close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టిష్యూలు బుట్ట బొమ్మల్లా..!

ఇంటికెవరైనా అతిథులు వచ్చినప్పుడు భోజనాలయ్యాకా, స్నాక్స్‌ తిన్నాకా చేతులు తుడుచుకునేందుకు టేబుల్‌ మీదా, టీపాయ్‌ పైనా టిష్యూలు పెడతాం. అయితే, వాటిని ఏదో మామూలుగా పెట్టేయకుండా బుట్టబొమ్మలా కనిపించేలా అమర్చితే చూడ్డానికి అందంగా ఉంటుంది కదా... అందుకోసం వచ్చినవే ఈ ‘డాల్‌ న్యాప్‌కిన్‌ హోల్డర్‌’లు. చెక్కతో చేసిన రకరకాల అమ్మాయిల బొమ్మల్లా వచ్చే వీటికి నడుము కింది భాగంలోఒక్కో టిష్యూ పేపర్‌నూ పెట్టేలా విడివిడిగా ఖాళీలుంటాయి. రంగు రంగుల్లో డిజైన్లున్న టిష్యూలను ఫొటోలో చూపినట్లుగా ఆ ఖాళీల్లో అమర్చితే ఇదిగో ఇలా బుట్టబొమ్మల్లా కనిపిస్తాయి.


తడి జుట్టు ఇట్టే ఆరిపోతుంది

తలస్నానం చేశాక జుట్టులోని నీటిని పీల్చేందుకు తలకి టవల్‌ చుట్టుకుంటాం. అయితే, జుట్టు త్వరగా ఆరాలంటే మాత్రం డ్రయర్‌ని వాడాల్సిందే. కానీ డ్రయర్‌ వల్ల జుట్టు పాడైపోతుందని తెలిసిందే. అలాకాకుండా... మనం తలకు చుట్టుకునే టవలే వేగంగా జుట్టుని ఆరబెట్టేస్తే బాగుంటుంది కదా... అందుకోసం వస్తున్నవే ‘మైక్రో ఫైబర్‌ హెయిర్‌ డ్రయింగ్‌ రాప్‌/టవల్‌’లు. ప్రత్యేక టెక్నాలజీతో తయారుచేసే ఈ బుల్లి టవళ్లను తలకు చుడితే, జుట్టుకున్న తడి మొత్తాన్నీ చాలా త్వరగా పీల్చేస్తుంది. ఈ టవల్‌ ముడి ఊడకుండా బటన్‌ కూడా పెట్టేయొచ్చు. కాబట్టి ఇది పిల్లలక్కూడా బాగుంటుంది. పర్యటనల్లో తీసుకెళ్లేందుకూ సౌకర్యంగా ఉంటుంది. ఇవి వేర్వేరు కంపెనీలవి దొరుకుతున్నాయి.


చెస్‌ బోర్డుని చుట్టేయొచ్చు!

చదరంగం ఆట మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. చాలామంది పెద్దలూ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా దాన్ని ఆడతారు. కాకపోతే సమస్య ఏంటంటే... పెద్దగా నలుచదరంగా ఉండే ఆ బోర్డుని ఎక్కడ పెట్టినా అడ్డంగానే కనిపిస్తుంది. దాన్లో ఉండే పావుల్ని కూడా విడిగా ఓ డబ్బాలో భద్రపరచాలి. ఈ ‘రూక్‌ టవర్‌’ చెస్‌బోర్డ్‌తో మాత్రం అలాంటి ఇబ్బందే ఉండదు. ఆట అయ్యాక ఈ చెక్క బోర్డుని గుండ్రంగా చుట్టి, ఫొటోలో చూపినట్లూ పెట్టేయొచ్చు. టవర్‌ లోపలుండే అరల్లో పావుల్ని దాచుకోవచ్చు.


ఈ లైటు ఉంటే తోడున్నట్లే!

ఉద్యోగరీత్యా పిల్లలు దూరప్రాంతాల్లో ఉండడంతో వృద్ధులైన పెద్దవాళ్లు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఈమధ్య బాగా పెరిగింది. కానీ ఆ వయసులో వాళ్లు ఎప్పుడు అనారోగ్యం బారినపడతారో తెలీదు. అనుకోకుండా కిందపడిపోతే పక్కవారిక్కూడా తెలియదు. ఈ ‘నొబి’ స్మార్ట్‌ ల్యాంప్‌ ఉంటే మాత్రం ఎవరైనా పడిపోతే వెంటనే దగ్గరివారికి ఫోన్‌ చేసేస్తుంది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్‌ ల్యాంపుని మామూలు లైట్లలానే గదుల్లో అమర్చుకోవచ్చు. దీనికుండే సెన్సర్లు మనిషి కదలికను అన్నివైపుల నుంచీ గుర్తిస్తాయి.
అసౌకర్యంగా నడుస్తున్నా, పడిపోయినా వెంటనే ‘మీకు ఏదైనా సమస్యా, పడిపోయారా’ అని అడుగుతుంది నొబి. ఆ వ్యక్తి నుంచి ‘నో’ అన్న సమాధానం రాకపోతే వెంటనే ఆప్‌ ద్వారా ముందే ఫీడ్‌ చేసిన ఫోన్‌ నంబర్‌కి డయల్‌ చేసి, కెమేరాలతో అక్కడి
పరిస్థితిని చూపిస్తుంది. ఆ ల్యాంప్‌కి ఉన్న స్పీకర్‌ సాయంతో ఫోన్‌లోని వ్యక్తి పడిపోయిన వారిని మాట్లాడించొచ్చు కూడా. ఒకవేళ నొబి లైటు ఫోన్‌ చేసినప్పుడు అవతలి వ్యక్తి లిఫ్ట్‌ చెయ్యకపోతే, అది వెంటనే అత్యవసర నంబర్లకు డయల్‌ చేసి డోర్‌కి ఉన్న స్మార్ట్‌ లాక్‌ని కూడా తెరుస్తుంది. అన్నట్లూ ఈ స్మార్ట్‌ ల్యాంప్‌- చీకట్లో వృద్ధులు ఏ బాత్‌రూమ్‌కో వెళ్లడానికి మంచంమీది నుంచి లేవగానే దానంతట అదే ఆన్‌ అవుతుంది. దీన్ని బిగించడమూ సులభమే. మామూలు లైటుని తీసి ఆ స్థానంలో పెట్టేయడమే.

 

 ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు