మెరుపు ఇలా.. వ్యాయామంతో ఆందోళన మాయం! - Sunday Magazine
close

మెరుపు ఇలా.. వ్యాయామంతో ఆందోళన మాయం!


మేలైన మెరుపు!

మేకప్‌ల్లో భాగంగా- ముఖ్యంగా ఐ షాడోల కోసం గ్లిట్టర్‌ను వాడతారనేది తెలిసిందే. అయితే పర్యావరణపరంగా ఆలోచించి మొక్కలనుంచి తీసిన సెల్యులోజ్‌తో ఈ మెరుపుల్ని తయారుచేసినప్పటికీ అది మెరవడం కోసం సూక్ష్మమైన అల్యూమినియం, ప్లాస్టిక్‌ రేణువుల్ని ఊతంగా వాడుతుంటారు. కానీ ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ సైతం పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయట. ఇవి కరగడానికి శతాబ్దాలు పడుతుందనీ, అవి సముద్రంలో పేరుకుని సమస్త ప్రాణికోటికీ ముప్పు కలిగిస్తున్నాయనీ అంటున్నారు. అందుకే కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు- పూర్తిగా భూమిలో కలిసిపోయే గ్లిట్టర్‌ను రూపొందించారు. ఇది మెరవడానికి ఎలాంటి ప్లాస్టిక్కూ అవసరం లేదట. మొక్కలూ, పండ్లూ కూరగాయల్లోని రేణువుల్ని సేకరించి దీన్ని తయారుచేశారట. ఇది నెమలి, సీతాకోకచిలుకల రెక్కలమీద కనిపించే మెరుపుని పోలి ఉంటుందనీ, దీనివల్ల ఎలాంటి హానీ ఉండదు కాబట్టి ఆహారంలోనూ పానీయాల్లోనూ కూడా నిశ్చింతగా వాడుకోవచ్చనీ అంటున్నారు.


ఉప్పు వాడకం పెరిగితే...

హారంలో ఉప్పు వాడకం ఎక్కువైతే రక్త ప్రసరణలో మార్పులు చోటుచేసుకుంటాయనేది తెలిసిందే. అయితే ఉప్పు వాడకానికీ మెదడులోని న్యూరాన్ల స్పందనకీ కూడా సంబంధం ఉందని జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఫంక్షనల్‌ మాగ్నటిక్‌ రిసోర్స్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ ద్వారా పరిశీలించినప్పుడు- రక్తప్రసరణలో వేగం పెరిగినప్పుడు న్యూరాన్లు సైతం చురుగ్గా మారుతున్నాయట. దీన్నే న్యూరోవాస్క్యులర్‌ కప్లింగ్‌ లేదా ఫంక్షనల్‌ హైపరీమియా అని పిలుస్తున్నారు. అయితే ఇంతవరకూ మెదడు వెలుపలి భాగంలో మాత్రమే ఇలా జరుగుతున్నట్లు గమనించారు. కానీ తినడం, తాగడం, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం, ప్రత్యుత్పత్తి... వంటి అనేక పనులను నిర్వహించే హైపోథెలామస్‌లో జరిగే మార్పుల్ని నిశితంగా గమనించినప్పుడు- అందులో ఉప్పు ఎక్కువగా తిన్నవాళ్లలో మెదడు నరాల్లో స్పందన ఎక్కువగా ఉన్నట్లు తేలిందట. దీన్నిబట్టి హైపర్‌ టెన్షన్‌కి కారణం ఉప్పు వాడకమేననీ అంటున్నారు. కాబట్టి ఏ రకంగానూ ఉప్పుతో కూడిన పదార్థాలను అధికంగా తీసుకోవడం మంచిది కాదనేది పరిశీలకుల విశ్లేషణ.


ఊబకాయం వస్తుందా?

మెదడులో వచ్చే మార్పుల ఆధారంగా భవిష్యత్తులో ఊబకాయం వచ్చే అవకాశాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు అంటున్నారు టర్కీ యూనివర్సిటీ నిపుణులు. ఇందుకోసం వంశపారంపర్యంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉన్న మధ్యవయస్కులు కొందరిని ఎంపిక చేసి వాళ్ల మెదడులో వస్తోన్న మార్పుల్ని నిశితంగా గమనించారట. అందులో ఇన్సులిన్‌ సంకేతాలతోపాటు ఆకలికి సంబంధించిన నాడీ కణాల అమరికలో క్రమంగా మార్పులు చోటుచేసుకోవడాన్ని గమనించారట. ఆ కారణంగానే వాళ్లలో ఆకలి పెరిగి అతిగా తినడం ప్రారంభించినట్లు గమనించారు. గతంలో ఊబకాయం వచ్చేముందు మెదడులో మార్పులు చోటుచేసుకుంటాయనే విషయాన్ని ఊహించలేదు. కానీ తాజా పరిశోధనలో ఈ విషయం స్పష్టమైందట. ఈ మార్పులు ఎంత ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఊబకాయం వచ్చే ప్రమాదం అంత ఎక్కువట. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊబకాయాన్ని నిరోధించుకోవచ్చు అన్నది నిపుణుల అభిప్రాయం.


వ్యాయామంతో ఆందోళన మాయం!

వ్యాయామంతో ఆరోగ్యసమస్యలు తగ్గుతాయనేది తెలిసిందే. అయితే బాగా చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తే దీర్ఘకాలిక ఆందోళన సైతం తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ గోతెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన తాజా అధ్యయనం చెబుతోంది. వ్యాయామం చేయడం వల్ల డిప్రెషన్‌ తగ్గుతుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో, ఆందోళనతో బాధపడేవాళ్లను 300 మందిని ఎంపిక చేసి వాళ్లను గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపుతో ఒక్కో రకంగా 12 వారాలపాటు కసరత్తుల్ని చేయించారట. ఫిజియో థెరపిస్టు ఆధ్వర్యంలో రకరకాల వ్యాయామాలు చేయించడంతోపాటు ఆ సమయంలో వాళ్ల గుండె రేటునీ గమనించారట. అందులో- బాగా చెమటలు పట్టేలా వ్యాయామం చేయించినవాళ్లకు ఆందోళన స్థాయులు బాగా తగ్గినట్లు గుర్తించారు. దీన్నిబట్టి రకరకాల మానసిక సమస్యలతో సతమతమయ్యేవాళ్లు చురుకైన జీవనశైలిని అలవరచుకుంటే అవన్నీ క్రమంగా దూరమవుతాయని చెప్పుకొస్తున్నారు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న