close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
టీనేజీలో నిద్ర

ప్రపంచవ్యాప్తంగా ఈమధ్య టీనేజీ పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం వాళ్లు నిద్రపోయే సమయం బాగా తగ్గిపోవడమే అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా నిపుణులు. శారీరక, మానసిక ఆరోగ్యానికీ రోగనిరోధకశక్తి పెరగడానికీ నిద్ర అందరికీ అవసరమే. కానీ టీనేజర్లకు మరీ అవసరం. శారీరక, మానసిక ఎదుగుదలకు వాళ్లకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే వాళ్లు సామాజికంగా ఎదురయ్యే ఒత్తిడినీ తోటి విద్యార్థుల కామెంట్లనీ కూడా తట్టుకోలేక ఆందోళనకీ మానసిక కుంగుబాటుకీ లోనవుతున్నట్లు పరిశీలనలో స్పష్టమైంది. అంతేకాదు, నిద్రలేమివల్ల మత్తుమందులకీ మద్యపానానికీ ధూమపానానికీ కూడా అలవాటుపడతారనీ చెడు సావాసాలతో హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశమూ లేకపోలేదనీ హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలేవయినా- ఎక్కువగా పద్నాలుగేళ్ల వయసులోనే మొదలవుతాయనీ చాలావరకూ వాటిని తగ్గించలేకపోతున్నామనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. స్నేహితులతో చాటింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌... వంటి వాటివల్ల నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. ఆయా గాడ్జెట్ల నుంచి వచ్చే నీలికాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ శాతాన్ని తగ్గించడంతో క్రమేణా నిద్రకు దూరమై మానసిక సమస్యల బారినపడుతున్నారనీ కాబట్టి ఆ వయసులో తల్లితండ్రుల కట్టడి చాలా అవసరమనీ హెచ్చరిస్తున్నారు.


కొవిడ్‌ కాలంలో గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే అందులోని ఈజీసీజీ అనే పదార్థం సార్స్‌ వైరస్‌ ప్రభావాన్ని అడ్డుకోవడంతోపాటు ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్‌నీ తగ్గించగలదట. అంతేకాదు, ఇతర సార్స్‌కోవ్‌ వైరస్‌ రకాల్నీ కొంతవరకూ ఇది నిర్మూలించగలదని గుర్తించారు క్యోటో ప్రీఫెక్చురల్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ముఖ్యంగా గ్రీన్‌ టీలో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు కొవిడ్‌-19 లక్షణాల తీవ్రతనీ తగ్గిస్తాయట. ఈ విషయమై వాళ్లు గ్రీన్‌టీలోని కెటెచిన్స్‌ అన్నింటినీ వైరస్‌లమీద ఒక్కొక్కటిగా ప్రయోగిస్తూ పరిశీలిస్తూ వచ్చారు. అందులో ఈజీసీజీ అన్నింటికన్నా ఎక్కువగా వైరస్‌ను అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సార్స్‌ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ను తగ్గించినట్లు గుర్తించారు. కాబట్టి ఈ కొవిడ్‌ కాలంలో గ్రీన్‌ టీ తాగడం వల్ల అంతో ఇంతో మంచే జరుగుతుందని చెబుతున్నారు సదరు పరిశోధకులు.


అవి తింటే... చక్కెర వ్యాధిని ఆహ్వానించినట్లే!

ప్రాసెస్డ్‌ ఆహారపదార్థాలు తింటే బరువు పెరగడమే కాదు, అవి పొట్టలోని ఈ-కొలి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లకీ కారణమవుతాయి. పైగా అవి దీర్ఘకాలంపాటు ఉండటం వల్ల మధుమేహానికీ దారితీస్తాయి అంటున్నారు జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. సాధారణంగా మన పొట్టలో ఉన్న ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీద తీసుకునే ఆహారం ప్రభావం చాలానే ఉంటుంది. అదెలా అంటే- సంక్లిష్ట పిండిపదార్థాలూ పీచుతో కూడిన ఆహారపదార్థాలు తిన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా పీచులేని రెడీమేడ్‌ ప్యాకేజ్డ్‌ ఫుడ్సూ, కొవ్వు ఎక్కువగా ఉండే స్నాక్సూ స్వీట్లూ తీసుకున్నప్పుడు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శాతం తగ్గి, ఆహారపదార్థాల ద్వారా వచ్చే హానికర బ్యాక్టీరియా శాతం పెరిగి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. ఫలితంగానే జీవక్రియా లోపాలు తలెత్తడంతో ఇన్సులిన్‌ నిరోధం ఏర్పడి, మధుమేహానికి గురవుతున్నారని వివరిస్తున్నారు. కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


నడుం చుట్టుకొలత పెరిగితే...

రకంగానూ బరువు పెరగడం మంచిది కాదు. అయితే దానికన్నా కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం మరీ ప్రమాదకరం అంటున్నారు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ నిపుణులు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ ప్రకారం బరువు సరిపడా ఉన్నప్పటికీ నడుం దగ్గర లావుగా ఉంటే అది హృద్రోగాలకు దారితీస్తుందట. ఊబకాయానికీ గుండెజబ్బులకీ సంబంధం ఉందనేది ఇప్పటికే అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. అయితే ఆ కేసుల్లో  పొట్ట చుట్టూ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నవాళ్లలోనే గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట. అదే బీఎమ్‌ఐ స్కేలు ప్రకారం బరువు ఎక్కువ ఉన్నప్పటికీ నడుం చుట్టుకొలత సరిపడా ఉన్నవాళ్లలో హృద్రోగాలూ తక్కువగా ఉన్నాయట. అందుకే ఈ రకమైన ఊబకాయాన్ని ‘మెటబాలికల్లీ హెల్దీ ఒబేసిటీ’ అని పిలుస్తున్నారు. కాబట్టి పొట్ట భాగంలో కొవ్వు పేరుకుంటే వారానికి కనీసం 150 నిమిషాలపాటు శారీరక వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ సాఫీగా ఉంటుందనీ తద్వారా గుండె పనితీరు మెరుగవుతుందనీ వివరిస్తున్నారు.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు