ఏకాంతం ఎంతో శాంతం

నిరంతరం ఇతరుల మధ్యే మెలగుతుంటే, మన నుంచి మనం దూరమైపోతాం. సహవాసాల పేరుతో, సామాజిక మాధ్యమాల పేరుతో మన చిత్రపటంలో.. మన ముఖం కన్నా ఇతరులవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎవరికి వారు ఏకాంతస్థితిని కల్పించుకోకపోతే..

Updated : 07 Dec 2023 09:30 IST

నిరంతరం ఇతరుల మధ్యే మెలగుతుంటే, మన నుంచి మనం దూరమైపోతాం. సహవాసాల పేరుతో, సామాజిక మాధ్యమాల పేరుతో మన చిత్రపటంలో.. మన ముఖం కన్నా ఇతరులవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎవరికి వారు ఏకాంతస్థితిని కల్పించుకోకపోతే.. నేటి పరుగుల ప్రపంచంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, అశాంతి కలుగుతుంది.

గౌతమ బుద్ధుణ్ణి ఓ శిష్యుడు ‘సాధారణంగా ఎవరైనా నలుగురి మధ్యే ఉండాలి అనుకుంటారెందుకు? ఇతరులతో సాంగత్యం అంత ఆనందంగా ఉంటుందా?’ అనడిగాడు. దానికి తథాగతుడు ‘తనతో తాను ఉండలేక, తనను తాను ఆనందించ లేక.. మానసికంగా ఇతరులపై ఆధారపడుతుంటారు. తన మనస్సాక్షితో తలపడలేక తప్పించుకుంటారు. మనం పోగుచేసుకున్న విజ్ఞానంతో ఎప్పటికీ వాగుడుకాయల మాదిరిగానే మిగిలిపోతాం. మన చేష్టలు చాలా వరకు గారడీవాడు చేసే పనుల్లానే ఉంటాయి. మనల్ని మనం నిరంతరం వంచించుకుంటూ కాలం గడుపుతున్నాం. అందరికీ దూరంగా కాసేపు మనతో మనం గడిపితే, మన అంతరాత్మ మనల్ని మనకు స్పష్టంగా అద్దంలో చూపెడుతుంది. అందుకే ఏకాంతమంటే మనకు భయం. కానీ అదే మన ఆత్మప్రక్షాళనకు మార్గం’ అంటూ వివరించాడు. నిజమే! గౌతముడు చెప్పినట్లు మనలో మనం ఉంటూ, మనతో మనం గడపగలగటం అత్యున్నత స్థితి. మన జీవితాన్ని మెరుగుపరుచుకునే విశేషమైన రీతి.

ఆత్మపరిశీలనకు అత్యున్నత మార్గం

ఆధునిక జీవనంలో బాహ్యప్రపంచాన్ని ఆస్వాదించినట్లుగా, మన ఆంతరంగిక ప్రపంచాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఆనందంగా సాగలేకపోతున్నాం. ‘ఆత్మపరిశీలన లేని జీవితం వృథా’ అన్నాడు సోక్రటీస్‌. మనోభావాలను పరీక్షించుకోవటం, ఆలోచనలను విశ్లేషించుకోవటం ద్వారా అంతరంగ స్థితిపై పూర్తి అవగాహన కలుగుతుంది. ఈ ప్రక్రియ అంతా మనతో మనం గడిపినప్పుడే సాధ్యపడుతుంది. సహచరులతోనే కాదు.. సాంకేతిక ఉపకరణాలతో కూడా మనసు విడివడినప్పుడే మన సాహచర్యం మనకు సంపూర్ణ సాంత్వననిస్తుంది. అందుకే గీతలో- ‘యోన్తస్సుఖోస్తరా రామః తథాన్తర్జ్యోతి రేవ యః’ అన్నాడు శ్రీకృష్ణభగవానుడు. ఎవరైతే తమలోనే శాంతిసుఖాలను అనుభవిస్తారో, ఎవరికి తమలోనే జ్ఞానప్రకాశం ఉదయిస్తుందో వారు అత్యున్నతస్థితికి చేరతారని భావం. ఆ యోగీశ్వరుడు చెప్పినట్లు.. సదా అందరితో కలిసుండటమే కాకుండా, అప్పుడప్పుడూ అంతరంగంలోకి తొంగి చూస్తుండాలి. ఏకాంతంలో మనసు అంతర్ముఖమైనప్పుడు వివేకం ఉదయిస్తుంది. ఆ వివేకం లోంచి సత్యం వికసిస్తుంది.

ఏకాంతం వేరు.. ఒంటరితనం వేరు..

తమకు తాము ఉన్నామనుకొని, తమనే తమకు తోడుగా చేసుకొని గడపటం ఏకాంతం. తమకు ఎవరూ లేరని వ్యాకులపడుతూ కుమిలిపోవటం ఒంటరితనం. ఏకాంతంలో మనిషి మానసిక బలాన్ని పెంపొందించుకుంటాడు. తన శక్తిసామర్థ్యాలను ఇతరులకూ ప్రసరింపచేయగలుగుతాడు. కానీ ఒంటరితనం ఆవరిస్తే మాత్రం కుంగిపోతాడు. తన మానసిక శక్తుల్ని నిర్వీర్యం చేసుకుంటూ, ఇతరులకూ ఆ విషాదఛాయల్ని వ్యాప్తిచేస్తాడు. ‘వ్యక్తిత్వ వికాసానికి ఏకాంతం ఎంతో తోడ్పడుతుంది. తనతో తాను గడిపినప్పుడు రూపుదిద్దుకున్న ధైర్యం, దృఢత్వం మరెప్పుడూ రూపుదిద్దుకోవు. ఆ ఏకాంతస్థితి మనలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుంది. మనల్ని శక్తిమంతులుగా తయారుచేస్తుంది. కానీ మన దిన చర్య.. ఎందరినో కలుసుకోవటంతోనే సరిపోతుంది. మనల్ని మనం కలుసుకోవటానికి సమయం దొరకటం లేదు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు- ‘అమెరికన్‌ హేండ్‌బుక్‌ ఆఫ్‌ సైకియాట్రి’ పుస్తక రచయిత. మనతో మనం మెలగినప్పుడే, మనలోని కళా హృదయం, ప్రతిభాపాటవాలు ఆవిష్కృతమౌతాయి. మహానుభావులందరూ ఏకాంతమనే దీపస్తంభపు వెలుగులో తమ జీవననావల్ని విజయతీరాల వైపు నడిపించుకున్నవారే! రవీంద్రనాథ్‌ టాగోర్‌ తరచూ పద్మానదిపై, ఏకాంతంగా పడవలో విహరించేవారు. అలా ప్రకృతిని ప్రేరణగా తీసుకొని.. ఆయన తన సృజనాత్మకతకు సానపెట్టుకునేవారు.

అంతర్ముఖం.. అంతర్వీక్షణ..

‘ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అన్వేషిస్తూ బయల్దేరిన బాటసారికి వేరెవరూ తోడుండకూడదు. తనకు తానే తోడు. తన ఆలోచనలూ, అనుభూతులే నిజమైన స్నేహితులు. ఇతరులను చూసి ఆనందించే కంటే తనతో తాను ఆనందించడానికి అభ్యాసపడి ఉంటే.. అదే అసలైన ఆనందం’ అంటారు తాత్వికులు. అంతర్ముఖులై, తమ అంతర్వాణిని ఆలకించేందుకు సదా సంసిద్ధమై ఉండేవారే మహోన్నత కార్యాల్ని నెరవేర్చగలరు. అందుకే ‘మీతో మీరు గడపటమనేది అత్యున్నత ఆధ్యాత్మిక సాధన. ఏకాంతంలో మీరు అంతర్యామికి మరింత చేరువ కాగలరు. మీ అంతర్వాణిని మీరు స్పష్టంగా ఆలకించగలరు’ అనేవారు స్వామి వివేకానంద. ఎవరి జీవితం వారిది, ఎవరి పోరాటం వారిది. ఒకరితో మరొకరికి పోలికే లేదు. పరమాత్మ ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా సృష్టించటానికి ప్రధాన కారణం ఇదే. మనం అంగీకరించినా లేకున్నా- ప్రపంచమనే యుద్ధభూమిలో ప్రతి ఒక్కరిదీ ఒంటరి పోరాటమే. ‘ప్రకృతి ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ ఒంటరే! అంత భయంకరంగా ఈ లోకాన్ని సృష్టించాడు భగవంతుడు’ అన్నారు మహర్షి అరవిందులు. ఇది నైరాశ్యభావం కాదు, ఆత్మవిశ్వాసాన్ని రగిలించే సత్యం.

ఆధ్యాత్మికతకు ఆలంబన

పారమార్థికంగా పురోగమించటానికి కూడా ఏకాంతమే ప్రధాన ఆలంబన. ఆధ్యాత్మిక గురువులు, సాధకులు అధికంగా ఏకాంతవాసానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. అంతర్ముఖులై ఆర్జించిన ఆధ్యాత్మిక ఫలాల్ని లోకానికి ప్రసాదంగా పంచిపెడతారు. అందుకే గురుదేవులు రామకృష్ణ పరమహంస ‘మనసు పాలవంటిది. దాన్ని సంసారమనే నీళ్లలో ఉంచితే.. రెండూ కలిసిపోతాయి. పాలను కాచి తోడేసి ఒకచోట ఉంచాక.. పెరుగవుతుంది. అప్పుడు చిలికి వెన్నను తీయాలి. అలాగే ఏకాంతవాసంలో సాధనలు చేసి మనసనే పాల నుంచి జ్ఞానం, భక్తి అనే వెన్నను తీయాలి. ఆ వెన్న సంసార జలధిలో కలిసిపోక నిర్లిప్తంగా తేలుతుంది’ అన్నారు.

ఎవరితో ఉన్నా.. ఎందరిలో ఉన్నా..

ఆధునిక కాలంలో అందరినీ వదిలి అజ్ఞాతంగా గడపటం అసాధ్యమే! అందుకే ఎవరితో ఉన్నా, ఎందరిలో ఉన్నా.. మానసిక ఆనందాన్ని అనుభవించటం అభ్యాసంగా చేసుకోవాలి. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు కూడా.. అంతరంగంలో ఓ తోటను లేదా విశ్రాంత స్థలాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అలాంటి మానసిక స్థితి కలిగిన మహానుభావులెందరో ఉన్నారు. ‘ఆరాధనా భావంతోనూ, ఆనందోద్రేకాలతోనూ జయజయధ్వానాలు పలికే జనసందోహం మధ్య కూడా.. హిమాలయ గుహల్లో ఏకాంతంగా ఉన్నట్లు అతి ప్రశాంతంగా గడిపేవారు స్వామి వివేకానంద’ అంటారు- వారిని ప్రత్యక్షంగా గమనించిన సోదరి క్రిస్టిన్‌ అనే విదేశీ ఆధ్యాత్మిక పిపాసి.

ఏకాంతానికి మౌనం తోడైతే అది బంగారానికి పరిమళం అద్దినట్లు.. మరింత శోభాయమానం అవుతుంది. అలుపులేని మాటల ఒరవడి మనసును నిలకడగా ఉండనీయదు. మాటలు, చేతలది విలోమ సంబంధం. ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. ‘మనన శక్తే మౌనం’ అంటారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. మౌనం మనలోని మననశక్తిని, మనఃశక్తిని ఇనుమడింపచేస్తుంది.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు