడంతోపాటు పుట్టినరోజులూ పండగలూ... ఇలా రకరకాల వేడుకల్ని కలిసి చేసుకోవడం, సినిమాలకు వెళ్లడం వంటి వాటి వల్ల వాళ్ల మధ్య బంధం బలపడుతుందని చెప్పుకొస్తుంది ఇలినాయ్‌ యూనివర్సిటీ నిపుణుల బృందం. ఆయా వేడుకల వల్ల వాళ్లు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారని చెబుతున్నారు. పెళ్లికి ముందే కాదు, తరవాత కూడా ప్రతి చిన్న వేడుకనీ జరుపుకునే దంపతులు మరింత ఆనందంగా జీవిస్తున్నట్లు వాళ్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందే పండగలనీ పార్టీలనీ అప్పుడప్పుడూ ఇద్దరూ కాసేపు సరదాగా గడపడం వల్ల ఒకరి ఇష్టాలు మరొకరికి తెలియడంతోపాటు వాళ్ల మధ్య ఉన్న సంకోచం పోయి, చనువు ఏర్పడుతుంది. దాంతో భవిష్యత్తులో కలిసి ఉండగలమా లేదా అన్నదీ అర్థమైపోతుంది అంటున్నారు సదరు నిపుణులు. సో, పెళ్లికి ముందు డేటింగ్‌ మంచిదేనన్నమాట.


నిద్రపోతే గుండెనొప్పి రాదా?!

నిద్రతో చాలావరకూ సమస్యలు తగ్గిపోతాయనేది తెలిసిందే. అయితే రోజుకి ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచేవాళ్లలో హృద్రోగ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని బ్రిటన్‌ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం దాదాపు 5 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించినప్పుడు- వాళ్లలో నిద్రకు సంబంధించిన సమస్యలేవీ లేనివాళ్లలో హృదోగ్ర సమస్యలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదేసమయంలో నిద్రాలోపాలు ఉన్నవాళ్లలోనే గుండెకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది.  పగటివేళలో మగతగా అనిపించనివాళ్లలో 34 శాతం, నిద్రలేమితో బాధపడనివాళ్లలో 17 శాతం, రోజుకి ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయేవాళ్లలో 12 శాతం, త్వరగా నిద్రలేచేవాళ్లలో 8 శాతం హృద్రోగ సమస్యలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంమ్మీద హాయిగా నిద్రపోయే వాళ్లలో గుండె సమస్యలు 42 శాతం తక్కువగా ఉన్నాయట. కాబట్టి నిద్రే గుండెకి బలం అన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు