కాశీకి ప్రత్యామ్నాయం.. ఆ క్షేత్రం

పురాణ, చారిత్రక నేపథ్యం ఉన్న విశిష్ఠ క్షేత్రం కొల్హాపుర మహాలక్ష్మి ఆలయం. ఏటా లక్షలాదిమంది భక్తులు ఈ పవిత్ర దేవాలయాన్ని సందర్శించి తరిస్తారు.

Published : 25 Jan 2024 00:03 IST

పురాణ, చారిత్రక నేపథ్యం ఉన్న విశిష్ఠ క్షేత్రం కొల్హాపుర మహాలక్ష్మి ఆలయం. ఏటా లక్షలాదిమంది భక్తులు ఈ పవిత్ర దేవాలయాన్ని సందర్శించి తరిస్తారు. ఇది 108 శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ కొలువైన లక్ష్మీదేవి భక్తుల పూజలు అËందుకుంటూ అనుగ్రహిస్తోంది. జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు సూర్య కిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహంపై పడతాయి. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. ఈ ఉత్సవాన్ని సూర్యకిరణాల పండుగ, కిరణోత్సవం అని వ్యవహరిస్తారు.

లక్ష్మీదేవిని అంబాబాయి అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు వజ్ర కిరీటం ధరించి దర్శనమిస్తుంది. మూడడుగుల నల్లరాతిపై చెక్కిన మహాలక్ష్మి ప్రతిమ ఆధ్యాత్మిక చింతన పెంపొందించేలా ఉంటుంది. ప్రతిమ వెనుక భాగంలో అమ్మవారి వాహనమైన రాతితో చేసిన సింహం ఉంటుంది. కిరీటంపై విష్ణుతల్పమైన శేషుడి చిత్రం ఉంటుంది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం దర్శనమిస్తుంది. అమ్మవారి విగ్రహం ఉత్తరం లేదా తూర్పు దిక్కును చూస్తున్నట్టు ఉండటం సాధారణం. ఇక్కడ మాత్రం పశ్చిమ దిక్కును చూసేవిధంగా ఉంటుంది.

ఆలయ కుడ్యాలపైన, విశాలమైన ప్రాంగణంలోనూ అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుంటుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. శుక్రవారం సాయంత్రం, పౌర్ణమి నాడు అమ్మవారికి ఊరేగింపు నిర్వహిస్తారు.

పురాణ కథలను అనుసరించి.. అగస్త్య మహామునికి వృద్ధాప్యంలో సుదూరంగా ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టమై శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా.. కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపించమన్నాడు. కొల్హాపుర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్య ఫలాన్ని ఇస్తుంది- అన్నాడు పరమశివుడు. ఈ నగరానికి కరవీరపురం, కోల్‌పుర్‌, కోల్‌గిరి, కొలదిగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ‘కొల్లా’ అంటే లోయ అని, ‘పురం’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లింది. కొల్హాపుర్‌ క్షేత్రం ఛత్రపతి శివాజీ ఏలుబడిలో అభివృద్ధి చెందింది.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని