బైకు మారుతున్నది!
close

Published : 22/09/2021 01:42 IST

బైకు మారుతున్నది!

బైకులు అనగానే ఎప్పుడూ ఒకే రూపం కళ్ల ముందు కదలాడుతుంది. మొదట్నుంచీ వీటి ఆకారం పెద్దగా మారిందేమీ లేదు. కానీ త్వరలోనే కొత్త డిజైన్‌ బైకు రోడ్ల మీదికి రానుంది. వేగం కోసం దీన్ని రూపొందించినా మొత్తం ఆకారమే కొత్తగా కనిపిస్తుంది. బైకు నడుపుతున్నప్పుడు గాలి వెనక్కు నెడుతుండటం తెలిసిందే. మరింత వేగంతో దూసుకెళ్తుంటే దీని ప్రభావం ఇంకాస్త ఎక్కువే పడుతుంది. చివరికి ఏదో ఒక దశలో గాలి శక్తికి వెనక్కు తగ్గకతప్పదు. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికే వైట్‌ కాన్సెప్ట్‌ మోటార్‌సైకిల్స్‌ సంస్థ సరికొత్త డిజైన్‌తో ‘డబ్ల్యూఎంసీ250ఈవీ’ అనే బైక్‌ను రూపొందించింది. గాలి ప్రభావాన్ని తట్టుకొని అత్యధిక వేగంతో దూసుకుపోవటం దీని ప్రత్యేకత. మామూలుగా రేసింగ్‌ కార్లను లోపలి నుంచి, పైనుంచి, కింది నుంచి గాలి వెళ్లిపోయేలా రూపొందిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన గొట్టపు మార్గాలను ఏర్పరుస్తుంటారు. కొత్త బైక్‌ రూపకల్పనలోనూ ఈ సూత్రానే అనుసరించటం విశేషం. బైకు ముందు భాగం నుంచి వెనక వైపునకు గాలి వెళ్లిపోయేలా పెద్ద కార్బన్‌ గొట్టాన్ని ఏర్పరచి దీన్ని సాధించారు. అంటే దీన్ని ముందు నుంచి చూస్తే సీటుకు, అడుగున ఇంజిన్‌ భాగానికి మధ్య పెద్ద రంధ్రం ఉన్నట్టు కనిపిస్తుంది. చూడటానికి విచిత్రంగా కనిపించినా మంచి ఫలితమే చూపిస్తోంది. సూపర్‌ బైకులతో పోలిస్తే సుమారు 69% వరకు గాలి ప్రభావాన్ని తగ్గిస్తోంది. దీంతో కొత్త బైకు గంటకు 402 కిలోమీటర్ల వరకూ వేగం సాధించగలదని భావిస్తున్నారు. ఇటీవలే దీని ప్రాథమిక ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరంలో పూర్తిస్థాయిలో పరీక్షించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్ల్యూఎంసీ250ఈవీ ఆకారంలోనే కాదు. పనితీరులోనూ ప్రత్యేకమైందే. ముందు చక్రం హైడ్రాలిక్‌ స్టీరింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వెనక చక్రమేమో 30 కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్లతో నడుస్తుంది. గాలి గొట్టం కింద బ్యాటరీ ఉండేలా ఏర్పాట్లు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న