ఆధ్యాత్మిక చింతన.. ఆత్మాన్వేషణ!

మనం చేపట్టే ఎలాంటి కార్యకలాపాలకైనా ఆలోచనలే ఆధారం. అవి మంచివైతే సత్సంకల్పాలకు శ్రీకారం చుడతాయి, చెడువైతే దుర్మార్గాలను ప్రేరేపిస్తాయి. ఆలోచనలకు ఆధ్యాత్మికత తోడైతే.. అవి ఆత్మాన్వేషణ దిశగా మరలుతాయి.

Published : 22 Feb 2024 04:46 IST

ఫిబ్రవరి 22 ప్రపంచ చింతనా దినోత్సవం

మనం చేపట్టే ఎలాంటి కార్యకలాపాలకైనా ఆలోచనలే ఆధారం. అవి మంచివైతే సత్సంకల్పాలకు శ్రీకారం చుడతాయి, చెడువైతే దుర్మార్గాలను ప్రేరేపిస్తాయి. ఆలోచనలకు ఆధ్యాత్మికత తోడైతే.. అవి ఆత్మాన్వేషణ దిశగా మరలుతాయి. లోకంలో ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకునే వివేకాన్ని ప్రసాదిస్తాయి.

కరోజు గౌతముడు రథంపై వాహ్యాళికి బయల్దేరాడు. సారథి రథాన్ని పురవీధుల్లో పరుగులు తీయిస్తున్నాడు. అంతఃపురవాసమే తప్ప ఆవలి ప్రపంచమే తెలియని సిద్ధార్థుడికి లోకమంతా కొత్తగా కనిపించసాగింది. ఆ శౌర్య వంశపు యువరాజు తొలి ప్రయాణంలోనే వరుసగా ఓ వ్యాధిగ్రస్థుణ్ణి, ఓ వృద్ధ్థుణ్ణి, ఓ శవయాత్రనూ చూడాల్సి వచ్చింది. రాణివాసాలు, రాజభోగాలే తప్ప కష్టాలు, కన్నీళ్లనేవి తెలియని సిద్ధార్థుడు ఆశ్చర్యంగా ‘ఎవరు వీళ్లు? ఏమిటిదంతా?’ అనడిగాడు. ‘వ్యాధులు, వృద్ధాప్యం, జనన మరణాలు.. ఇవన్నీ సర్వసాధారణం. ఎవరికీ ఇవి తప్పవు’ అని బదులిచ్చాడు రథసారథి. గౌతముడి గుండె బరువెక్కింది. రథం ముందుకు సాగుతూనే ఉంది. అప్పటికే పొద్దువాలింది. సాయంసంధ్య వెలుగుల్లో ఆ యువరాజుకు ప్రశాంత వదనుడైన ఓ సన్యాసి తారసపడ్డాడు. ‘ఎవరితడు? ఇంత నిర్మలంగా ఎలా ఉన్నాడు?’ అనడిగాడు. ‘ఇతడు సర్వసంగ పరిత్యాగి! ఏ బంధాలూ, బాధలూ లేవు! అందుకే ఇంత ఆనందంగా ఉన్నాడు’ అన్నాడు సారథి. వెంటనే రథం వెనక్కి తిప్పమన్నాడు గౌతముడు. ఆ కలతతో గౌతముడికి ఎన్నో రాత్రులు సరిగా నిద్రయినా పట్టలేదు. ఆ యోచనలు సిద్ధార్థుణ్ణి ఉన్నతమైన ఆశయం వైపు మళ్లించాయి. తీవ్ర సంఘర్షణ అనంతరం.. తన భవిష్యత్తుకు సంబంధించిన విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఓ అర్ధరాత్రి సిరిసంపదలనూ, ఆలుబిడ్డలనూ వదిలేసి సత్యాన్వేషణ చేసేందుకు బయల్దేరాడు. అనేక సాధనల అనంతరం ఆనంద ప్రాప్తితో గౌతమ బుద్ధుడయ్యాడు. ఆ ఒక్క తలంపు ఆయన జీవితాన్నే మార్చేసింది. శోధనలే మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. ఆ భావనతోనే సిద్ధార్థుడు ఓ సత్సంగంలో ‘మనమేంటో నిర్వచించేది మన ఆలోచనలే’ అన్నాడు.

అనుభవాలు.. ఆలోచనలు..

మనందరికీ పాఠాలు నేర్పేందుకు, అంతర్ముఖులై ఆత్మాన్వేషణ దిశగా మరలేందుకు భగవంతుడు అదృశ్యంగా ఉండే ఎన్నో అనుభవాల్ని కల్పిస్తాడు. కానీ మనకెదురైన కష్టనష్టాలను తోసిపుచ్చేస్తుంటాం. ఆలోచించే శక్తి ఉన్నా, సద్వినియోగ పరచుకోకుండా యథాలాపంగా బతుకును ఈడుస్తుంటాం. శ్రీకృష్ణుడు భగవద్గీత సాంఖ్యయోగంలో ‘అర్జునా! బుద్ధిని ప్రయత్నపూర్వకంగా ఏకాగ్రం చేసుకుని నీ జీవిత లక్ష్యమేంటో ఆలోచించుకో! ప్రయత్నం లేకుంటే బుద్ధి పరిపరి విధాల పరుగెడుతుంది’ అన్నాడు. అలా కొనసాగిన ప్రయత్నాలు లౌకిక విజయాలను అందిస్తాయి. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు చక్కటి అనుభూతులను కూడా ప్రసాదిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచన అమృతతుల్యం. ఆలోచనలు సాగే కొద్దీ కొత్త భావాలు, కొత్త సత్యాలు ఆవిష్కృతమౌతాయి.

సత్సంకల్పాలతో సర్వత్రా మేలు

పురాణాల్లో మహానుభావుల సదాలోచనలు సత్సంకల్పాలకు దారితీశాయి. అవి లోకానికి మేలు చేయడమే కాకుండా, వారి యశస్సు విశ్వవ్యాప్తమవుతుంది. భగీరథుడి మహోన్నత ఆలోచనే ఉత్కృష్ట సంకల్పంగా మారి.. దివిలో ఉన్న గంగ భువిపై అవతరించేలా చేసింది. ‘ఆలోచనలు మన మానసిక, శారీరక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’ అన్నారు యోగవిద్యను ప్రసాదించిన పతంజలి మహర్షి. ‘మనోక్లేశాలు, శారీరక రుగ్మతలకు దురాలోచనలే కారణం. ఒక మహత్తర ఆశయంతో స్ఫూర్తి పొందినప్పుడు, ఏదైనా అసాధారణ కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు- బిగుసుకున్న సంకెళ్లు సైతం తెగిపోతాయి. మీ మనసు అన్ని పరిమితులనూ అధిగమిస్తుంది. మీ చైతన్యం అన్ని దిశల్లోనూ విస్తరిస్తుంది. మీరొక అందమైన, సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు. మీలో నిద్రాణంగా ఉన్న శక్తులూ, లక్షణాలూ, ప్రతిభ సజీవమవుతాయి’ అంటూ హితవు పలికారు పతంజలి మహర్షి.

అదే అన్ని మతాల ప్రబోధం

హైందవమే కాదు.. సమాజానికి నైతికతను, ధార్మికతను ప్రబోధించే ఏ మతం కూడా దుష్టచింతనల్ని సమర్థించదు. అందుకే ‘పవిత్రత లోపించిన ఆలోచన, అపవిత్ర కార్యంతో సమానమే’ అన్నాడు ఏసుక్రీస్తు. చెడు తలంపులు పాపాలు చేసేలా ప్రేరేపిస్తాయి. ఆలోచనల స్థాయిలోనే కల్మష భావనలను కట్టడి చేస్తే, అవి కార్యరూపం దాల్చవు. ఆధునిక మనస్తత్వ నిపుణులు కూడా ‘నీ మనసులో ఉదయించే యోచన నైజం ఎటువంటిదైనా, అది మెదడులో శాశ్వతంగా ఒక గుర్తును ముద్రించిపోతుంది. ఆలోచనలు, సంస్కారాలతో శీలం రూపొందుతుంది’ అని చెబుతున్నారు. రావణ, దుర్యోధనాదులు దురాలోచనలను దొంతరలుగా పేర్చుకుంటూ పోయారు. తమకు తగ్గవారినే అనుయాయులుగా చేరదీశారు. సాక్షాత్తూ అవతార మూర్తులనే తక్కువ అంచనా వేసేంత అహంకారపూరితులయ్యారు.

మహాత్ముల మంచి లక్షణం

ఒక్కసారి మనసు ఉన్నత స్వభావాన్ని అలవరచుకుంటే.. ఇక ఎన్నటికీ అధమత్వం వైపు మరలదు. మట్టిలో ఏ విత్తనం నాటితే ఆ మొక్కే ఎదిగినట్లు, మనసులో ఎలాంటి తలంపులకు తావిస్తే, అవే అంకురించి కార్యరూపం దాలుస్తాయి. ‘ఉన్నతమైన చింతనలతో జీవితాన్ని మలచుకోండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరమంతా మంచే ఉండాలి. అదే విజయానికి దారి! మహాత్ములంతా ఇలా అంకితమైనవారే!’ అన్నారు స్వామీ వివేకానంద. ఆధ్యాత్మిక మార్గంలోని సద్గురువులు శిష్యుల ఆలోచనలను పరిశీలించటంతోనే తమ శిక్షణను ఆరంభిస్తారు. దివ్యశక్తితో శిష్యుల మనసులోని చింతనలను చిత్రిక పట్టి సంస్కరిస్తారు.

అంతరంగ పరిశీలన

‘ఎప్పుడో ఒకప్పుడు.. ఎవరికైనా ఆత్మచింతన తప్పదు’ అన్నారు రమణ మహర్షి. మనకు మనమే దూరంగా నిలబడి, అంతరంగాన్ని గమనించమంటుంది యోగ శాస్త్రం. ఇది మనసుకు శిక్షణనిచ్చే కార్యక్రమాలన్నింటిలో కష్టమైంది. అలా చూడగలిగినవారు తమ జీవితాలను వెలిగించుకోవటమే కాదు, ఇతరులకూ వెలుగులు పంచుతారు. ‘కొందరు అన్ని పనులు చేస్తూనే ఆత్మచింతన చేసి జ్ఞానులవుతారు. జనక, వశిష్ఠాదులు అందుకు దృష్టాంతం. కొందరికి అది అవరోధంగా తోచి, నిర్జన ప్రదేశాలకు వెళ్లి ఆత్మచింతనతో జ్ఞానాన్ని పొందుతారు. అందుకు బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాదులు ఉదాహరణ.

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని