విష్ణు వ్యక్తదేహం గీత

సాగరాన్ని దాటడానికి ఈత భవసాగరాన్ని దాటడానికి గీత- అన్నారు భగవద్గీత గొప్పదనం గురించి పండితులు. యుద్ధరంగంలో కర్తవ్య విముఖుడై బేలగా మారిన అర్జునుడికి పరమాత్మ అందించిన దివ్యోపదేశం గీతా సందేశం.

Updated : 10 Dec 2022 19:31 IST

డిసెంబరు 4 గీతా జయంతి

సాగరాన్ని దాటడానికి ఈత భవసాగరాన్ని దాటడానికి గీత- అన్నారు భగవద్గీత గొప్పదనం గురించి పండితులు. యుద్ధరంగంలో కర్తవ్య విముఖుడై బేలగా మారిన అర్జునుడికి పరమాత్మ అందించిన దివ్యోపదేశం గీతా సందేశం.

మహాభారతంలో శ్రీకృష్ణుడు రెండు రకాలైన గానమాధుర్యంతో విశ్వాన్ని అలరింపజేశాడు. ప్రకృతిని పులకింపజేసిన మొదటి మాధుర్యం వేణుగాన సరిగమలైతే, రెండోది గీతాగాన మధురిమలు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతి. గీతాచార్యుడు భగవద్గీత రూపంలో సన్మార్గాన్ని బోధించిన రోజది. అనంతమైన కాల వేదికపై తమ పాత్రను సముచితంగా పోషించి గొప్పవారిగా ఎదిగిన మహాపురుషులకు జయంతులు జరపడం సాధారణమే కానీ ఒక గ్రంథానికి జయంతి అంటే అదెంత గొప్పదైతేనో అంత గౌరవం దక్కింది. ఏమిటా గొప్ప అంటే గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే..’ అంటూ ఆరంభ మౌతుంది. ఈ పదాలను కొంచెం అటు ఇటుగా మార్చి ‘క్షేత్రే క్షేత్రే ధర్మం కురు’ అనుకుంటే ఏయే ప్రదేశాల్లో నువ్వుంటావో ఆ అన్నిచోట్లా ధర్మాన్నే ఆచరించమనడం. ఇది సార్వకాలీన సత్యం. ఇలా ప్రతి పదం అర్థవంతమై హితబోధకమై సాగుతుంది.

ఇందులో అంతరార్థం

భగవద్గీత సంపూర్ణంగా అర్థం కావాలంటే అంతరంగమథనం జరగాలి. అది ఏ స్థాయిలో ఉండాలంటే.. వృత్తి ఉద్యోగాల్లో ఎంత ఔన్నత్యం సాధించినా అదంతా నాణానికి ఒకవైపే అనుకోవాలి. ఆధ్యాత్మిక కోణం ఇంకొకటుందని గుర్తించే పరిపక్వత రావాలి. అందుకీ ఉద్గ్రంథం తోడ్పడుతుంది. వందలాది యుద్ధ వీరులను తన సవ్యసాచిత్వంతో అవలీలగా జయించగల అర్జునుడు కూడా అస్త్ర సన్యాసం చేసి పరమాత్మ ముందు మోకరిల్లాడు. అది యుద్ధరంగం అయినప్పటికీ జీవితాన్ని అన్ని కోణాల్లోనూ విశదీకరించడానికి అదే అనువైన సమయమని గీతాచార్యుడి ఉద్దేశం.

లౌకికభోగాలనే మాయతెర మనసును ఎప్పుడూ కప్పి ఉంటుంది. ఇష్టమైన వాటిమీద వ్యామోహం పెంచు కుంటుంది. అది సరికాదన్నాడు కృష్ణపరమాత్మ. వ్యక్తులైనా వస్తువులైనా ఏవీ శాశ్వతం కావు. ప్రేమ పెరిగినకొద్దీ వియోగ దుఃఖం అధికంగా ఉంటుంది. అర్జునుడికి భీష్మ ద్రోణ కృపాచార్యులు తదితరులతో యుద్ధ విషయంలో జరిగిందిదే. మోహం పెద్ద మానసిక బలహీనత. ఆ దౌర్బల్యాన్ని వదిలించుకోమని, సుఖ దుఃఖాలను ఒకటిగా చూడగల స్థితప్రజ్ఞత అవసరమని వివరించాడు. అలజడి నిండిన మనసుతో దుఃఖితుడైన అర్జునుడు గీతాబోధ పూర్తయ్యేసరికి సందేహాలన్నీ తొలగి యుద్ధం చేశాడు. తనవారికి విజయాన్ని అందించాడు. భగవద్గీత భారత కథే కాదు, మన నిత్య జీవిత గాథ. మనలో ఎన్నో ఇష్టాలు, మోహాలు స్థిరమై ఉంటాయి. కాలంచెల్లినవాటిని విడిచిపెడితేనే ఆరోగ్యకర జీవనం సాగుతుంది. అయితే మనసు అందుకు అంగీకరించదు. అప్పుడు బుద్ధి రంగప్రవేశం చేసి నచ్చచెబుతుంది. మనసు మనందరికీ ప్రతినిధి అయిన నరుడి(అర్జునుడు)కి ప్రతిరూపమైతే హితం చెప్పిన  బుద్ధి పరమాత్మ అంశ అయిన నారాయణుడి స్వరూపం. మనందరి దేహమే కురుక్షేత్రం. మనసుకూ బుద్ధికీ మధ్య నిత్యం జరిగే వివాదం కృష్ణార్జునుల మధ్య జరిగిన గీతా సంవాదానికి సంకేతం.
విష్ణుమూర్తి వ్యక్త దేహం
ఒకసారి లక్ష్మీదేవి భగవద్గీత గురించి ప్రశ్నిస్తే శ్రీమహావిష్ణువు ఆ సందేహాలన్నీ తీర్చి, గీత తన బాహ్య స్వరూపమన్నాడు. అందుకే గీతను విష్ణువు వ్యక్తదేహంగా భావిస్తారు.
శృణు సుశ్రోణి వక్ష్యామి గీతాసు స్థితిమాత్మనః
వక్తాణ్రి పంచ జానీహి పంచాధ్యాయానను క్రమాత్‌
దశాధ్యాయాన్‌ భుజాంశ్చైకముదరం ద్వౌ పదాంబుజే
ఏవమష్టాదశాధ్యాయీ వాఙ్మయీ మూర్తిర్యైశ్వరీ

మొదటి ఐదు అధ్యాయాలు ఐదు ముఖాలు, తర్వాతి పది అధ్యాయాలు పది భుజాలు, పదహారో అధ్యాయం ఉదరం, చివరి రెండు అధ్యాయాలూ రెండు చరణాలని భావం.

ఉద్ధండుల భాష్యాలు

ఎందరో మహానుభావులు గీతకు భాష్యాలు చెప్పారు. శంకరాచార్యులు జ్ఞానయోగాన్ని ప్రతిపాదించే గ్రంథమన్నారు. రామానుజాచార్యులు భగవద్గీతలో విశిష్టాద్వైతాన్ని దర్శించారు. మద్వాచార్యులు శుద్ధాద్వైత ప్రధానమన్నారు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ ‘గీతారహస్యం’ అంటూ గ్రంథమే రాశారు. మరెందరో మహానుభావులు తమ భావాలకు అనుగుణంగా గీతను వ్యాఖ్యానించారు.

పాపం హరిస్తుంది

కృష్ణపరమాత్మ ముఖతః వెలువడిన భగవద్గీత మహా పవిత్రమైంది, పుణ్యప్రదమైంది అంటూ వర్ణించింది వరాహపురాణం.
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై

గీతను పారాయణ చేసేచోట పుణ్యతీర్థాలు ఉన్నట్టేనని భూమాతకు తెలియజేశాడు విష్ణువు. గీతాధ్యయనం చేయడమంటే నదీస్నానంతో శరీరాన్నీ మనసునూ పునీతం చేసుకున్నట్టు. భగవద్గీత సర్వ పాపాలనూ హరిస్తుందంటూ పద్మపురాణంలో 18 కథలున్నాయి. తెలిసి, తెలియక చేసిన పాపకర్మలు గీతాపఠనంతో నశిస్తాయన్నది సారాంశం.
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః
జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్‌

నిత్య జీవితంలో ఎదురయ్యే సందేహం, సంశయం, బాధ, దుఃఖం.. అన్నిటికీ సమాధానం చెబుతుంది భగవద్గీత. ఓదార్చి అక్కున చేర్చుకుంటుంది. అందుకే అది నిత్య ప్రబోధ. గీతాస్మరణం జీవన్ముక్తుల్ని చేస్తుంది. మరణానంతరం వైకుంఠప్రాప్తి కలిగిస్తుంది.
రామచంద్ర, కనగాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని