Published : 09/09/2020 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గూగుల్ వెరిఫైడ్ కాల్స్‌తో ఇక ఆ కాల్స్‌కు చెక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు పెరుగుతుండటంతో సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. లాటరీ తగిలిందని, మీ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ వ్యాలిడిటీ ముగిసిందని పలు రకాల ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి. కొందరు అమాయకులు మోసగాళ్ల వలకు చిక్కి పెద్ద మొత్తంలో నష్టపోతుంటారు. ఇలాంటి మోసపూరిత కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు సెర్చ్‌ ఇంజిన్ గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రూకాలర్‌ తరహాలోనే గూగుల్ తన ఫోన్‌ యాప్‌కు వెరిఫైడ్ కాల్స్‌ పేరుతో సరికొత్త ఫీచర్‌ను జోడించింది.

ఇందులో కాలర్ ఐడెంటిఫికేషన్, కాల్‌ బ్లాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. దీని ద్వారా స్పామ్‌ కాల్స్‌, బిజినెస్‌ కాల్స్‌ను ముందే స్కాన్‌ చేసి వాటి వివరాలను మన ఫోన్‌ స్క్రీన్‌పై చూపిస్తుంది. వాటి ఆధారంగా మనకు అవసరమైతే కాల్ లిఫ్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మనకు బ్యాంక్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నారనుకుందాం. ఆ నంబర్‌ను వెరిఫైడ్ కాల్స్ స్కాన్ చేసి బ్యాంక్‌ పేరు, లోగో, ఎందుకు కాల్‌ చేస్తున్నారనే వంటి వివరాలు ఫోన్‌ స్క్రీన్‌పై చూపిస్తుంది. అయితే ఇలా కంపెనీల వివరాలు కనిపించేందుకు సదరు కంపెనీలు వెరిఫైడ్ కాల్స్‌లో ట్రస్టెడ్‌ బిజినెస్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల సదరు కంపెనీలు వినియోగదారులకు ఫోన్‌ చేసినప్పడు వాళ్లు నంబర్‌ బ్లాక్‌ చేయకుండా మాట్లాడుతారని గూగుల్ తెలిపింది. అలా నిజమైన బిజినెస్ కంపెనీలకు లబ్ధి చేకూరి మోసపూరిత కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడించింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. తొలి దశలో భాగంగా అమెరికా, మెక్సికో, బ్రెజిల్, స్పెయిన్, భారత్‌లో దీన్ని తీసుకొచ్చారు. గూగుల్ ఫోన్ యాప్ ఉపయోగిస్తున్నవారు తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ని పొందవచ్చని గూగుల్ తెలిపింది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు