ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ సేఫ్..! 
close

Updated : 10/02/2021 19:26 IST
ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ సేఫ్..! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ ఫిబ్రవరిలో నూతన గోప్యతా విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్స్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వాట్సాప్‌ బదులు ఇతర ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో వాట్సాప్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నూతన గోప్యతా విధానం అమలును మే నెల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ పలువురు యూజర్స్ ఇతర యాప్‌లవైపే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో యూజర్స్‌ సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని వాట్సాప్‌ మరోమారు స్పష్టం చేసింది. అలానే ‘సేఫ్ ఇంటర్నెట్ డే 2021’ని పురస్కరించుకుని సమాచార గోప్యత, భద్రతకు పాటించాల్సిన నాలుగు మార్గాలను సూచించింది. అవేంటో ఒక్కసారి చూద్దాం..

టూ-స్టెప్‌ వెరిఫికేషన్

యూజర్స్ తమ ఖాతాలను భద్రంగా ఉంచుకునేందుకు టూ-స్టెప్ వెరిఫికేషన్ అనుసరించాలని వాట్సాప్ సూచించింది. దీనికి పిన్ యాడ్ చేసుకోవడం ద్వారా మీ వాట్సాప్‌ అకౌంట్‌ను ఇతరులు తస్కరించకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ దొంగిలించి సిమ్ మార్చినా మీ ఖాతాను ఇతరులు వాడకుండా టూ-స్టెప్‌ వెరిఫికేషన్ అడ్డుకుంటుంది. దీని కోసం సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి అందులో అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళితే టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకుని ఆరు నంబర్ల పిన్ సెట్ చేసుకోవాలి. అలానే మీ ఈ-మెయిల్ ఐడీ కూడా యాడ్ చేసుకోవడం ద్వారా మీ వాట్సాప్‌ ఖాతా సురక్షితంగా ఉంటుంది.   


 


వాట్సాప్ గ్రూప్‌

చాలా మంది మనకు తెలియకుండా మన నంబర్‌ని వేర్వేరు వాట్సాప్‌ గ్రూప్‌లలో యాడ్ చేస్తుంటారు. దీని వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మిమ్మల్ని వేరే గ్రూప్‌లో యాడ్‌ చేయాలంటే మీ అనుమతి తీసుకొనేలా వాట్సాప్‌లో ఓ ఆప్షన్‌ ఉంది. దానిని యాక్టివేట్‌ చేసుకుంటే మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ గ్రూప్‌లో యాడ్‌ చేయలేరు. దీని కోసం వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో అకౌంట్‌లోకి వెళ్లి ప్రైవసీపైన క్లిక్ చేయాలి. అందులో గ్రూప్స్‌లోకి వెళ్తే మూడు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఎవ్రీవన్‌ సెలక్ట్‌ చేసుకుంటే ఎవరైనా మిమ్మల్ని యాడ్‌ చేయొచ్చు. అలాకాకుండా మీ మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్స్‌ మాత్రమే మిమ్మల్ని గ్రూపులో యాడ్‌ చేయాలంటే ‘మై కాంటాక్ట్స్‌’ ఎంచుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్స్‌లో కొంతమందికి మాత్రమే అనుమతి ఇవ్వాలనుకుంటే ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌...’ ఎంచుకుంటే సరిపోతుంది. 


రిపోర్ట్ స్పామ్


 

మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని, మీకు తెలియని వ్యక్తుల నుంచి మీకు సందేశాలు వచ్చినా.. మీకు వారిపై అనుమానం కలిగినా వెంటనే ఫిర్యాదు చేయాలని వాట్సాప్ సూచిస్తుంది. ఒకవేళ మీకు తెలియని వ్యక్తులు మీతో ఛాట్ చేయడానికి ప్రయత్నిస్తే ఛాట్ కింద రిపోర్ట్, బ్లాక్‌, యాడ్ కాంటాక్ట్స్‌ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో రిపోర్ట్‌పై క్లిక్ చేసి వాట్సాప్‌కు ఫిర్యాదు చెయ్యొచ్చు. 


ప్రొఫైల్ ప్రైవసీ

అలానే యూజర్స్ ప్రొఫైల్ ప్రైవసీ పాటించాలని వాట్సాప్ సూచిస్తుంది. మీ ప్రొఫైల్ ఫొటోలు, స్టేటస్‌లు తెలియని వ్యక్తులు లేదా మీ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులు చూడకుండా ఉండాలంటే ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని తెలిపింది. మీ ప్రొఫైల్ ఫొటో బయటి వ్యక్తులు చూడకుండా ఉండాలంటే ముందుగా సెట్టింగ్స్‌లో అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ప్రైవసీ ఓపెన్ చేసి ప్రొఫైల్‌ ఫొటోపై క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్‌, నోబడీ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మై కాంటాక్ట్స్‌ సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్‌ జాబితాలో ఉన్న వారు మినహా బయటి వ్యక్తులు ఎవరూ మీ ప్రొఫైల్ ఫొటోని చూడలేరు. 
స్టేటస్‌లకు కూడా ఇదే తరహా పద్ధతిని అనుసరించాలి. సెట్టింట్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రైవసీపై క్లిక్ చేస్తే స్టేటస్‌ ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది. అందులో మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌, ఓన్లీ షేర్ విత్‌ అని మూడు ఆప్షన్స్‌ ఉంటాయి. మొదటిది ఎంచుకుంటే మీ స్టేటస్‌ను కాంటాక్ట్స్‌లో ఉన్న అందరూ చూస్తారు. రెండోది సెలెక్ట్‌ చేస్తే కాంటాక్ట్స్‌లో మీరు ఎంచుకున్న వాళ్లకు తప్పించి అందరికీ కనిపిస్తుంది. మూడోది మీరు సెలెక్ట్‌ చేసుకున్న కొంతమంది కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపిస్తుంది.

పైన సూచించిన మార్గదర్శకాలు పాటించడం ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదని వాట్సాప్ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి..

స్వచ్ఛ కంప్యూటర్‌కు పంచ సూత్రాలు..

దేశీయ పాడ్‌కాస్ట్‌లు.. వినేయండి.. ఉల్లాసంగాTags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న