close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాత్రిపూట బీపీ ఎక్కువుంటుందా?!

తిమరుపు... వినడానికి ఏదో సాధారణ జబ్బులా ధ్వనిస్తుంది కానీ రోజువారీ జీవనంలో చాలా ప్రభావమే చూపిస్తుంది. డిమెన్షియాతో బాధపడే వాళ్లలో క్రమంగా ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. తద్వారా సామాజిక జీవనంలో మమేకం కాలేకపోతుంటారు. అయితే దీనికి బీపీ కూడా కారణం కావచ్చట. ముఖ్యంగా పగటివేళలో కన్నా రాత్రిపూట బీపీ ఎక్కువగా ఉండటం వల్ల మతి మరుపు వచ్చే అవకాశం ఎక్కువ అని స్వీడన్‌లోని ఉప్సల విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆరోగ్యవంతులకి రోజులో బీపీ రకరకాలుగా ఉన్నప్పటికీ రాత్రిపూట తక్కువగా ఉంటుంది. కొద్దిమందిలో మాత్రం దీనికి భిన్నంగా రాత్రివేళలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉందట. ఇది మెదడుమీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే నిద్రపోయినప్పుడే మెదడు వ్యర్థ పదార్థాలను తొలగించు కుంటుంది. అయితే ఆ సమయంలో బీపీ ఎక్కువగా ఉంటే దాని పనికి ఆటంకం ఏర్పడుతుంది. దాంతో మెదడు పనితీరు తగ్గి మతిమరుపుకి దారి తీస్తుందట. ఇందు కోసం వీళ్లు కొందరు వృద్ధుల్ని ఎంపికచేసి 24 ఏళ్ల పాటు రాత్రీపగళ్లూ గమనించారట. అందులో రాత్రివేళలో బీపీ ఉన్నవాళ్లలో మిగిలినవాళ్లకన్నా మతిమరుపు, ఆల్జీమర్స్‌ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.


ఎముకలు విరిగే అవకాశం ఉందా?

వృద్ధాప్యంలో చాలామంది బాత్రూముల్లో జారిపడిపోవడంతో ఎక్కువగా తుంటి ఎముక విరిగిపోతుంటుంది. కొందరు నడుస్తూ కూడా పడిపోవచ్చు. అలాంటివాళ్లకి శస్త్రచికిత్స చేయడం వల్ల దాన్నుంచి కొందరు త్వరగానే కోలుకున్నప్పటికీ కొంతమంది మాత్రం మంచాన పడి మరణానికి చేరువవుతారు. అందుకే గార్వాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌కు చెందిన పరిశోధకులు స్కెలెటల్‌ ఏజ్‌ అనే పరికరాన్ని రూపొందించారు. ఇది వ్యక్తి ఎముకల్ని పరిశీలించి వాటి పటుత్వాన్ని అంచనా వేయడమే కాదు, అవి ఏ వయసులో విరిగే ప్రమాదం ఉందనే విషయాన్నీ తెలియజేస్తుందట. ఎముకల సాంద్రతను పరీక్షించే విధానం ఇప్పటికే వాడుకలో ఉన్నా, ఈ కంప్యూటేషనల్‌ మోడల్‌, వాళ్ల ఎముక వయసుని కచ్చితంగా అంచనా వేయడం ద్వారా విరిగే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చెబుతుందట. తద్వారా వాళ్ల ఆయుష్షునీ అంచనా వేస్తుందట. ఉదాహరణకు వ్యక్తి వయసు డెబ్భై మాత్రమే కావొచ్చు. కానీ వాళ్ల ఎముకలు 87 ఏళ్ల వయసుకి చేరుకుని ఉండొచ్చు. అందుకే ముందుగానే ఎముకల వయసు తెలుసుకుంటే తీసుకోవాల్సిన ఆహారమూ మందులూ, చేయాల్సిన వ్యాయామాలను సూచించవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.


గర్భధారణకు జింక్‌

కొవిడ్‌ సమయంలో గర్భం దాల్చాలనుకునే దంపతులకి జింక్‌ ఎంతో మేలు చేస్తుందట. అండం, శుక్రకణాల్లోని మైటోకాండ్రియల్‌ భాగం దెబ్బతినకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుందని వానె స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ సోకడం వల్ల అండం, శుక్రకణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి పెరగడంతో అవి సరిగ్గా వృద్ధి చెందవు. ఫలితంగా గర్భం దాల్చడం సాధ్యం కాదు. అదే జింక్‌ను వాడటం వల్ల అది రోగనిరోధకశక్తిని పెంచడంతోపాటు వైరస్‌ తోనూ పోరాడుతుందట. అండ, శుక్ర కణాల్లో ఆక్సీకరణ ప్రక్రియనూ అడ్డుకోవడం ద్వారా గర్భధారణకూ తోడ్పడుతుందట. కాబట్టి కొవిడ్‌ సోకిన లేదా సోకే అవకాశం ఉన్న ఈ సమయంలో సంతానం కోసం ప్లాన్‌ చేసుకునేవాళ్లు జింక్‌ సప్లిమెంట్‌ను తీసుకుంటే మేలు అంటున్నారు. జింక్‌ సమృద్ధిగా ఉండే పాలకూర, అవకాడో, కాలీఫ్లవర్‌, బీన్స్‌, క్యాప్సికమ్‌, బ్రకోలీ, గుడ్లు, బఠాణీ, టొమాటోల్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదట.


చిన్ననాటి తిండితోనే ఆరోగ్యం!

పెద్దయ్యాక ఏం తింటున్నామనేదే కాదు, పిల్లలుగా ఉన్నప్పుడు ఏం తిన్నారనేదీ ఎంతో ముఖ్యమే అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. చిన్నప్పుడు పంచదార, కొవ్వుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తింటే, పెద్దయ్యాక ఎంత మంచి ఆహారం తీసుకున్నా పెద్ద ఉపయోగం ఉండదట. ఎందుకంటే చిన్నతనంలో తీసుకున్న కొవ్వులూ, చక్కెర పదార్థాల వల్ల పొట్టలోని మైక్రోబయోమ్‌(బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ల సమ్మేళనం)లో మారిపోయి, వైవిధ్యం తగ్గిపోతుంది. అలా మారినదే జీవితాంతం ఉండిపోతుంది. మైక్రోబయోమ్‌లో ఎంత వైవిధ్యం ఉంటే అంత రోగనిరోధకశక్తి ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంతోపాటు విటమిన్ల తయారీకి తోడ్పడుతుందట. ఈ విషయమై ఎలుకల్లో పరిశోధనలు చేయగా- చిన్నవయసులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా పెట్టిన ఎలుకల్లో బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గిపోయిందనీ, పెరిగి పెద్దయ్యాక వాటి ఆహారంలో మార్పులు చేసినా ఆ బ్యాక్టీరియాలో పెద్ద తేడా కనిపించలేదనీ తేలిందట. ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో ఆరేళ్లలోపు పిల్లలు కొవ్వు, చక్కెరలతో నిండిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారనీ దీనివల్లే వాళ్ల పొట్టలోని బ్యాక్టీరియాలో వైవిధ్యం తగ్గిపోతుందనీ చెబుతున్నారు. అదేసమయంలో ఆహారం తీసుకుని వ్యాయామం చేసిన పిల్లల మైక్రోబయోమ్‌లో పెద్దగా మార్పు లేదట. అదే ఆ వయసులో వ్యాయామం లేకుండా అదేపనిగా కొవ్వుపదార్థాల్ని తిన్నవాళ్లలో ఈ నష్టం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయడాన్ని చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి అంటున్నారు సదరు పరిశోధకులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు