ఆధ్యాత్మిక వ్యాకులత

ఓ శిష్యుడు చాలాకాలం గురుకులంలో అభ్యసించాడు. ఓ రోజు ‘గురువర్యా! నాకు భగవంతుడి దర్శనం ఎప్పుడు కలుగుతుంది?’ అనడిగాడు.

Published : 18 Jan 2024 00:08 IST

శిష్యుడు చాలాకాలం గురుకులంలో అభ్యసించాడు. ఓ రోజు ‘గురువర్యా! నాకు భగవంతుడి దర్శనం ఎప్పుడు కలుగుతుంది?’ అనడిగాడు. అప్పుడు ఆచార్యుడు శిష్యుణ్ణి ఓ చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ తటాకంలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గురువు శిష్యుడి తలను నీళ్లలోకి వంచి, కొన్ని క్షణాల పాటు అదిమిపట్టి, తర్వాత వదిలాడు. శిష్యుడు ఊపిరాడక గిలగిలలాడుతూ తలపైకెత్తి నిలబడ్డాడు. గురువు అతన్నే చూస్తూ ‘శిష్యా! తల నీళ్లలో ఉన్నప్పుడు ఏమనిపించింది?’ అనడిగాడు. శిష్యుడు ‘ఉక్కిరి బిక్కిరయ్యాను. ఊపిరి ఎప్పుడు అందుతుందా? అనిపించింది గురువర్యా!’ అని బదులిచ్చాడు. అప్పుడు ఆచార్యుడు ‘నాయనా! భగవంతుడి కోసం కూడా అలా మనసు విలవిల్లాడినప్పుడే ఆయన దర్శనం కలుగుతుంది. పరమాత్మ కోసం అలా తపించాలి’ అని హితవు పలికాడు. ప్రముఖ బెంగాలి రచయిత బంకించంద్ర ఛటర్జీ ఆధ్యాత్మిక పరితాపం గురించి ప్రశ్నించినప్పుడు.. రామకృష్ణ పరమహంస ఈ కథ చెప్పారు. ‘తల్లి కోసం పసిబిడ్డ అల్లాడినట్లు, ఈత రాక నీళ్లలో చిక్కుకున్నప్పుడు బాధితుడు ఊపిరి కోసం విలవిల్లాడినట్లు భగవంతుడి దర్శనం కోసం తపనపడాలి. అదే అసలైన ఆధ్యాత్మిక వ్యాకులత’ అని ఉద్ఘాటించారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని