జీవనగానంలో రుతురాగాలు

చైతన్యానికి రెండు పార్శ్వాలు ఆంతరంగిక, బాహ్య ప్రపంచాలు. అయితే బాహ్య ప్రకృతి పరిణామానికి అంతరంగ ప్రకృతి కూడా ప్రభావిత మవుతుంది. ప్రకృతి లోని పరిణామాలు మనకు తెలియకుండానే మనలో అనేక మార్పులు తీసుకొస్తాయి.

Updated : 19 Jan 2023 04:06 IST

చైతన్యానికి రెండు పార్శ్వాలు ఆంతరంగిక, బాహ్య ప్రపంచాలు. అయితే బాహ్య ప్రకృతి పరిణామానికి అంతరంగ ప్రకృతి కూడా ప్రభావిత మవుతుంది. ప్రకృతి లోని పరిణామాలు మనకు తెలియకుండానే మనలో అనేక మార్పులు తీసుకొస్తాయి.  ప్రకృతి రూపంలో పరమాత్మే తన ప్రాభవాన్ని ప్రకటితం చేస్తున్నాడన్నారు తాత్త్వికులు.

రుతువుల ఆధారంగా ఆ అంతర్యామి మనకు జీవనపాఠాలు నేర్పుతున్నాడు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శిశిర రుతువులు.. విభిన్న ధర్మాలతో ప్రకృతికి శోభనివ్వటమే కాదు, జీవుల మనుగడకూ కారణమవుతున్నాయి. మానసిక వికాసానికీ ఆధ్యాతిక ఉన్నతికీ తోడ్పడుతున్నాయి. అందుకే ‘మనిషి నుంచి మనిషి పొందే శక్తి, స్ఫూర్తి కన్నా ప్రకృతి నుంచి పొందే శక్తి, స్ఫూర్తే అపారం’ అన్నారు మహర్షి అరవిందులు. జీవుల అంతర్గత జీవరసాయనిక ధర్మానికి ప్రతీక రుతువులు అన్నారో జెన్‌గురువు. ఏ ఒక్క కాలంతో ఆగిపోకుండా, ఏ ఒక్క మార్పుతో మమేకం కాకుండా అన్నిటినీ సాక్షిగా వీక్షిస్తూ, సమభావనతో అనుభవిస్తూ, ముందుకు సాగిపొమ్మని రుతువులు సూచిస్తాయంటారు మార్మికులు (మిస్టిక్స్‌). రుతువుల్ని బట్టి మన మానసిక, శారీరక ప్రవృత్తులు మారుతుంటాయని ఆయుర్వేదశాస్త్రం విస్పష్టం చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవనగానాన్ని రుతురాగాలు సుసంపన్నం చేస్తాయి.


వసంతం.. విరుల సొంతం

మనసును ఉల్లాసపరిచే మధుమాసం వసంతరుతువులో భాగమే. పూలవనాలు పరిమళాలతో పలకరించే ఈ రుతువు మనలో కొత్త ఉత్సాహానికి ఊపిరులూదుతుంది. మనసుల్ని ఆనందడోలికల్లో ఊయల లూపుతుంది. అందుకే ‘రుతూనాం కుసుమాకరః’ అన్నారు. రుతువుËల్లో పూలు పూసే వసంతరుతువును తానే అన్నాడు గీతలో శ్రీకృష్ణుడు. మధుమాసానికి మాధవమాసం, పుష్పమాసమనే పేర్లూ ఉన్నాయి. పూసే ప్రతిపూవులో ఆ పురాణపురుషుడే ప్రకటితమవుతాడన్న భావన కలిగితే వసంతంలో పారమార్థికంగా మరింత ప్రగతిని సాధించవచ్చు. శ్రీరాముడు కూడా శోభకు ప్రతీక అయిన వసంతంలోనే జన్మించాడు. ప్రకృతిని ఆరాధించి, సంరక్షించి అది అందించిన ఫలరసాదులతో ఆనందమయ జీవితం గడపమని నిశ్శబ్దంగా ప్రబోధించే వసంతరుతువు శరీరానికీ, మనసుకీ నవ చైతన్యాన్నిస్తుంది.


గ్రీష్మం.. చైతన్యజాగృతం

వసంతానికీ, వర్షానికీ మధ్య వచ్చే గ్రీష్మం ఓ వినూత్న అనుభూతి నిస్తుంది. ఆ రెండింటి విలువేంటో తెలియజేస్తుంది. అందుకే ‘గీతాంజలి’లో రవీంద్రుడు ‘వెలుగుని చీకటి తరిమే చోట, గ్రీష్మాన్ని దాటి వర్షం సమీపించే చోట, ఆ తోవ పక్కన ఎదురుచూస్తూ కూర్చోవడం నాకెంతో ఇష్టం’ అన్నారు. ఈ రుతువుకు అధినాయకుడు సూర్యభగవానుడు. లోకమంతా ఆయన ప్రభావంతో ప్రకాశవంతంగా పరిఢవిల్లుతుంది. భానుకిరణాలతో మొక్కలు, జీవాలు పునరుత్తేజిత మవుతాయి. మనలోని తమోగుణాన్ని రజోగుణంగా జాగృతపరచి కార్యోన్ముఖులం కావాలని గ్రీష్మరుతువు తన సూర్యకిరణాలతో మేల్కొలుపుతుంది. పంచభూతాల్లోని అగ్నితత్వం గ్రీష్మంలో ప్రధానంగా మానవాళిపై ప్రభావాన్ని చూపుతుందన్నారు మహర్షులు.


వర్షం.. మహాహర్షం

గ్రీష్మతాపం నుంచి మనకు ఉపశమనం కలిగించేది వర్షరుతువు. దీనికి హరిత రుతువనే పేరూ ఉంది. వర్షాన్ని తృప్తిగా భావించి మహాసత్యాన్ని మననం చేయ మంటోంది తైత్తిరీయోపనిషత్తు. పుడమిని సస్యశ్యామలం చేసే వర్షాన్ని విభూతిగా భావించి పరమాత్మను స్మరించమని ప్రబోధిస్తుంది. వాల్మీకి నుంచి కాళిదాసు వరకు వర్షాన్ని వర్ణించి పులకించినవారే! శ్రీరాముడు సీతా వియోగంతో దుఃఖిస్తున్న వేళ వర్షం ఆ బాధను ఉపశమింపచేసింది. లక్ష్మణుడితో ‘మేఘగర్భం నుంచి వెలువడి, కర్పూర రేకల్లా చల్లగా మొగలిపూల సువాసన లతో వీస్తున్న ఈ గాలులు దోసిళ్లతో తాగేలా ఉన్నాయి’ అంటూ సాంత్వన పొందాడు. బాల్యంలో రామకృష్ణ పరమహంస పొలాల్లో వెళ్తుండగా ఆకాశంలో కమ్ముకున్న నల్లని మేఘాలు బాహ్యస్మృతిని కోల్పోయేలా చేసి, ఆధ్యాత్మికంగా జాగృతపరచాయి.


శరత్తు.. వెన్నెల మహత్తు

శరద్రుతువులో వెన్నెల మరింత కాంతివంతమౌతుంది. చంద్రుడు లోకాన్ని అమృతమయం చేయగల శక్తిమంతుడు. తేజోకాంతులతో లోకానికి జీవచైతన్యాన్ని ప్రసాదించేది సూర్యుడైనా, ఆహారప్రదాత చంద్రుడు. ఇక వెన్నెలేమో అమృతం కురిపిస్తుంది. శరత్తు పంటచేలకూ, వృక్షజాతికీ ప్రాణశక్తిని అందించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. చెట్లు చిగుళ్లు తొడిగి పూలూకాయలతో అలరించడానికి దోహదం చేస్తుంది. మనసుకు అధిపతి చంద్రుడు. యోగదృష్టితో, ఆధ్యాత్మిక, ధార్మిక ఆలోచనలతో మనసును పునీతం చేసుకునేందుకు శరత్తు ప్రతీక. ఈ రుతువులో వచ్చే శరత్‌పూర్ణిమ, కార్తికపూర్ణిమలు చంద్రుడి విశిష్టతను గుర్తుచేస్తాయి.


హేమంతం... హిమవంతం

హేమంతం ప్రకృతికే స్వర్ణకాంతిని అద్దుతుంది. ఈ రుతువులో మంచుకురిసే తొలిపొద్దు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. మనసుకు, శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే కాలమిది. అందుకే వనవాసంలో ‘సోదరా! సంవత్సరాన్ని అందంగా, శుభప్రదంగా దర్శింపచేసే, నీకెంతో ఇష్టమైన హేమంతకాలం వచ్చేసింది చూడు’ అంటూ హేమంతరుతువు విశిష్టత గురించి ముచ్చటించాడు లక్ష్మణుడు. అలా హేమంతం రామునికి ఇష్టమైన కాలమని తెలియచేశాడు వాల్మీకి. ప్రకృతిని శోభింపచేస్తూ పాడిపంటలు పుష్కలంగా అందించే ఈ రుతువు, ఫలితాన్ని నలుగురితో పంచుకోవాలని హితవు పలుకుతుంది. కనుకనే హేమంతంలో రైతులు సంతృప్తితో దానధర్మాలు చేస్తుంటారు.


ఆశావహ శిశిరం

ఆకులు రాల్చే రుతువు శిశిరం. శరీరాన్నీ, మనసునూ దృఢంగా మలచుకోవటానికీ, రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికీ అనుకూల కాలమని ఆయుర్వేదం చెబుతోంది. మొక్కలు మోడువారినా, మళ్లీ చిగురించేందుకు సిద్ధమై రాబోయే హేమంతం కోసం ఎదురుచూస్తాయి. మనం కూడా ఎంతటి నిరాశలోనూ కుంగి పోకుండా శిశిరంలా నిరీక్షించాలి. అందుకే శిశిరాన్ని ఆశావహ రుతువంటారు.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని