ఇంటి పచ్చళ్లు.. రచ్చ గెలుస్తున్నాయి! - Sunday Magazine
close

ఇంటి పచ్చళ్లు.. రచ్చ గెలుస్తున్నాయి!

ఏ జలుబో చేసి ఒంట్లో నలతగా ఉంటే అన్నం తినబుద్ధి కాక విసిగిస్తారు పిల్లలు. అప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఇంత అల్లప్పచ్చడో చింతకాయ పచ్చడో కలిపి పెడితే... మారు మాటలేకుండా ముద్ద వెనక ముద్ద గుటుక్కున మింగేసి హుషారుగా ఆడుకుంటారు. అంతెందుకు... దక్షిణాది, ఉత్తరాది, కాంటినెంటల్‌ రుచులతో యాభైరకాల వంటలు వడ్డించినా కాస్త గోంగూరో దోసావకాయో నాలుకకు తగిలితేనే పెళ్లివిందుకి పరిపూర్ణత. అదీ మన పచ్చడి మహిమ. ఆ రుచి ఇప్పుడు విదేశాలవారికీ నోరూరిస్తోంది. అందుకే భారతీయ పచ్చళ్ల ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయనీ పదేళ్లలో ఏకంగా 733 శాతం పెరిగాయనీ లెక్కలు చెబుతున్నారు నిపుణులు.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం... ఏ నగరానికి వెళ్లినా పిండివంటలమ్మే స్వగృహ దుకాణాల్లో ఒక బోర్డు కన్పిస్తుంది... ‘ఇక్కడ విదేశాలకు పచ్చళ్లు ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయబడును’ అని. కొన్నయితే అచ్చంగా పచ్చళ్ల దుకాణాలే ఉంటాయి. ఆర్డర్లు తీసుకుని ఇంటి దగ్గర పచ్చడి పట్టి తీసుకొచ్చి ఇచ్చే గృహిణులు ఒక పక్కా, వాటిని కొనుక్కుని విదేశాలకు పార్శిల్‌ పంపడానికి ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయించుకునే వినియోగదారులు ఒక పక్కా... కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటాయి ఆ దుకాణాలు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ... ఇవాళా రేపూ చదువుకోడానికీ ఉద్యోగాలు చేయడానికీ మనవాళ్లు వెళ్లని దేశం లేదు. మరి అలా వెళ్తున్న వాళ్లందరికీ సొంత ఊరి రుచులు అందించేది ఈ పార్శిళ్లే. పచ్చళ్లలో నూనె కారిపోకుండా, నెలల తరబడి నిలవుండాలంటే వాటిని ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేయాల్సిందే.

అయితే ఇలా పార్శిళ్లలో వెళ్లే పచ్చళ్లు ఎగుమతుల లెక్కలోకి చేరట్లేదు. నేరుగా పచ్చళ్ల తయారీ కంపెనీల నుంచి ఓడరేవుల ద్వారా అవుతున్న వాటిని లెక్క వేస్తేనే 2009-2019 మధ్య దేశం నుంచి పచ్చళ్ల ఎగుమతులు 733 శాతం పెరిగాయనీ, 2009లో 116 కోట్ల విలువ మాత్రమే ఉన్న ఎగుమతులు ఏటా పెరుగుతూ వచ్చి 2019 నాటికి 811 కోట్లయ్యాయనీ వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. వాటికి పార్శిళ్ల ద్వారా వెళ్తున్నవి కూడా కలిపితే ఇంకెన్ని కోట్లయ్యేవో. గత రెండేళ్లుగా కరోనా వల్ల రాకపోకలు అంతగా లేకపోయినా పచ్చళ్ల రవాణా మాత్రం ఆగలేదు. పైగా మరింత ఎక్కువే అయిందనడానికి నిదర్శనం- 2020లో ఎగుమతులు వెయ్యి కోట్లు దాటడం. ప్రపంచవాప్తంగా జరుగుతున్న పచ్చళ్ల ఎగుమతుల్లో 20 శాతం మనదేశం నుంచేనని లెక్కలు చెబుతున్నాయి.

అమెరికా లాంటి దేశాల్లో ఉన్న భారతీయులే ఇవన్నీ కొనుక్కుంటున్నారనుకోవడం సహజం. కానీ వాణిజ్య విశ్లేషకులు చెప్పేదాన్ని బట్టి చూస్తే అది నిజం కాదు.

ఎవరు కొంటున్నారు మరి?

గత ఏడాది 30 శాతం ఎగుమతులు శ్రీలంకకు వెళ్లాయట. ఆ తర్వాత స్థానాల్లో వరసగా ఒమన్‌, కువైట్‌, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నాం తదితర దేశాలున్నాయి. దాదాపు 50కి పైగా దేశాలు మన పచ్చళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. గుజరాత్‌, గోవా, తమిళనాడు రేవుల నుంచి వీటి ఎగుమతి ఎక్కువగా జరుగుతోంది. అయితే మన పచ్చళ్లకి ఈ డిమాండు ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు, క్రీస్తు పూర్వం నుంచే ఉండేదంటోంది చరిత్ర. 

విదేశాల్లో పచ్చళ్లు చేసుకోరా?

పచ్చళ్లు పట్టుకోవడం అన్ని దేశాల సంస్కృతిలోనూ భాగమే. కాకపోతే వారి వారి ఆహారపుటలవాట్లను బట్టి పట్టే విధానమే మారుతుంది. మనం నిల్వ పచ్చళ్లను ఊరగాయలంటాం. ఇంగ్లిషులో ‘పికిల్‌’ అంటారు కానీ నిజానికి వాళ్ల పికిల్‌ వేరు, మన ఊరగాయ వేరు.కూరగాయ ముక్కల్ని వినెగర్‌లో ముంచి నిల్వ చేసుకోవడం వారికి అలవాటు. పుల్ల పుల్లగా ఉండేదాన్నే వాళ్లు పికిల్‌ అంటారు. జర్మనీ వాళ్లు క్యాబేజీతో ‘సార్‌క్రాట్‌’ చేసుకుంటే, దక్షిణ కొరియా వాళ్లు దానికి ముల్లంగి లాంటి మరికొన్ని కలిపి ‘కిమ్‌చి’ చేసుకుంటారు. మొరాకో వాళ్లకి నిమ్మకాయ పచ్చడంటే మహా ఇష్టం. మన ఊరగాయ అలా కాదు... అన్ని రకాల కూరగాయలతోనూ చేస్తాం. తగినంత ఉప్పూ కారం చింతపండూ, ఆవపిండీ కలిపి పసుపూ వెల్లుల్లి రెబ్బలూ చేర్చి నిండా మునిగేలా నూనె పోస్తే... చవులూరే ఎర్రెర్రని ఊరగాయ సిద్ధమవుతుంది.

న్యూయార్క్‌లోని ఫుడ్‌ మ్యూజియం వారి పరిశోధన ప్రకారం- క్రీస్తు పూర్వం 2400లోనే మెసపొటేమియన్లు మన దేశం నుంచి కీరదోసకాయల్ని దిగుమతి చేసుకుని వాటిని ముక్కలు చేసి వినెగర్‌లో నానబెట్టి ఊరగాయగా వాడుకునేవారట. ‘పికిల్స్‌: ఎ గ్లోబల్‌ హిస్టరీ’ అనే పుస్తకంలో జాన్‌ డేవిసన్‌ తొమ్మిది వేల సంవత్సరాల కిందటి చైనా సాహిత్యంలో పచ్చళ్ల ప్రస్తావన కన్పిస్తుందని రాశాడు. కర్ణాటకకు చెందిన ఆహార శాస్త్రవేత్త కె.టి. అచ్చయ్య రాసిన ‘ఇండియన్‌ ఫుడ్‌: ఎ హిస్టారికల్‌ కంపానియన్‌’ అనే పుస్తకం ప్రకారం పదహారో శతాబ్దం నాటి కన్నడ రచన ‘లింగపురాణ’లో 50 రకాల పచ్చళ్ల గురించి ఉందట. చెన్నైకి చెందిన లాయర్‌ ఉషా ప్రభాకరన్‌ దాదాపు వెయ్యి రకాల పచ్చళ్ల తయారీ గురించి ‘ఉషాస్‌ పికిల్‌ డైజెస్ట్‌’ పేరుతో పెద్ద సంకలనమే రూపొందించారు.

అసలు వీటిని ఎవరు కనిపెట్టారో?

కూరగాయలు దొరకని కాలం కోసం వాటిని నిల్వ చేసుకోవటానికి కనిపెట్టిన విధానమే ‘ఊరగాయ’ అయింది. ఏదో ఒక పదార్థంలో ఊరబెట్టిన కాయ ‘ఊరగాయ’. దీన్నే వాడుక భాషలో ‘పచ్చడి’ అంటున్నాం. ఇలా ఊరబెట్టడం వల్ల అది ఎన్నాళ్లైనా నిల్వ ఉంటుంది. రుచి తగ్గదు. ఇప్పటిలా ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు లేని ఆరోజుల్లో దూర ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లినా పాడవకుండా ఉండేది. తెలుగువారికి ఊరగాయలతో అనుబంధం ప్రబంధాల కాలం నుంచీ ఉందంటారు సాహిత్యకారులు. ‘బుడమకాయ, యల్లము, మిరియంపుకాయ, కలివికాయ, కంబాలు, కరివేపకాయ లాదియైన యూరగాయలు కలవతని ఇంట...’ అని వర్ణించాడో కవి. ఇంట్లో అన్నిరకాల ఊరగాయలు ఉండడం ఆరోజుల్లో స్టేటస్‌ సింబల్‌గా ఉండేది కాబోలు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యదలోనూ ఆవకాయ ప్రస్తావన ఉందట. ‘ఆపదల నాదుకొను కూర ఆవకాయ...’ అన్న పేరు దానికి వచ్చింది కానీ నిజానికి కూరలతో పోలిస్తే పచ్చడికి అన్యాయం చేసినట్లే. పచ్చడి స్థానాన్ని దేనితోనూ భర్తీ చేయడం సాధ్యం కాదు. తీపో, పులుపో, కారమో... ఒక్క రుచి అయితే దానికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కానీ ఉప్పగా, పుల్లగా, కారంగా... అన్నీ కలిసి నోటికి వర్రగా తగిలే పచ్చడికి ప్రత్యామ్నాయం ఏముంటుంది. అందుకే దానికి అంత డిమాండు మరి! పచ్చడి కేవలం ఆహార పదార్థం కాదు... అది మన సంస్కృతిలో భాగం. మనిషి జీవితంలో ఎన్నో విషయాలు దాంతో పెనవేసుకుని ఉంటాయి.

ఎలాంటి విషయాలు..?

ఉదాహరణకి పెద్దలను కలవడానికి వెళ్లేటప్పుడు పూలగుత్తో పండ్లబుట్టో తీసుకెళ్లడం ఆనవాయితీ. అదే వాళ్ల ఊరి ప్రత్యేకత అయిన పచ్చడిని ఓ సీసా నిండా పట్టుకెళ్లి ఇచ్చారనుకోండి... అది ఆత్మీయత. మరో మాట లేకుండా అవతలి వాళ్లని ప్రేమతో కట్టిపడేస్తుంది. ఇప్పుడంటే బ్రాండెడ్‌ పచ్చళ్లు ఎక్కడంటే అక్కడ సూపర్‌మార్కెట్లలో దొరుకుతున్నాయి కానీ ఒకప్పుడు అలా కాదు. పచ్చడి తయారీ అంటే అదో పెద్ద ప్రహసనమే. అందుకే పచ్చడిని అపురూపంగా చూసుకునేవారు. తెలుగు నాట ఆయితే పండుగల సీజన్‌ లాగే పచ్చళ్లకూ సీజన్‌ ఉంటుంది. ఆవకాయ పట్టే సమయం ఒకటైతే, పండుమిరపకాయ పచ్చడి పట్టే సీజన్‌ మరొకటి. కార్తీకం వచ్చిందంటే ఉసిరి పచ్చడికి వేళైనట్లు. ఏ పచ్చడైనా ఒక్క రోజులోనో ఒక్క చేత్తోనో అయ్యే పని కాదు. మంచి మిరపకాయలు ఎంచుకుని కారం పట్టించడం, గానుగ నుంచి నూనె తెచ్చుకోవడం... లాంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. నాణ్యమైన పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. అందుకే ఇరుగూ పొరుగూ కలిసి తలా ఒక చెయ్యీ వేసి పచ్చళ్లు పట్టుకునేవారు. ఒక తరం నుంచి మరో తరం ఆ నైపుణ్యాలను వారసత్వంగా అందిపుచ్చుకునేవారు. ఎదురింటి బామ్మగారు అలా కుర్చీలో కూర్చుని పాళ్లు చెబితే చాలు. ఒకరు మామిడికాయ ముక్కల్ని చకచకా కొట్టేస్తారు. మరొకరు వాటిని శుభ్రం చేస్తారు. ఇంకొకరు ఉప్పూ కారాలు కొలిచి పోస్తారు. మరో పెద్దావిడ వచ్చి పదార్థాలన్నీ ముక్కలకు పట్టేలా కలియబెట్టి జాడీల్లోకి నింపుతారు. మాగాయ, నీళ్లావకాయ, తీపి ఆవకాయ, మెంతావకాయ, పెసరావకాయ, సెనగావకాయ అంటూ ఒక్క ఆవకాయలోనే పాతిక రకాలకు తక్కువ కాకుండా పెట్టే ఘనత మనది. కాబట్టి అలా వారానికొకరి ఇంట్లో పచ్చడి పని పూర్తి చేసుకుంటూ ఆవకాయ ఘుమఘుమల్లాగే అనుబంధాలనూ విస్తరింపజేసుకునేవారు. పచ్చడితో పాటు ప్రేమనూ జాడీలలో నింపి దూరంగా నగరాల్లో ఉన్న బంధువులకు పంపేవారు.అలాంటిది కాలంతో పాటే పచ్చళ్ల తయారీ పద్ధతులూ మారుతూ వచ్చాయి.

ఇప్పుడు ఫ్యాక్టరీలే ఉన్నాయిగా?

అవును, అన్నిరంగాల్లో మార్పులు వచ్చినట్లే ఆహార రంగంలోనూ వచ్చాయి. పచ్చడి పట్టే ఓపికా తీరికా లేనివారు కొనుక్కోవడంవైపు మొగ్గు చూపుతుండడంతో పచ్చళ్ల తయారీ ఇప్పుడు వ్యాపారం స్థాయికి ఎదిగింది. ఎవరి ఇళ్లలో వారు చేసుకోవడం నుంచి కొందరు కలిసి చేసుకునే కుటీర పరిశ్రమగా, స్వయం సహాయ బృందాలకి జీవనోపాధిగా మారింది. ఒక్కో ప్రాంతం అక్కడ అందుబాటులో ఉండే వనరులను బట్టి ఒక్కో రకం పచ్చళ్లకు పేరు తెచ్చుకున్నాయి. ఆంధ్రాలో కృష్ణా గుంటూరు జిల్లాలు ఆవకాయ, గోంగూర, పండుమిరపకాయ లాంటి శాకాహార పచ్చళ్లకు పేరొందితే గోదావరి జిల్లాలు మాంసాహార పచ్చళ్లకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాలనుంచి క్వింటాళ్ల కొద్దీ పచ్చళ్లు తయారై వివిధ దేశాలకు రవాణా అవుతున్నాయి. పలు ఇతర వినిమయ వస్తువుల్లాగే పచ్చళ్లకీ ఇప్పుడు బ్రాండ్‌ గుర్తింపు ఉంది. ఎవరి అభిరుచికి తగిన బ్రాండ్‌ను వారు ఎంచుకునేందుకు వీలుగా ఎన్నో రకాల పచ్చళ్లు లభిస్తున్నాయి. దాంతో పోటీ పెరిగి కొత్త కొత్త పచ్చళ్లు కూడా తయారవుతున్నాయి. దక్షిణాదినా, ఉత్తరాదినా రకరకాల కూరగాయలతో పచ్చళ్లు పడితే; గోవా, కేరళ లాంటి తీర ప్రాంతాలవారు చేపలూ రొయ్యలూ పీతలూ... అన్నిటితోనూ పచ్చళ్లు పట్టి ఎగుమతి చేస్తున్నారు. 

కరోనా ప్రభావం దీనిమీద పడలేదా?

కొవిడ్‌ నేపథ్యంలో అమలు చేసిన లాక్‌డౌన్ల వల్ల చాలా వ్యాపారాలు దెబ్బతిన్నా పచ్చళ్ల రంగం మాత్రం కొత్త పుంతలు తొక్కింది. గత రెండేళ్లలోనే కొత్త తయారీదారులు ఎందరో ఈ మార్కెట్లో ప్రవేశించారు.

ఇల్లు కదలకుండా ఉండాల్సిరావడం కొందరికి పాత నైపుణ్యాలను గుర్తుచేసింది. దిల్లీకి చెందిన అశ్విందర్‌ కౌర్‌కి డెబ్బయ్యేళ్లు. పిల్లల ఇళ్లకు తిరుగుతూ మనవలతో కాలక్షేపం చేసేది. లాక్‌డౌన్‌లో ఇల్లు కదలకూడదనేసరికి ఏం చేయాలో తోచేది కాదు ఆవిడకి. దాంతో ఇంట్లోనే ఊరగాయ పెడతానంటే కొడుకు అన్నీ కొనుక్కొచ్చాడు. అంతటితో ఊరుకోకుండా తల్లి పచ్చడి పడుతున్న విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. అది చూసిన బంధువులూ స్నేహితులూ మాకూ కావాలని అడగడంతో రెణ్ణెల్లపాటు అశ్విందర్‌ తీరిక లేకుండా పచ్చళ్లు పడుతూనే ఉంది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేసినా అశ్విందర్‌ పని ఆపలేదు. అందరూ మెచ్చుకుంటూ డబ్బిచ్చి మరీ కొనుక్కెళ్తోంటే మరింత ఉత్సాహంగా పచ్చళ్లు పెట్టేస్తోంది.

సుమన్‌సూద్‌ ఒకప్పుడు ఇంటి అవసరాల కోసం పచ్చళ్లు పట్టుకునేది. ఆమె పెట్టిన పచ్చళ్ల రుచి గురించి బంధువులు చెప్పుకోవడంతో మెల్లగా ఒక్కొక్కరూ వచ్చి చేసిపెట్టమని అడగడంతో మొదలైంది ఆమె వ్యాపారం. చాలాకాలం ఒక పేరనేది లేకుండా పచ్చళ్లు అమ్ముతూ వచ్చిన సుమన్‌ కూతుళ్ల సూచనతో ‘పికిల్స్‌ అండ్‌ మోర్‌’ పేరుతో పచ్చళ్లను సామాజిక మాధ్యమాల ద్వారా మార్కెట్‌ చేయడం మొదలెట్టింది. ఆ పచ్చళ్ల గురించి తెలుసుకున్న జర్మన్‌ వ్యాపారవేత్త ఒకరు సుమన్‌ని వెతుక్కుంటూ దిల్లీ వచ్చాడు. తనకి హోటల్‌ వ్యాపారం ఉందనీ త్వరలోనే భారతీయ హోటల్‌ కూడా ప్రారంభిస్తాననీ అది మొదలయ్యాక సుమన్‌ దగ్గర పచ్చళ్లు కొంటాననీ చెప్పి కొన్ని శాంపిల్స్‌ తీసుకెళ్లాడు. అది జరిగి మూడేళ్లయింది. సుమన్‌ ఆ విషయమే మర్చిపోయింది. ఏడాదిన్నర క్రితం ఓరోజు అతడు నిజంగానే తిరిగి వచ్చి ఆర్డర్‌ ఇస్తే ఆశ్చర్యపోవడం సుమన్‌ వంతయింది. ఇప్పుడు సుమన్‌ చేస్తున్న పచ్చళ్లు జర్మనీలోనే కాదు, పలు దేశాల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాయి. ఇలాంటి వాళ్లే కాదు, ఉపాధికి మరో మార్గం లేక పచ్చళ్ల తయారీని ఎంచుకున్నవారూ ఎందరో ఉన్నారు. కేరళకు చెందిన దీజా సతీశన్‌ పోలియో వల్ల చక్రాల కుర్చీలోనే జీవితం గడుపుతోంది. షెఫ్‌గా పనిచేస్తున్న తండ్రి హఠాన్మరణంతో కుటుంబం సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయింది. తండ్రి దగ్గర వంట చేయడం నేర్చుకున్న దీజా పచ్చళ్లు పట్టడంలో ప్రావీణ్యం సాధించింది. ఇప్పుడు ఆమె సారథ్యంలో పలురకాల పచ్చళ్లు పట్టి విదేశాలకు ఎగుమతి చేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది ఆ కుటుంబం. 

అలా అన్నంలోకే కాదు... ఆర్థికంగానూ ఎందరికో ఆదరువు అవుతున్నాయి మన పచ్చళ్లు. మనకంటే అలవాటు కాబట్టి పచ్చళ్లను ఇష్టంగా తింటాం. కానీ శ్రీలంక నుంచి సూడాన్‌ దాకా, అమెరికా నుంచి ఆఫ్రికా దాకా విదేశీయులకు ఇవి ఎందుకు నచ్చుతున్నాయీ అంటే- ఆ రుచుల్లోని వైవిధ్యమే అందుకు కారణమట. తీపీ పులుపూ ఇష్టపడేవారిని ఉత్తరాది రాష్ట్రాల పచ్చళ్లూ, కాస్త కారంగా ఘాటుగా తినడం ఇష్టపడేవారిని దక్షిణాది రాష్ట్రాల పచ్చళ్లూ, ఇక మాంసాహారం తినేవారిని నాన్‌వెజ్‌ పచ్చళ్లూ... తమ తమ అభిమానుల ఖాతాలో వేసుకుని అలరిస్తున్నాయన్నమాట... అందుకే హోల్‌సేల్‌గా భారతీయ పచ్చళ్లకు డిమాండు పెరిగిపోతోంది మరి!


ఆపిల్‌ పండూ వెదురుకాండమూ... అన్నీ పచ్చళ్లే!

భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో పచ్చళ్ల విషయంలోనూ ఆ వైవిధ్యం కనిపిస్తుంది. తెలుగు పచ్చళ్ల గురించి మనకు తెలుసు కానీ, ఉత్తరాది పచ్చళ్ల రుచి భిన్నంగా ఉంటుంది. అవి మన పచ్చళ్లలా ఘాటుగా ఉండవు. చాలావరకూ తియ్యగా పుల్లగా ఉంటాయి. హరియాణాలో ‘పానిపట్‌’ అనే ఊరు ఉంది. చరిత్రలో పెద్ద పెద్ద యుద్ధాలకు పేరొందిన ఆ ప్రాంతం ఇప్పుడు మాత్రం పచ్చళ్లకు పేరొందింది. అక్కడ పాతిక దాకా పచ్చళ్ల తయారీ కేంద్రాలూ వందకు పైగా దుకాణాలూ ఉంటాయి. ఏ సీజన్‌లో పండిన కూరగాయల్ని ఆ సీజన్లోనే పచ్చళ్లుగా పట్టేసి పానిపట్‌ నుంచి పలు దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు.

ఇక, కశ్మీర్‌ని తలచుకోగానే గుర్తొచ్చేది ప్రకృతి అందాలూ తీయని ఆపిల్‌ పళ్లే కానీ అక్కడికి వెళ్లామంటే ఆ ఆపిల్‌ పళ్ల పచ్చడినీ రుచి చూడొచ్చు. ‘పికిల్‌ కింగ్‌ ఆఫ్‌ కశ్మీర్‌’ అంటారు హాజీ గులామ్‌ ఖాదిర్‌ సేనూని. అక్కడి కల్లోల పరిస్థితులు కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకున్నా, బతుకు తెరువైన ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌ పూర్తిగా మూతబడినా తమని ప్రాణాలతో ఉంచుతున్న ఏకైక ఆధారం వారసత్వంగా వచ్చిన పచ్చళ్ల తయారీయే అంటాడు సేనూ. వారి కుటుంబం శాకాహార, మాంసాహార పచ్చళ్లే కాదు, ఆపిల్‌, ఆప్రికాట్‌, చెర్రీ లాంటి పండ్లతోనూ మొత్తం వందరకాల పచ్చళ్లు పడుతుంది. ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు వచ్చి వాటిని కొనుక్కెళతారు.

ఇటు పక్క ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లామంటే వెదురు పచ్చడి ఘుమఘుమలు నోరూరిస్తాయి. లేత వెదురు కాండాన్ని పనసపొట్టు తరిగినట్లు సన్నగా తరిగి, ఉడికించి, ఎండబెట్టి, మసాలాలన్నీ చేర్చి చేసే పచ్చడి కిలో నాలుగువేలకి పైనే పలుకుతుంది. ఎగుమతుల్లో దానికీ చెప్పుకోదగ్గ వాటానే ఉంది.


పచ్చళ్లకీ ఓ పండుగ!

చ్చళ్ల తయారీ గురించి ఎంత గొప్ప చరిత్రా సంస్కృతీ మనకి ఉన్నా దానికో పండుగ లేదు. అలా పచ్చళ్ల పండుగ చేసుకోవడం మొదలుపెట్టిన ఘనత న్యూయార్క్‌ నగరానికే దక్కుతుంది. గత ఇరవయ్యేళ్లుగా అక్కడ ఏటా నవంబరు 14న ‘పికిల్‌ డే’ ఉత్సవాలు జరుపుతున్నారు. కూరగాయల ఆకారంలో ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్ని ధరించి వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పచ్చళ్ల తయారీలో పోటీలూ పెడుతున్నారు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న